UP Politics: అన్ని పార్టీల దృష్టి ఆ వర్గాలపైనే.. యూపీలో ఊపందుకున్న కుల సమీకరణాలు

| Edited By: Janardhan Veluru

Jul 30, 2024 | 11:47 AM

భారతీయ జనతా పార్టీ (BJP) విషయానికొస్తే.. యాదవులు మినహా ఇతర ఓబీసీ సామాజికవర్గాలు, అగ్రవర్ణాలు, దళిత వర్గాల్లో కొందరి అండతో వరుసగా విజయాలు సాధిస్తూ చ్చిన ఈ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో ఈ మూడు వర్గాలు దెబ్బకొట్టాయి. మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని, రిజర్వేషన్లు రద్దు చేస్తారని విపక్షాలు చేసిన ప్రచారం ప్రభావంతో దళిత, ఓబీసీ వర్గాల్లో చాలా మంది దూరమవగా.. టికెట్ల కేటాయింపులో ఠాకూర్లకు తగిన ప్రాతినిథ్యం, ప్రాధాన్యత దక్కలేదన్న ఆక్రోశానికి తోడు..

UP Politics: అన్ని పార్టీల దృష్టి ఆ వర్గాలపైనే.. యూపీలో ఊపందుకున్న కుల సమీకరణాలు
Uttar Pradesh Politics
Follow us on

లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP)కి ఊహించని దెబ్బకొట్టిన ఉత్తర్‌ప్రదేశ్‌లో అధికార, విపక్ష కూటమి పార్టీలు మరో రెండేళ్లలో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయి. జరిగిన నష్టాన్ని పూడ్చుకుని మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందాలని కమలనాథులు భావిస్తుంటే.. లోక్‌సభ ఎన్నికల్లో మాదిరిగానే అసెంబ్లీ ఎన్నికల్లోనూ వివిధ సామాజికవర్గాలను ఆకట్టుకుంటూ కలసికట్టుగా కమలదళాన్ని ఓడించాలని విపక్ష కూటమి (I.N.D.I.A) పార్టీలు సమాజ్‌వాదీ (SP), కాంగ్రెస్ భావిస్తున్నాయి. ఈ క్రమంలో వివిధ వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్థిని చిత్తు చేసే ప్రయత్నాల్లో రెండు కూటములు మునిగి తేలాయి. రాజకీయ చదరంగంలో ఒకరికొకరు ‘చెక్ మేట్’ పెట్టెందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.

ముందుగా భారతీయ జనతా పార్టీ (BJP) విషయానికొస్తే.. యాదవులు మినహా ఇతర ఓబీసీ సామాజికవర్గాలు, అగ్రవర్ణాలు, దళిత వర్గాల్లో కొందరి అండతో వరుసగా విజయాలు సాధిస్తూ చ్చిన ఈ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో ఈ మూడు వర్గాలు దెబ్బకొట్టాయి. మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని, రిజర్వేషన్లు రద్దు చేస్తారని విపక్షాలు చేసిన ప్రచారం ప్రభావంతో దళిత, ఓబీసీ వర్గాల్లో చాలా మంది దూరమవగా.. టికెట్ల కేటాయింపులో ఠాకూర్లకు తగిన ప్రాతినిథ్యం, ప్రాధాన్యత దక్కలేదన్న ఆక్రోశానికి తోడు.. తమ వర్గానికే చెందిన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను బీజేపీ అగ్రనాయకత్వం దూరం పెడుతోందన్న భావన ఆ వర్గం ఓటర్లలో నెలకొంది. ఫలితంగా వారంతా కలసికట్టుగా బీజేపీకి పూర్తి వ్యతిరేకంగా పనిచేశారు. తమ సంఖ్యాబలం పెద్దగా లేనప్పటికీ, రాష్ట్రంలో భూస్వామ్య సామాజికవర్గమైన ఠాకూర్లు… అనేక ఇతర వర్గాలను ప్రభావితం చేయగలరు. ఈ కారణాలు బీజేపీకి శరాఘాతంగా మారాయి. దేశంలోనే అత్యధిక లోక్‌సభ స్థానాలు (80) ఉన్న ఈ రాష్ట్రంలో కమలదళం గత ఎన్నికలతో పోల్చితే ఏకంగా 9.57 శాతం ఓట్లను కోల్పోయి 43.31% ఓట్లతో కేవలం 36 సీట్లను గెలుపొందగలిగింది. అదే సమయంలో విపక్ష కూటమి 19.05 శాతం ఓట్లను పెంచుకుని 43.52% ఓట్లతో 43 సీట్లను గెలుపొందింది. ఒక్క సీటులో ఈ రెండు కూటముల్లోనూ లేని ఆజాద్ సమాజ్ పార్టీ (ASP) అధినేత చంద్రశేఖర్ ఆజాద్ గెలుపొందారు. అధికార, విపక్ష కూటముల మధ్య ఓట్ల శాతంలో పెద్ద తేడా లేనప్పటికీ బీజేపీ సారథ్యంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) దాదాపు 10 శాతం ఓట్లను కోల్పోవడంతో సీట్ల సంఖ్యలో భారీగా కోత పడింది. ఈ ఎన్నికల ఫలితాలపై జాతీయ, రాష్ట్రస్థాయిలో అంతర్మథనం, ఆత్మపరిశీలన చేసుకున్న కమలదళం.. తమకు దూరమైన దళిత, ఓబీసీ వర్గాలను మళ్లీ దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేస్తోంది.

