YADAV POLITICS: నాడు వారే బలం.. బలగం.. నేడు వారే పార్టీకి శిరోభారం.. అందుకే దూరం దూరం!

యాదవ ఓటుబ్యాంకుకు ముస్లిం ఓటుబ్యాంకును జోడించి నాలుగు పర్యాయాలు అధికారాన్ని చేపట్టిన సమాజ్‌వాదీ పార్టీ (SP) తమ పాలనలో ఈ రెండు వర్గాలు పెద్దపీట వేసింది. ఈ క్రమంలో సమాజ్‌వాదీ పార్టీ అంటేనే యాదవ-ముస్లిం పార్టీగా ముద్ర మీద వేసుకుంది.

YADAV POLITICS: నాడు వారే బలం.. బలగం.. నేడు వారే పార్టీకి శిరోభారం.. అందుకే దూరం దూరం!
Akhilesh Yadav
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Apr 30, 2024 | 12:40 PM

ఉత్తరప్రదేశ్ రాజకీయాలు పూర్తిగా వెనుకబడిన వర్గాల (OBC) చుట్టూనే తిరుగుతున్నాయి. రాష్ట్రంలోని ఓబీసీ జనాభాలో అత్యధికంగా యాదవ సామాజికవర్గం ఉంది. యాదవ ఓటు బ్యాంకు ఆధారంగా సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ మూడు పర్యాయాలు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించగా.. ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ ఒక పర్యాయం ముఖ్యమంత్రిగా అధికారం చెలాయించారు. యాదవ ఓటుబ్యాంకుకు ముస్లిం ఓటుబ్యాంకును జోడించి నాలుగు పర్యాయాలు అధికారాన్ని చేపట్టిన సమాజ్‌వాదీ పార్టీ (SP) తమ పాలనలో ఈ రెండు వర్గాలు పెద్దపీట వేసింది. ఈ క్రమంలో సమాజ్‌వాదీ పార్టీ అంటేనే యాదవ-ముస్లిం పార్టీగా ముద్ర మీద వేసుకుంది.

ఒకప్పుడు అధికారాన్ని అందించిన ఈ సామాజిక సమీకరణాలే ఇప్పుడు ఆ పార్టీకి భారంగా, శాపంగా మారాయి. ఇదివరకు ఓబీసీలు, ముస్లింలు ఓటేస్తే చాలు.. సమాజ్‌వాదీ గెలుపొందగలిగేది. కానీ 2014 తర్వాత నుంచి పరిస్థితులు మారాయి. ఉత్తరప్రదేశ్‌లో యాదవ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు రాష్ట్ర జనాభాలో 8 శాతం ఉన్నారు. ఓబీసీ జనాభాలో యాదవులు 20 శాతం వరకు ఉన్నారు. అంటే ప్రతి ఐదుగురు ఓబీసీల్లో ఒకరు యాదవ వర్గానికి చెందినవారని అర్థమవుతోంది. సమాజ్‌వాదీ దృష్టిలో ఓబీసీలు అంటే యాదవులు మాత్రమేనని, యాదవేతర ఓబీసీలకు ఆ పార్టీలో ప్రాధాన్యత లేదు అని మిగతా వర్గాలు గ్రహించాయి. వారిని భారతీయ జనతా పార్టీ (BJP) తమ ఓటుబ్యాంకుగా మార్చుకుంది. అంటే ప్రతి ఐదుగురు ఓబీసీల్లో ఒక యాదవ ఓటరు మినహా మిగతా నలుగురు ఓబీసీ ఓటర్లు బీజేపీకి దగ్గరైన పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిస్థితి సమాజ్‌వాదీకి శరాఘాతంగా మారింది. ఫలితంగా వరుస ఓటములు చవిచూస్తూ వచ్చింది. చివరకు 2019 సార్వత్రిక ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ (BSP)తో జట్టుకట్టి పోటీ చేసినా ఫలితం లేకపోయింది.

