AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఆంధ్రప్రదేశ్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పేపర్ లీక్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం, పేపర్ లీక్‌కు పాల్పడితే కఠిన చర్యలు, పదేళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానా. ప్రత్యేక చట్టబద్ధతతో ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు. అలాగే బళ్లారి, గుంతకల్లు మధ్య 3, 4వ రైల్వే లైన్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది.

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఆంధ్రప్రదేశ్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్
Central Cabinet
SN Pasha
|

Updated on: Jul 24, 2026 | 4:27 PM

Share

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పేపర్ లీక్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. పేపర్ లీక్‌కు పాల్పడితే కఠిన చర్యలు, పదేళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానా, ప్రత్యేక చట్టబద్ధతతో ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు వంటి కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. కేంద్ర కేబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాల్లో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అంశం కూడా ఉంది. అదే బళ్లారి, గుంతకల్లు మధ్య 3, 4వ రైల్వే లైన్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. దీని కోసం రూ.1264 కోట్లు కేటాయింపులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే రూ.3030 కోట్లతో భవ్య రసాయన స్కీమ్ కి ఆమోదం తెలిపింది.

బళ్లారి – గుంతకల్లు రైల్వే లైన్

కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రైల్వే అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసే కీలక నిర్ణయాన్ని కేంద్ర కేబినెట్ తీసుకుంది. బళ్లారి–గుంతకల్ రైల్వే మార్గంలో మూడో, నాలుగో లైన్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.1,264 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ మల్టీట్రాకింగ్ ప్రాజెక్టు 2028–29 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టు ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా అమలుకానుంది.

ఈ ప్రాజెక్టు ద్వారా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోని మూడు జిల్లాలకు ప్రత్యక్ష ప్రయోజనం కలగనుంది. మొత్తం 46 కిలోమీటర్ల మేర అదనపు రైల్వే లైన్ నిర్మించనుండగా, 99 గ్రామాలకు మెరుగైన రైల్వే కనెక్టివిటీ లభించనుంది. దీంతో సుమారు 7 లక్షల మంది ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికులకు మాత్రమే కాకుండా పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు కూడా ఈ ప్రాజెక్టు ఎంతో కీలకంగా మారనుంది. ముఖ్యంగా ఇనుప ఖనిజం, బొగ్గు, ఉక్కు, ఎరువులు, సిమెంట్, ధాన్యాల వంటి భారీ సరుకుల రవాణా మరింత వేగంగా, సమర్థవంతంగా సాగేందుకు ఈ అదనపు లైన్లు దోహదపడనున్నాయి. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత భారతీయ రైల్వేకు ఏడాదికి అదనంగా 16.22 మిలియన్ టన్నుల సరుకు రవాణా సామర్థ్యం పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

పర్యావరణ పరిరక్షణకు కూడా ఈ ప్రాజెక్టు ఉపయోగపడనుంది. రోడ్డు రవాణాపై ఆధారపడటం తగ్గడంతో ప్రతి ఏడాది సుమారు 1.32 కోట్ల లీటర్ల చమురు దిగుమతులు తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది. అలాగే దాదాపు 6.67 కోట్ల కిలోల కార్బన్ ఉద్గారాలు తగ్గే అవకాశముందని పేర్కొంది. దీంతో గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్ లక్ష్యాల సాధనకు ఈ ప్రాజెక్టు తోడ్పడనుంది. పర్యాటక రంగానికీ ఈ ప్రాజెక్టు ఊతమివ్వనుంది. బళ్లారి కోట, శ్రీ కుమారస్వామి ఆలయం వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు మెరుగైన రైలు కనెక్టివిటీ అందుబాటులోకి రానుంది. దీంతో పర్యాటకుల రాక పెరగడంతో స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా లాభం చేకూరే అవకాశం ఉంది.

రైల్వే మార్గంలో ప్రస్తుతం ఉన్న రద్దీ తగ్గడంతో పాటు రైళ్ల రాకపోకలు మరింత సాఫీగా సాగుతాయని కేంద్రం పేర్కొంది. సరుకు, ప్రయాణికుల రైళ్ల నిర్వహణ సామర్థ్యం పెరగడంతో ఆలస్యాలు తగ్గే అవకాశం ఉంది. ప్రాంతీయ అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపు, పారిశ్రామిక వృద్ధికి ఈ ప్రాజెక్టు కీలక మైలురాయిగా నిలుస్తుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Follow Us