అదే సమయంలో సమాజ్‌వాదీ పార్టీ (SP) తన రాజకీయ పునాదిని పిఛ్‌డా (వెనుకబడిన తరగతులు), దళిత్, అల్ప సంఖ్యాక్ (మైనారిటీ) – PDA వర్గాలకు మాత్రమే పరిమితం చేయకుండా, అగ్రవర్ణాల్లో గణనీయమైన సంఖ్యలో ఉన్న బ్రాహ్మణులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. తద్వారా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది రాష్ట్ర అధికార పీఠంపై పాగా వేయాలని అఖిలేశ్ యాదవ్ భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన మాతా ప్రసాద్ పాండేను నియమించారు. నిజానికి ఈ బాధ్యతను తమ కుటుంబానికి చెందిన శివపాల్ యాదవ్ లేదా పార్టీలో సీనియర్లుగా ఉన్న ఇంద్రజిత్ సరోజ్, రామ్ అచల్ రాజ్‌భర్ తూఫానీ సరోజ్‌ వంటి ఓబీసీ నేతల్లో ఒకరిని నియమిస్తారని అందరూ భావించారు. కానీ అందరి ఊహలు, అంచనాలను తలకిందులు చేస్తూ అఖిలేశ్ యాదవ్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.

ఓబీసీ-దళిత ఓట్ల కమల దళం కన్ను

బీజేపీకి బలమైన ఓటుబ్యాంకుగా నిలిచిన ఓబీసీల్లో విశ్వాసం కల్గిస్తూ.. దళితవర్గాలను ఆకట్టుకోవడంపై బీజేపీ దృష్టి సారించింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత యూపీలో పార్టీలో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో నియమితులైన వారిలో ఓబీసీ, దళిత వర్గాలకు చెందిన నేతలకు అగ్రభాగం దక్కింది. మోడీ ప్రభుత్వం శనివారం కొత్తగా ఆరుగురు గవర్నర్లను నియమించింది. వారిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు నేతలున్నారు. ఒకరు సంతోష్ కుమార్ గంగ్వార్ కాగా, మరొకరు లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. సంతోష్ కుమార్ గంగ్వార్‌ను జార్ఖండ్ గవర్నర్‌గా నియమించగా, లక్ష్మణ్ ఆచార్యను అస్సాం గవర్నర్‌గా నియమిస్తూ.. మణిపూర్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. గవర్నర్ నియామకానికి ముందు, స్వామి ప్రసాద్ మౌర్య రాజీనామాతో ఖాళీ అయిన శాసన మండలి స్థానానికి మౌర్య సామాజిక వర్గానికి చెందిన బహోరన్ లాల్ మౌర్యను బీజేపీ ఎమ్మెల్సీగా చేసింది. సంతోష్ కుమార్ గంగ్వార్ మరియు బహోరన్ లాల్ మౌర్య ఇద్దరూ ఓబీసీ వర్గాలకు చెందిన నేతలే. ఇకపోతే లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య దళిత వర్గానికి చెందిన నేత.

ఓబీసీ ఓట్ల ఆధారంగానే ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ తన రాజకీయ అజ్ఞాతవాసాన్ని ముగించింది 2014 నుంచి వరుసగా విజయాలు సాధిస్తూ వచ్చింది. 2014 ఎన్నికల్లో యాదవేతర OBCలు, జాతవేతర దళితులపై దృష్టి సారించి బలమైన సోషల్ ఇంజనీరింగ్‌ చేసింది. అప్పటి వరకు ఓబీసీల పేరుతో యాదవులకు మాత్రమే ప్రాధాన్యత దక్కగా, దళిత రాజకీయాల్లో ‘జాతవ్’ వర్గానికి చెందిన దళితులకు మాత్రమే ప్రాధాన్యత దక్కింది. బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ ఫలితంగా ఈ రెండు వర్గాల్లో మిగతా సామాజికవర్గాలు కమలదళం వెంట నడిచాయి. అయితే 2024 లోక్‌సభ ఎన్నికలలో సమాజ్‌వాదీ పార్టీ PDA (ఓబీసీ, దళిత, మైనారిటీ) ఫార్ములా కారణంగా బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ ఫలించలేదు. యాదవులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారన్న ముద్రను చెరిపి వేయాలన్న సంకల్పంతో అఖిలేశ్ యాదవ్ తన కుటుంబానికి చెందిన 5 గురు యాదవులకు తప్ప మరెవరికీ టికెట్ ఇవ్వకుండా ఇతర ఓబీసీ వర్గాలకు టికెట్లు కేటాయించారు. ఫలితంగా కుర్మీ, కొయేరీ, నిషాద్ వంటి ఓబీసీ కులాలు ఈసారి సమాజ్‌వాదీ పక్షాన నిలిచాయి.

