లాయర్ కిడ్నాప్.. ఆపై హత్య! సొంత బావమరిదే హంతకుడు..
సోదరి కాపురంలో కలతలు రేగడంతో ఆమె కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకుంది. ఆమె అన్న లాయర్ అయినందున సోదరి విడాకుల కేసు దగ్గరుండి వాడించాడు. దీంతో లాయర్ పై పగ పెంచుకున్న సోదరి భర్త.. లాయర్ ను కిడ్నాప్ చేశాడు. కారులో తీసుకెళ్లి చితక్కొట్టి.. రోడ్డుపై పడేసి, అదే కారుతో ఢీకొట్టి దారుణంగా హతమార్చాడు. ఈ కేసులో బావమరిదే కీలక హంతకుడని తేలడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకీ ఎక్కడ జరిగిందంటే..

లక్నో, జనవరి 26: ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో శనివారం సాయంత్రం కిడ్నాప్‌కు గురైన న్యాయవాది.. దారుణ హత్యకు గురయ్యాడు. కిడ్నాప్ అనంతరం కారులో తీసుకెళ్లి చావగొట్టి, అనంతరం అదే కారుతో ఢీకొట్టి హతమార్చినట్లు పోలీసులు అదివారం తెలిపారు. ఈ కేసులో హత్యాకు గురైన లాయర్ బావమరిదిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కప్తంగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బైడోలియా అజైబ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న 50 ఏళ్ల న్యాయవాది చంద్రశేఖర్ యాదవ్ ‘తానా సమాధాన్ దివాస్’ సదస్సుకు హాజరయ్యేందుకు శనివారం కప్తంగంజ్ బయల్దేరారు. చంద్రశేఖర్ సాయంత్రం బైక్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా.. హర్రయ్య పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణపూర్ గ్రామ సమీపంలో స్కార్పియోపై వెళ్తున్న దుండగులు అతన్ని కిడ్నాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కిడ్నాప్ గురించి పోలీసులకు సమాచారం అందే సమయానికి.. కిడ్నాపర్లు లాయర్‌ను తీవ్రంగా కొట్టి, వాల్తేర్‌గంజ్ ప్రాంతంలో రోడ్డుపై పడేసి, ఆపై వారి వాహనాన్ని అతనిపైకి ఎక్కించి హత్య చేశారు. అనంతరం అక్కడి నుంచి పరారైనట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
సోదరి విడాకుల కేసే కారణమా?
న్యాయవాది చంద్రశేఖర్ సోదరి తన భర్త రంజిత్ యాదవ్ నుంచి విడాకులు కోరుతూ కోర్టుకెక్కింది. ఈ కేసును వాదించడానికి మృతుడు చంద్రశేఖర్ యాదవ్ అక్కడికి వెళ్లాడని, తిరిగి వస్తుండగా కిడ్నాపర్లు హత్య చేశారని బస్తీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అభినందన్ తెలిపారు. విడాకుల సెటిల్‌మెంట్‌లో ఆర్థికపరమైన అంశంలో వివాదం తలెత్తిందని, దాని కారణంగా రంజిత్ యాదవ్, అతని సోదరుడు సందీప్ లాయర్ చంద్రశేఖర్ యాదవ్‌ను కిడ్నాప్ చేసి హత్య చేశారని ఎస్పీ అభినందన్ తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న న్యాయవాదులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకుని దుండగులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రంజిత్ యాదవ్‌ను పోలీసులు అరెస్టు చేయగా, ఇతర నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