అందుకే ఈసారి తమకు భారంగా, శాపంగా మారిన యాదవ పరివారం నుంచి దూరంగా జరిగింది. ఆ పార్టీ ఆవిర్భావించినప్పటి నుంచి ఇప్పటి వరకు తొలిసారిగా అతి తక్కువ సంఖ్యలో యాదవులకు సీట్లు ఇవ్వగా.. ఆ సీట్లన్నీ ములాయం కుటుంబ సభ్యులవే కావడం మరో కీలకాంశం. అంటే ములాయం కుటుంబేతర యాదవ నేతలెవరికీ ఈసారి సీట్ దక్కలేదు. మరోవైపు ఈ వర్గం నుంచి రాబట్టుకునే ఓట్లు పెద్దగా లేవని గ్రహించిన బీజేపీ సైతం ఒక్క సీటు (దినేశ్ లాల్ యాదవ్ నిరాహువా)తోనే సరిపెట్టింది. బీఎస్పీ అధినేత్రి మాయావతి మాత్రం వ్యూహాత్మకంగా సమాజ్‌వాదీతో సమానంగా యాదవ్ అభ్యర్థులకు సీట్లు కేటాయించారు.

2024 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 80 స్థానాల్లో 62 స్థానాల్లో సమాజ్‌వాదీ పోటీ చేస్తోంది. మిగిలిన స్థానాల్లో మిత్రపక్షాలు పోటీ చేస్తున్నాయి. ఈ 62 మందిలో సమాజ్‌వాదీ తరఫున పోటీ చేస్తున్న ఐదుగురు యాదవ్ అభ్యర్థుల్లో అఖిలేష్ యాదవ్ స్వయంగా కన్నౌజ్ స్థానం నుంచి బరిలోకి దిగారు. ఆయన సతీమణి డింపుల్ యాదవ్ మెయిన్‌పురి స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అజంగఢ్‌ నుంచి ధర్మేంద్ర యాదవ్‌ పోటీ చేస్తుండగా.. శివపాల్‌ యాదవ్‌ కుమారుడు ఆదిత్య యాదవ్‌ బదౌన్‌ నుంచి, రాంగోపాల్‌ యాదవ్‌ కుమారుడు అక్షయ్‌ యాదవ్‌ ఫిరోజాబాద్‌ నుంచి పోటీ చేస్తున్నారు. ములాయం కుటుంబానికి చెందిన వీరికి మినహా యాదవ సామాజిక వర్గానికి చెందిన ఏ ఒక్క నేతకు సమాజ్‌వాదీ పార్టీ టికెట్ కేటాయించలేదు.

సమాజ్‌వాదీ పార్టీ ఆవిర్భవించిన తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో ఇంత తక్కువ మంది యాదవులకు టికెట్లు ఇవ్వడం ఇదే తొలిసారి. పార్టీ 1992లో ఏర్పడిన తర్వాత 1996లో తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో ఎస్పీ 8 మంది యాదవ్ అభ్యర్థులను నిలబెట్టింది. దీని తర్వాత, 1998లో 10 మంది, 1999లో 9 మంది, 2004లో 9 మంది, 2009లో 11 మంది, 2014లో 13 మంది, 2019లో 11 మంది యాదవ సామాజికవర్గానికి చెందిన నేతలు అభ్యర్థులుగా బరిలోకి దిగారు. అలా సమాజ్‌వాదీ పార్టీ ఏర్పడినప్పటి నుంచి 2014 వరకు అత్యధికంగా 13 మంది యాదవ అభ్యర్థులను నిలబెట్టగా, కనిష్టంగా 1996లో 8 మంది అభ్యర్థులను బరిలోకి దింపినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈసారి ఆ కనిష్టం కంటే తక్కువ సంఖ్యలో అఖిలేష్ యాదవ్ కేవలం ఐదుగురు యాదవ నేతలను మాత్రమే బరిలోకి దించి భిన్నమైన రాజకీయ ఎత్తుగడ వేశారు.

2014లో 13 మంది యాదవ సామాజికవర్గ అభ్యర్థులకు ఎస్పీ టిక్కెట్లు ఇవ్వగా, అందులో ములాయంతో సహా ఐదుగురు నేతలు విజేతలుగా నిలిచారు. అలాగే 2019లో 11 మంది యాదవులకు టిక్కెట్లు లభించగా, పార్టీ కేవలం 5 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అందులో ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ మినహా యాదవ అభ్యర్థులెవరూ ఎన్నికల్లో గెలుపొందలేకపోయారు. అందుకే ఈసారి ములాయం కుటుంబేతర యాదవ నేతలను బరిలోకి దించడం లేదని తెలుస్తోంది. యాదవ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న పూర్వాంచల్ ప్రాంతంలోనూ ఒకే ఒక్క సీటును తమ కుటుంబానికి చెందిన ధర్మేంద్ర యాదవ్‌కు కేటాయించింది తప్ప మరెవరికీ టికెట్ కేటాయించలేదు.

యాదవ అసంతృప్తులపై మాయావతి కన్ను!

ఓవైపు సమాజ్‌వాదీ పార్టీ తమపై పడ్డ ముద్రను చెరిపేసుకోవడం కోసం యాదవ నేతలకు సీట్లు కట్ చేసి దూరం పెడుతుంటే.. బీఎస్పీ అధినేత్రి మాయావతి మాత్రం ఈసారి యాదవ సామాజికవర్గం నుంచి నలుగురు అభ్యర్థులను బరిలోకి దింపారు. మెయిన్‌పురి నుంచి శివప్రసాద్ యాదవ్, రాయ్ బరేలీ నుంచి ఠాకూర్ ప్రసాద్ యాదవ్, సీతాపూర్ నుంచి మహేంద్ర యాదవ్, బల్లియా నుంచి లాలన్ యాదవ్‌లకు బీఎస్పీ లోక్‌సభ టికెట్ ఇచ్చింది. 2004లో రాష్ట్రంలో ములాయం సింగ్ యాదవ్ అధికారంలో ఉన్నప్పుడు నలుగురు యాదవ్ సామాజికవర్గానికి చెందిన ఎంపీలు బీఎస్పీ టిక్కెట్‌పై గెలుపొంది ఎంపీలు అయ్యారు.

అంతేకాదు, ఆ పార్టీ తరఫున ఎన్నికైన మొదటి ఎంపీ కూడా యాదవ్ సామాజికవర్గానికి చెందినవాడే. యాదవ్ కమ్యూనిటీ ఏ రోజూ మాయావతి ప్రధాన ఓటు బ్యాంకు కాదు. అయినప్పటికీ యాదవ్ ఎంపీలు బీఎస్పీ నుంచి ఎన్నికయ్యారు. యాదవ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్న పూర్వాంచల్ ప్రాంతం నుంచే బీఎస్పీ టిక్కెట్‌పై యాదవ ఎంపీలు గెలుస్తూ వచ్చారు. అందుకే బీఎస్పీ ఈసారి ఇటావా బెల్ట్‌లో ఒక్క టిక్కెట్టును, అవధ్‌లో మిగిలిన రెండు, పూర్వాంచల్ ప్రాంతంలో ఒక టికెట్‌ను ఇచ్చింది. మెయిన్‌పురి సీటు మినహా మరే సీటులోనూ బీఎస్పీ అభ్యర్థికి, యాదవ వర్గానికి మధ్య ముఖాముఖి పోరు లేదు. ఈ పరిస్థితుల్లో యాదవ ఓట్లు బీఎస్పీ యాదవ అభ్యర్థుల వైపు మొగ్గు చూపితే, అది సమాజ్‌వాదీకి మరింత నష్టం కల్గించే ప్రమాదం ఉంది.

ఇటావా, ఎటా, ఫరూఖాబాద్, మెయిన్‌పురి, ఫిరోజాబాద్, కన్నౌజ్, బదౌన్, అజంగఢ్, ఫైజాబాద్, బల్లియా, సంత్ కబీర్ నగర్, జాన్‌పూర్, రాయ్ బరేలీ, కుషీనగర్ వంటి నియోజకవర్గాల్లో యాదవుల ఆధిపత్యం కొనసాగుతోంది. రాష్ట్రంలోని 44 జిల్లాల్లో యాదవుల సంఖ్య 9 శాతం ఉండగా, 10 జిల్లాల్లో వీరి సంఖ్య 15 శాతానికి పైగా ఉంది. పూర్వాంచల్, అవధ్ మరియు బ్రిజ్ ప్రాంతాలలో యాదవ్ ఓటర్లు అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఉన్నారు.

ములాయం హయాంలో పెరిగిన ఆధిపత్యం

మండల్ కమీషన్ తర్వాత, ఉత్తర్‌ప్రదేశ్ యాదవ సామాజికవర్గం ఏకతాటిపైకి వచ్చింది. అది సమాజ్‌వాదీ పార్టీ వెన్నెముకగా మారింది. ఈ యాదవ ఓటర్ల బలంతో ములాయం సింగ్ యాదవ్ మూడుసార్లు, అఖిలేష్ యాదవ్ ఒకసారి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, SP రాజకీయ అరంగేట్రం కంటే ముందు, రామనరేష్ యాదవ్ జనతా పార్టీ నుండి ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్‌లో చేరినప్పటికీ ములాయం సింగ్‌ తరహాలో యాదవ నేతగా ముద్ర వేయలేకపోయారు. యూపీలో ఎస్పీ హయాంలో యాదవ సామాజికవర్గం రాజకీయంగానే కాకుండా ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా కూడా చాలా బలంగా తయారైంది. ములాయం, అఖిలేష్ ప్రభుత్వంలో యాదవులదే పైచేయి. ములాయం సింగ్ పొలిటికల్ గ్రౌండ్‌ను సరిగ్గా సిద్ధం చేసుకున్న తర్వాతకుటుంబీకులకు అప్పగించారు.

అజంగఢ్, మెయిన్‌పురి, కన్నౌజ్, ఫిరోజాబాద్, బదౌన్, సంభాల్ వంటి పార్లమెంటు స్థానాల్లో ములాయం కుటుంబమే ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చింది. ములాయం సింగ్ శాసనసభ నుండి లోక్‌సభ వరకు రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 1996లో ములాయం సింగ్ యాదవ్ మెయిన్‌పురి, సంభాల్ స్థానాల నుంచి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. రెండింటిలో ఒకదాన్ని వదులుకుని తన కుటుంబ సభ్యులకు అప్పగించడం ద్వారా ములాయం కుటుంబ సభ్యులు పార్లమెంటుకు చేరుకునే ప్రక్రియ మొదలైంది.

1998లో ములాయం సింగ్ సంభాల్ నుంచి తిరిగి ఎన్నికయ్యారు. అయితే 1999 ఎన్నికల్లో ములాయం సింగ్ మెయిన్‌పురి, కన్నౌజ్ స్థానాల నుండి ఎన్నికల్లో పోటీ చేసి రెండు స్థానాల్లో విజయం సాధించారు. కన్నౌజ్ సీటును విడిచిపెట్టిన ములాయం, అక్కణ్ణుంచి అఖిలేష్ యాదవ్‌ను బరిలోకి దించి ఎంపీని చేశారు. 2004లో ములాయం కుటుంబం నుంచి ముగ్గురు ఎన్నికల్లో పోటీ చేశారు. ములాయం సింగ్ మెయిన్‌పురి నుండి, అఖిలేష్ యాదవ్ కన్నౌజ్ నుండి మరియు రామ్ గోపాల్ యాదవ్ సంభాల్ నుండి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ముగ్గురు సభ్యులు విజయం సాధించారు. 2004లో ములాయం సింగ్ యాదవ్ యూపీ ముఖ్యమంత్రి అయినప్పుడు మెయిన్‌పురి సీటును విడిచిపెట్టారు. అప్పుడు అక్కణ్ణుంచి ధర్మేంద్ర యాదవ్ ఎంపీ అయ్యారు. 2009 ఎన్నికల్లో ములాయం కుటుంబం నుంచి నలుగురు పోటీ చేశారు.

ములాయం సింగ్‌ మెయిన్‌పురి నుంచి, ధర్మేంద్ర యాదవ్‌ బదౌన్‌ నుంచి పోటీ చేశారు. ఫిరోజాబాద్, కన్నౌజ్ స్థానాల నుంచి అఖిలేష్ యాదవ్ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆ స్థానాలను గెలుచుకోవడంలో అందరూ విజయం సాధించారు. ఆ తర్వాత అఖిలేష్ యాదవ్ ఫిరోజాబాద్ స్థానాన్ని వదిలిపెట్టి తన సతీమణి డింపుల్ యాదవ్‌ను బరిలోకి దించారు. అయితే ఆమె అప్పుడు గెలవలేకపోయారు. 2014లో ములాయం కుటుంబానికి చెందిన ఐదుగురు ఎన్నికల్లో పోటీ చేయగా మొత్తం ఐదుగురు విజయం సాధించారు.

2019లో కుటుంబం పనితీరు ఎలా ఉంది?

2014 ఎన్నికల్లో ములాయం సింగ్ యాదవ్ మెయిన్‌పురి, అజంగఢ్ స్థానాల నుండి ఎన్నికల్లో పోటీ చేశారు. డింపుల్ యాదవ్ కన్నౌజ్ నుంచి, ధర్మేంద్ర యాదవ్ బదౌన్ నుంచి, అక్షయ్ యాదవ్ ఫిరోజాబాద్ నుంచి పోటీ చేశారు. ములాయం సింగ్ మెయిన్‌పురి సీటును వదులుకున్నారు, ఆ తర్వాత తేజ్ ప్రతాప్ యాదవ్ ఎన్నికల్లో విజయం సాధించారు. 2014లో ములాయం కుటుంబానికి చెందిన ఆరుగురు కలిసి పార్లమెంటులో ఉన్నారు. ఐదుగురు లోక్‌సభ సభ్యులు, రామ్‌గోపాల్‌ యాదవ్‌ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. 2019లో ములాయం కుటుంబం నుంచి ఆరుగురు సభ్యులు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. అందులో అజంగఢ్ నుంచి అఖిలేష్ యాదవ్, మెయిన్‌పురి నుండి ములాయం సింగ్ యాదవ్ మాత్రమే గెలుపొందారు. కన్నౌజ్ నుంచి డింపుల్ యాదవ్, బదౌన్ నుంచి ధర్మేంద్ర యాదవ్, ఫిరోజాబాద్ నుంచి అక్షయ్ యాదవ్, శివపాల్ యాదవ్ ఓడిపోయారు.

ఈ పరిస్థితుల్లో 2024 లోక్‌సభ ఎన్నికల్లో ములాయం కుటుంబానికి చెందిన సభ్యులు తమ తమ స్థానాల్లో పోటీ చేస్తున్నారు. అయితే సోనియా, రాహుల్ గాంధీలు పోటీ చేస్తున్న రాయ్ బరేలి, అమేఠీ స్థానాలపై స్పెషల్ ఫోకస్ పెట్టి రాహుల్ గాంధీని ఓడించిన బీజేపీ, ఈసారి ములాయం పరివారం పోటీ చేస్తున్న స్థానాలపై అదే తరహా వ్యూహాలను అమలు చేస్తోంది. ఓవైపు యాదవేతర ఓబీసీలను ఏకం చేస్తూ.. మరోవైపు యాదవ ఓటు బ్యాంకు నుంచి కూడా చీలిక తెచ్చేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది.