నిర్ణయాత్మక శక్తిగా ఓబీసీలు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 56 శాతం జనాభా ఉన్న ఓబీసీలు రాజకీయంగా నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. అందుకే అన్ని పార్టీలు ఈ వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఓబీసీ కులాల ఓటింగ్ సరళిని పరిశీలిస్తే, బీజేపీ, దాని మిత్రపక్షాల ఓట్ల శాతం తగ్గుముఖం పట్టగా, ఎస్పీ, కాంగ్రెస్ కూటమికి లబ్ధి చేకూరింది. ఓబీసీ ఓట్లు జారిపోవడంతో యూపీలో బీజేపీ సీట్లు 2019తో పోలిస్తే 29 సీట్లు తగ్గాయి. ఈ సీట్ల సంఖ్యతో బీజేపీ మెజారిటీకి దూరంగా ఉండి మిత్రపక్షాల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది.

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మిగిల్చిన చేదు అనుభవం నుంచి తేరుకున్న కమలదళం 2027 అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించింది. తన రాజకీయ సమీకరణాలను సరిదిద్దుకుంటూ ముందుకెళ్తోంది. ఇందుకోసం రాష్ట్రంలో జరిగే అన్ని నియామకాల్లోనూ ఓబీసీలకే పట్టం కడుతున్నారు. ఓబీసీలను తమకు అనుకూలంగా మలచుకునేందుకు బీజేపీ కింది స్థాయి నుంచి కసరత్తు ప్రారంభించింది. జూలై 29న లక్నోలో బీజేపీ ఓబీసీ విభాగం సమావేశం నిర్వహించింది. ఇందులో సీఎం యోగి ఆదిత్యనాథ్, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.

సమాజ్‌వాది పార్టీ వ్యూహాలు ఇలా..

అదే సమయంలో లోక్‌సభ ఎన్నికల నాటికి ఏర్పడిన రాజకీయ వాతావరణాన్ని 2027 వరకు కొనసాగించడమే కాకుండా 2024లో వచ్చిన ఓట్ల శాతాన్ని మరింత పెంచుకునేందుకు ఎస్పీ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం బీజేపీ ప్రధాన ఓటు బ్యాంకుగా భావించే బ్రాహ్మణ వర్గాన్ని తమవైపు తిప్పుకోవడం కోసం మాతా ప్రసాద్ పాండేను శాసనసభా పక్ష నేతగా నియమించింది. మాతా ప్రసాద్ పాండే యూపీలోని పూర్వాంచల్ ప్రాంతం నుండి వచ్చారు. ఇక్కడ ఠాకూర్లు, బ్రాహ్మణుల మధ్య రాజకీయంగా ఆధిపత్య పోరు ఉంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఠాకూర్ సామాజికవర్గం నుంచి ఉండడంతో, బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన మాతా ప్రసాద్ పాండేను సమాజ్‌వాదీ పార్టీ వ్యూహాత్మకంగా అసెంబ్లీ ప్రతిపక్ష నేతను చేసింది. యూపీలో దాదాపు 10 శాతం బ్రాహ్మణ ఓటర్లు ఉన్నారు. వారిలో వీలైనంత ఓటుబ్యాంకును తమవైపు తిప్పుకోవాలని ఎస్పీ చూస్తోంది. పీడీఏ ఫార్ములా గురించి మాట్లాడుతున్నప్పటికీ, తాము బ్రాహ్మణులకు వ్యతిరేకం కాదని, కీలక పదవులు ఇవ్వడంలో వెనుకాడమని సంకేతమిస్తూ మాతా ప్రసాద్ పాండేను ప్రతిపక్ష నేత పదవికి ఎంపిక చేసింది. దీని వెనుక అఖిలేష్ మరో వ్యూహం ఏంటంటే.. ఎస్పీ ఎమ్మెల్యేలు మనోజ్ పాండే, రాకేష్ పాండే, వినోద్ చతుర్వేది బీజేపీ వైపు మొగ్గు చూపడంతో ఎస్పీలో తమ ప్రాధాన్యత తగ్గుతోందన్న భావన బ్రాహ్మణ వర్గానికి అందింది. తాజాగా తీసుకున్న నిర్ణయంతో బ్రాహ్మణ సమాజానికి ఓ సందేశం ఇస్తూ తమవైపు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా రెండు పక్షాలు తమ ఓటుబ్యాంకును కాపాడుకుంటూ ప్రత్యర్థి ఓటుబ్యాంకును చీల్చి తమవైపు ఆకట్టుకునే ప్రయత్నాల్లో మునిగితేలుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి