AP – Orissa: కేంద్ర మంత్రి అయ్యిండి.. ఇవేం మాటలు సార్.. గో బ్యాక్ ఆంధ్రా అంటారా..?
ఆయనో కేంద్ర మంత్రి. అంటే దేశానికి మంత్రి. మరి, రెండు రాష్ట్రాల మధ్య వివాదం వస్తే.. ఆయనెలా ఉండాల? పెద్దన్న మాదిరి మాట్లాడాల. కానీ, సెంట్రల్ మినిస్టర్‌గా ఉన్న ఆయన మాత్రం.. మరోలా వ్యవహరించారు. ఓ రాష్ట్రనేతలా కామెంట్స్ చేశారు.ఇంతకీ ఏం జరిగింది?
ఏపీ, ఒడిశా రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా రగులుతున్న కొటియా గ్రామాల వివాదం మళ్లీ తెరమీదకొచ్చింది. ఆ గ్రామాలు మావంటే మావంటూ రెండు రాష్ట్రాలూ పట్టుబడుతున్న వేళ… తాజాగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయ్. శనివారం ఒడిశా, ఆంధ్రా సరిహద్దుల్లో పర్యటించిన ధర్మేంద్ర ప్రధాన్‌ను మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చారు కొటియా సీఐ రోహిణీ పతి . కానీ, సెంట్రల్ మినిస్టర్ మాత్రం ఊహించని ట్విస్టిచ్చారు. ఆంధ్రా పోలీసులకు ఇక్కడేం పని.. గో బ్యాక్ అంటూ పెద్ద షాకిచ్చారు. ఒడిశా, ఆంధ్రా అంటూ సీఐ ఏదో చెప్పబోతుండగా.. నో ఆంధ్రా… ఓన్లీ ఒడిశా అంటూ… అక్కణ్నుంచి వెళ్లిపోవాలంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతటితో ఆగారా అంటే.. అదీ లేదు. కేంద్రమంత్రిననీ, దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నాననీ మరిచిపోయి.. బీజేపీ కార్యకర్తలతో కలిసి… గో బ్యాక్ ఆంధ్రా అంటూ నినాదాలు చేశారు ధర్మేంద్ర ప్రధాన్.
ఏళ్లతరబడి రగులుతున్న కొటియా గ్రామాల ఇష్యూ.. ఇప్పుడు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వ్యవహారంతో మళ్లీ హీటెక్కింది. కేంద్రమంత్రిగా ఉంటూ ఒక రాష్ట్రానికి వత్తాసు పలుకుతూ.. మరో రాష్ట్రానికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడుతారన్న విమర్శలు వినిపిస్తున్నాయ్. మరి, ఈ రచ్చ ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..