Ayodhya: అయోధ్యలో ఉట్టిపడిన తెలుగుదనం.. తెలుగులో ఫ్లెక్సీలతో తెలుగింటి కోడలు నిర్మలమ్మకు ఘన స్వాగతం
శ్రీ రాముని జన్మ భూమి అయోధ్య లో రెండు రోజుల పర్యటన కోసం అడుగు పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కి ఉత్తరప్రదేశ్ ఆర్థిక మంత్రి సురేష్ ఖన్నా, వ్యవసాయ మంత్రి సూర్య ప్రతాప్ షాహి మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. తెలుగింటి కోడలు ఆధ్యాత్మిక నగరం అయోధ్యలో అడుగు పెట్టినప్పటి నుంచి తెలుగుదనం ఉట్టిపడింది. నగరంలో ఎటుచూసినా కేంద్రమంత్రి నిర్మలకు స్వాగత తోరణాలు తెలుగులో దర్శనమిస్తూ తెలుగుభాష సత్తా చాటాయి.

ఉత్తరభారతం అంటేనే హిందీ. దాదాపు అన్నిరాష్ట్రాల్లో హిందీ అధికారిక భాషగా కొనసాగుతోంది. అలాంటి హిందీ గడ్డపై తెలుగుదనం ఉట్టిపడింది. ఉత్తరప్రదేశ్‌లో ఆధ్యాత్మిక నగరం అయిన అయోధ్యలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు అడుగడుగునా తెలుగులో స్వాగత తోరణాలు దర్శనమిచ్చాయి. బృహస్పతి కుండ్ దగ్గర సంగీత విధ్వాంసుల విగ్రహాల ఆవిష్కరణకు వచ్చిన కేంద్రమంత్రికి స్వాగతం చెబుతూ నగరం నిండా ఫ్లెక్సీలు వెలిశాయి. సీఎం యోగీ ఆదిత్యనాథ్‌తో కలిసి ఉన్న ఫ్లెక్సీలను తెలుగులో ప్రత్యేకంగా రూపొందించారు.
తెలుగుతో నిండిన ఫ్లెక్సీలను చూసి మంత్రి నిర్మలా సీతారామాన్ ఆనందంతో పరవశించారు. తెలుగుపై సీఎం యోగీ ఆదిత్యనాథ్‌కు ఉన్న ప్రేమను అభినందించారు. దక్షిణ భారత సంస్కృతి, భాషలకు పెద్దపీట వేసిన ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖపై తెలుగు ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలుగు భాషను ఆదరించిన తీరుకు అబ్బురపడుతున్నారు. శ్రీరాముడి జన్మస్థలంలో తెలుగులో ఫ్లెక్సీల ఏర్పాటు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. హిందీ గడ్డపై యూపీ సర్కారు తెలుగు భాష గొప్పదనం చాటిందంటూ తెలుగుప్రజలు హర్షం ప్రకటిస్తున్నారు.
Watch Live: Smt @nsitharaman‘s address at a programme after unveiling the statues of Sri Purandara dasa, Sri Arunachala Kavirayar and Sri Tyagaraja at Brihaspati Kund in Ayodhya, Uttar Pradesh. https://t.co/uSi6uLKyPm
— Nirmala Sitharaman Office (@nsitharamanoffc) October 8, 2025
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి నిర్మలా సీతారామన్ ముగ్గురు ప్రముఖ దక్షిణ భారత సంగీతకారులు త్యాగరాజ స్వామి, పురందర దాసు, అరుణాచల కవి విగ్రహాలను ఆవిష్కరించారు.
బృహస్పతి కుండ్ కాంప్లెక్స్‌లో ప్రతిష్టించబడిన ఈ విగ్రహాలు భారతదేశ సంగీత, భక్తి , కళాత్మక వారసత్వానికి కాలాతీత చిహ్నాలుగా నిలుస్తాయి. ఈ సాధు సంగీతకారులు భారతీయ శాస్త్రీయ సంగీతంలో దైవిక భక్తిని నింపారు,. దీనిని దేశ సంస్కృతి ఆధ్యాత్మిక సారాంశంగా మార్చారు. భక్తి, ధర్మానికి నిలయమైన అయోధ్యలో ఈ విగ్రహాలను ఏర్పాటు చేయడం ఉత్తర , దక్షిణ భారత సంప్రదాయాల ఐక్యతకు ఒక అద్భుతమైన నిదర్శనంగా నిలుస్తుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








