Smriti Mandhana: దిండు కింద పెట్టుకున్న ఆ కాగితం.. స్మృతి మంధాన జీవితాన్నే మార్చేసింది
Smriti Mandhana: స్మృతి మంధాన తన విజయాల వెనుక ఉన్న ప్రత్యేకమైన మెనిఫెస్టేషన్, విజువలైజేషన్ టెక్నిక్‌ల గురించి వెల్లడించారు. ‘నేను నంబర్ వన్ బ్యాటర్, వరల్డ్ కప్ విన్నర్’ అంటూ రాసుకున్న కాగితాన్ని దిండు కింద పెట్టుకునేవారట. అలాగే బ్లాంక్ చెక్‌పై ఇంటి కలను రాసుకుని, 18 ఏళ్లకే తల్లిదండ్రుల కోసం సొంత ఇల్లు కొనుగోలు చేశారు.

Smriti Mandhana: భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఇటీవలి కాలంలో అద్భుత విజయాలను అందుకుంటూ దేశం గర్వించేలా చేస్తున్నారు. ముఖ్యంగా 2025 మహిళా వన్డే ప్రపంచ కప్ విజయం, దుబాయ్ వేదికగా జరిగిన మహిళా ఆసియా కప్ విజయాల్లో ఆమె కీలక పాత్ర పోషించారు. అయితే తాను ఈ స్థాయికి చేరుకోవడానికి తన కోచ్ నేర్పించిన ఒక స్పెషల్ మేనిఫెస్టేషన్ రొటీన్ ఎంతగానో సహాయపడిందని ఇటీవల ఒక పాడ్ కాస్టులో పంచుకున్నారు. తాను ఐసీసీ నంబర్ వన్ బ్యాటర్, వరల్డ్ కప్ విన్నర్ అని కాగితంపై రాయించి, వాటిని దిండు కింద పెట్టుకుని పడుకోమనేవారట. మొదట్లో ఇవన్నీ చాలా సిల్లీగా అనిపించినప్పటికీ, ఆ తర్వాత అవే నిజమవడంతో తనకెలాంటి సందేహాలు లేవని స్మృతి మంధాన వెల్లడించారు.
బ్లాంక్ చెక్ టెక్నిక్
తన లక్ష్యాలను సాధించే క్రమంలో స్మృతి మంధాన పాటించిన పద్ధతుల గురించి చెబుతూ.. ఒక బ్లాంక్ చెక్‌పై తాను కోరుకున్న ఇల్లు గురించి రాసి, ప్రతిరోజూ చూసే గోడపై అతికించుకున్నానని తెలిపారు. తాము అద్దె ఇంట్లో ఉన్నప్పుడు అమ్మానాన్నల కోసం సొంత ఇల్లు కొనాలన్నదే తన జీవితాశయమని, చివరికి ఆ కలలను కేవలం 18 ఏళ్ల వయసులోనే నిజం చేసుకున్నానని ఆమె సంతోషంగా గుర్తు చేసుకున్నారు. కేవలం ఆలోచించడమే కాకుండా వాటిని నిత్యం కళ్లకు కట్టేలా విజువలైజ్ చేసుకోవడం వల్లనే విజయం సాధ్యమైందని ఆమె అభిప్రాయపడ్డారు.
సైకాలజీ ప్రకారం విజువలైజేషన్ ఎలా పనిచేస్తుంది?
ప్రముఖ సైకాలజిస్ట్ దీని గురించి వివరిస్తూ.. విజువలైజేషన్ అనేది ఒక పవర్ఫుల్ సైకో టెక్నాలజీ అని చెప్పారు. ఏదైనా ఒక లక్ష్యాన్ని లేదా పనిని వాస్తవంలో సాధించడానికి ముందే మనసులో ఊహించుకోవడం వల్ల మెదడులో ప్రత్యేకమైన నాడీ మార్గాలు ఉత్తేజితమవుతాయి. దీనివల్ల ఆ అనుభూతి మెదడుకు ముందే పరిచయం అవుతుంది, తద్వారా మనలో ఆత్మవిశ్వాసం పెరిగి భయం, ఆందోళన దూరం అవుతాయని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యమైన సందర్భాల్లో తప్పులు జరుగుతాయని భయపడకుండా, ఆ సవాళ్లను ప్రశాంతంగా ఎలా ఎదుర్కోవాలో మెదడుకు శిక్షణ ఇవ్వడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
స్క్రిప్టింగ్, గోల్ సెట్టింగ్ మెథడ్స్
అనుకున్న లక్ష్యాలను కాగితంపై రాయడాన్ని స్క్రిప్టింగ్ అంటారు. మనం కోరుకున్న లక్ష్యాలను రాయడం ద్వారా మన మనస్సుకు అది బలంగా చేరుతుంది. ఇది మనలో ఆ ఆలోచనను బలంగా నిలపడమే కాకుండా మెదడులోని రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ (RAS)ను ఉత్తేజితం చేసి తగిన అవకాశాలను మన వైపు ఆకర్షించేలా చేస్తుంది. ప్రతిరోజూ ఉదయం లేదా రాత్రి పడుకునే ముందు 5 నుంచి 10 నిమిషాలు గోల్ స్క్రిప్టింగ్ కోసం కేటాయించడం, చిన్న చిన్న లక్ష్యాలను ఏర్పరచుకోవడం, వాటిని రివ్యూ చేసుకోవడం ద్వారా ఎవరైనా తమ జీవితంలో అద్భుతాలు సృష్టించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