ఏకాకిగా మారిన యాదవ పరివారం

ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో ప్రభావవంతమైన వర్గంగా మారిన యాదవులను అన్ని రాజకీయ పార్టీలు కలిసి చిన్నాభిన్నం చేసే పనిలో పడ్డాయని యాదవ మహాసభ అధ్యక్షుడు అనురాగ్ యాదవ్ అన్నారు. యూపీలోని అన్ని పార్టీలు యాదవ సామాజికవర్గాన్ని నిరాశపరిచాయని, వారి జనాభా నిష్పత్తికి అనుగుణంగా ఏ పార్టీ టిక్కెట్లు ఇవ్వలేదని మండిపడ్డారు. ఎస్పీ ఐదు టిక్కెట్లు ఇవ్వగా, మొత్తం ఐదుగురూ ములాయం కుటుంబ సభ్యులేనని వాపోయారు. వారిని యాదవ సమాజంగా చూడలేమని తెలిపారు. అఖిలేష్ యాదవ్ తన సొంత కమ్యూనిటీని విస్మరించి ఇతర ఓబీసీ కులాలకు ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. సమాజ్‌వాదీ పార్టీ యాదవుల కంటే కుర్మీ-పటేళ్లకే ఎక్కువ టిక్కెట్లు కేటాయించింది.

అయితే యాదవ సామాజికవర్గాన్ని దూరం పెట్టడం ద్వారా మిగతా ఓబీసీ ఓటర్లను ఆకట్టుకోవాలన్న సమాజ్‌వాదీ పార్టీకి.. రెండు విధాలా చేటు జరిగే పరిస్థితి కనిపిస్తోంది. అటు సొంత యాదవ సామాజికవర్గంలో అసంతృప్తి సెగలు, మరోవైపు యాదవేతర ఓబీసీలు ఇప్పటికే ఇతర పార్టీల్లో పాతుకుపోవడం వల్ల మేలు కంటే నష్టమే ఎక్కువ జరగవచ్చన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
బెంగళూరు రేవ్‌ పార్టీలో నటి హేమ ఉన్నారా? లేదా?
బెంగళూరు రేవ్‌ పార్టీలో నటి హేమ ఉన్నారా? లేదా?
మీరు తినే బాదం అసలివేనా.. నకిలీవా.? ఇలా తెలుసుకోండి..
మీరు తినే బాదం అసలివేనా.. నకిలీవా.? ఇలా తెలుసుకోండి..
ఊరికి నష్టం.. ఆయనకు మాత్రం ప్రయోజనం.. చివరికి..!
ఊరికి నష్టం.. ఆయనకు మాత్రం ప్రయోజనం.. చివరికి..!
ఓ యువతి చేసిన పనికి రిస్క్‌లో 200 మంది ప్రాణాలు! అసలేం జరిగిందంటే
ఓ యువతి చేసిన పనికి రిస్క్‌లో 200 మంది ప్రాణాలు! అసలేం జరిగిందంటే
ఆర్‌సీబీ ఆటగాళ్లకు షేక్‌హ్యాండ్ ఇవ్వకుండా ధోని తప్పు చేశాడా?
ఆర్‌సీబీ ఆటగాళ్లకు షేక్‌హ్యాండ్ ఇవ్వకుండా ధోని తప్పు చేశాడా?
ప్రశాంత్ వర్మ సినిమా నుంచి తప్పుకున్న రణవీర్ సింగ్..
ప్రశాంత్ వర్మ సినిమా నుంచి తప్పుకున్న రణవీర్ సింగ్..
వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారా.. ఈ బెస్ట్ డైట్ మీ కోసమే!
వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారా.. ఈ బెస్ట్ డైట్ మీ కోసమే!
వెన్నులో వణుకుపుట్టాల్సిందే! పడగ విప్పి నాట్యమాడుతున్న నాగుపాములు
వెన్నులో వణుకుపుట్టాల్సిందే! పడగ విప్పి నాట్యమాడుతున్న నాగుపాములు
ఆ విషయంలో ఏకైక సీఎం రేవంత్ రెడ్డి.. ఈటల హాట్ కామెంట్స్
ఆ విషయంలో ఏకైక సీఎం రేవంత్ రెడ్డి.. ఈటల హాట్ కామెంట్స్
మూడు సెకన్లలో ముంచుకొచ్చిన మృత్యువు.. బైక్‌పై కూలిన భారీ వృక్షం!
మూడు సెకన్లలో ముంచుకొచ్చిన మృత్యువు.. బైక్‌పై కూలిన భారీ వృక్షం!