Bat Meat: ఛీ.. యాక్! గబ్బిలాలతో చిల్లీ చికెన్ అట.. జర చూసుకోండి!
గల్లీలో దొరికే చిరుతిళ్లు చాలా మందికి మహా ఇష్టం. ఘుమఘుమలాడే ఆ వంటకాలను లొట్టలేసుకు మరీ తినేవారు మనలో చాలామందే ఉన్నారు. ముఖ్యంగా వీధుల్లో దొరికే చికెన్ వంటకాలు, మటన్ బిర్యానీలు, ఫ్రైలు తిననివారు దాదాపు ఉండరు. అలాంటి వారు గుండె గట్టిగా పట్టుకుని ఈ వార్తను చదవడం మంచిది. ఎందుకంటే మీరు తినేది నిజంగా చికెనా లేక గబ్బిలమా అనే విషయం తెలుసుకోబోతున్నారు మరీ..

ఓ ముఠా చికెన్ ముసుగులో ఫ్రూట్ బ్యాట్‌ల (పండ్లు తినే గబ్బిలాలు)ను వేటాడి.. వాటి మాంసం వండి వీధుల్లో చికెన్ పేరిట జనాలకు విక్రయిస్తున్నారు. అది నిజంగానే చికెన్ గా భావించిన జనాలు అమాయకంగా ఆ వంటకాలు ఆరగిస్తున్నారు. ఇలా జనాల ప్రాణాలతో ఆటలాడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులోని సేలం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..
తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఒమలూర్ సమీపంలోని డానిష్‌పేట్టై వద్ద గబ్బిలాలను వేటాడి, వాటిని వండుతున్నట్లు అధికారులకు సమాచారం అందింది. తోప్పూర్ రామసామి అటవీ ప్రాంతంలో తుపాకీ కాల్పుల శబ్దాలు విన్న సమీప ప్రాంతంలోని జనాలు.. అటవీ శాఖకు ఈ మేరకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అటవీ రేంజర్ నేతృత్వంలోని పెట్రోలింగ్ బృందం ఆ ప్రాంతాన్ని తనిఖీ చేయడానికి వెళ్ళగా షాకింగ్ విషయాలు వారి కంటపడ్డాయి. వేటాడిన గబ్బిలాల మాంసంతో సువాసనలు వెదజల్లేలా వంటకాలు చేసి, ఆ మాంసాన్ని చికెన్ పేరిట అక్రమంగా విక్రయిస్తున్నారు. జనాలు అది నిజంగా చికెన్‌గానే భావించి తింటున్నారు.
ఫారెస్ట్ రేంజర్ విమల్ కుమార్ నేతృత్వంలోని బృందం ఈ వ్యవహారాన్ని చేధించింది. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి కటకటాల వెనుక వేశారు. నిందితులను కమల్, సెల్వంగా గుర్తించారు. కేసు తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు చెప్పారు. ఈ ఘటనలో ఇతరుల ప్రమేయం ఉందో లేదో తెలుసుకోవడానికి దర్యాప్తు చేపట్టారు. కాగా ఫ్రూట్ బ్యాట్‌లు భారతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 కింద షెడ్యూల్-2 జాతిగా రక్షణ కల్పిస్తున్నారు. ఈ చట్టం ప్రకారం వీటిని వేటాడటం, అమ్మడం పూర్తిగా చట్టవిరుద్ధం. వీటిని వేడిన వారికి ఏడేళ్ల జైలుశిక్ష, రూ.3 లక్షల వరకు జరిమానా శిక్షగా విధించే అవకాశం ఉంది. 2021లో తుమకూరు జిల్లాలో ఇదే విధంగా 25 ఫ్రూట్ బ్యాట్‌లను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను అటవీ అధికారులు గుర్తించారు. వీటిని కూడా మాంసం కోసం బెంగళూరు, తుమకూరుకు తరలిస్తున్నట్లు తెలిసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




