AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జైళ్లలో మగ్గుతున్నదీ 75 శాతం విచారణ ఖైదీలే.. కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

దేశవ్యాప్తంగా జైళ్లలో మగ్గుతున్న వారిలో సుమారు 75 శాతం మంది విచారణ ఖైదీలేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.

జైళ్లలో మగ్గుతున్నదీ 75 శాతం విచారణ ఖైదీలే.. కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
Bandi Sanjay Kumar
Mahatma Kodiyar
| Edited By: Balaraju Goud|

Updated on: Sep 26, 2024 | 7:00 PM

Share

దేశవ్యాప్తంగా జైళ్లలో మగ్గుతున్న వారిలో సుమారు 75 శాతం మంది విచారణ ఖైదీలేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఆర్దిక స్థోమత లేని పేద ఖైదీలకు న్యాయ సేవలు అందించడంతోపాటు జరిమానాల చెల్లింపు, బెయిల్ బాండ్లను అందించే విషయంలో ఆర్థిక సహాయ పథకాలను అందిస్తున్నట్లు తెలిపారు. జైళ్లలో పరిమితికి మించి అధికంగా ఖైదీలు ఉండటం పెద్ద సమస్యగా మారిందన్నారు. రాజస్తాన్ జైపూర్ లో బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్(BPRD) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జైళ్ల పరిపాలనలో మహిళా అధికారులు 4వ జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన బండి సంజయ్ ఈ సందర్భంగా ప్రసంగించారు.

130 ఏళ్ల నాటి జైలు చట్టాలను రద్దు చేసి ఆదర్శ కారాగార, సంస్కరణ సేవా చట్టాన్ని తీసుకొచ్చిన ఘనత ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా లదే అన్నారు. నేరస్తులను నిర్బంధించడం, ఆంక్షలు విధించడానికే 1894 నాటి జైలు చట్టాలు పరిమితమయ్యాయన్నారు. ఖైదీలలో మార్పు తీసుకొచ్చి పునరావాసం కల్పించాలనే మానవతా దృక్పథంతోనే నూతన చట్టాల అమలు చేస్తున్నామన్నారు. జైళ్లలో సంస్కరణలు, పరిపాలన, నిర్వహణతోపాటు కొత్త చట్టాల అమలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

జైళ్లలోని లోపాలను తొలగించి, జైలు నిర్వహణను మెరుగుపరిచేందుకు నూతన చట్టాన్ని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని బండి సంజయ్ కోరారు. జైళ్లలో సంస్కరణల కోసం ఆధునిక సాంకేతికను వినియోగించాల్సిన అవసరం ఉందన్న ఆయన, ఖైదీలపై నిఘా, పాలనలో పారదర్శకత కోసం బయోమెట్రిక్ సిస్టమ్, సీసీటీవీ వ్యవస్థ, ఆర్ఎఫ్ఐడి వంటి సాంకేతికతలు, వీడియో కాన్ఫరెన్సింగ్ సౌకర్యాలను అమలు చేయాలన్నారు. దేశవ్యాప్తంగా జైళ్లలో పరిమితికి మించి అధికంగా ఖైదీలు ఉండటం పెద్ద సమస్యగా మారిందన్నారు. జైళ్లలో మగ్గుతున్న వారిలో సుమారు 75 శాతం మంది విచారణ ఖైదీలే. భారతీయ నూతన న్యాయ, సాంకేతిక చట్టం ద్వారా ఖైదీలకు తగిన సహాయం అందించాల్సిన అవసరం ఉందన్నారు1.

మహిళా ఖైదీ ఆరోగ్య సంరక్షణ, విద్య, ఆహారం, నివాసం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. జైలు సిబ్బంది మానవతా కోణంలో ఆలోచించి ఖైదీల్లో మార్పు తేవాలి. పునరావాసంలో సహాయపడాల్సిన అవసరం ఉంది. జైళ్ల భద్రత మెరుగుపర్చడం, ఆధునిక సాంకేతికను ఉపయోగించి ఖైదీల పునరావాసంలో సహాయపడేందుకు రూ.950 కోట్లతో ప్రణాళికను రూపొందించినట్లు బండి సంజయ్ తెలిపారు. ఆర్దిక స్థోమత లేని పేద ఖైదీలకు జరిమానాలు చెల్లింపు, బెయిల్ బాండ్లను అందించేందుకు ఆర్థిక సహాయ పథకాలను అందిస్తున్నామన్నారు. జైళ్లలో విధులు నిర్వహిస్తున్న మహిళా అధికారులు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారని, కష్టతరమైన జైళ్లలో మహిళా అధికారులు ధైర్యంగా విధులు నిర్వహిస్తుండటం అభినందనీయమని బండి సంజయ్ కొనియాడారు.

ఖైదీల్లో మార్పు తెచ్చేందుకు జైలు అధికారులు మరింతగా శ్రేష్టమైన సేవలు అందించాల్సిన అవసరం ఉంది. కొత్త క్రిమినల్ చట్టాల అమలులో భాగంగా పోలీసులు, జైళ్లు, ప్రాసిక్యూటర్లు, న్యాయ అధికారుల, ఫోరెన్సిక్ నిపుణుల సామర్థ్యాన్ని పెంపొందించడంలో నేర న్యాయ వ్యవస్థ(బీపీఆర్ డి) అసాధారణ పాత్ర పోషిస్తుంది. కొత్త క్రిమినల్ చట్టాలకు సంబంధించి ఇప్పటివరకు 325 కోర్సులను అందించిన బీపీఆర్ డీ సంస్థ ఇప్పటి వరకు నేరుగా 4476 మంది జైలు సిబ్బందికి శిక్షణనిచ్చింది. దేశంలో 23, 772 మంది మహిళా ఖైదీలకు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణనివ్వడంవల్ల జైలు జీవితం తరువాత ఉద్యోగావకాశాలు మెరుగుపడ్డాయని బండి సంజయ్ స్పష్టం చేశారు.

జైళ్లలో సామాజిక, నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా, ఖైదీలకు విద్యా, వినోద మరియు వృత్తిపరమైన శిక్షణా సౌకర్యాలు కూడా అవసరం ఉందన్నారు. న మంత్రి నరేంద్ర దీ నాయకత్వంలో, అమిత్ షా మార్గదర్శకత్వంలో దేశంలోని మహిళల భద్రత, హక్కుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి వెల్లడించారు. మోదీ, అమిత్ షా తీసుకుంటున్న చర్యలవల్లూ జైలు పరిపాలనలో అనేక మార్పులు తీసుకొస్తున్నామన్నారు. న్యాయబద్ధమైన, ప్రభావవంతమైన, మానవీయ సుసంపన్నమైన సంస్కరణల పరిపాలనా వ్యవస్థ వైపు అడుగు వేయడానికి ఈ వేదిక తోడ్పడాలని కోరుకుంటున్నానని బండి సంజయ్ స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి