BJP MLA: పశ్చిమ బెంగాల్‌లో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల రాజీనామా.. ఎంపీలుగా కొనసాగనున్న నిషిత్ ప్రమాణిక్, జనన్నాథ్ సర్కార్
బెంగాల్ అసెంబ్లీలో ఎన్నికల్లో ఇటీవల పోటీ చేసి బీజేపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన నిషిత్ ప్రమాణిక్, జనన్నాథ్ సర్కార్‌లు తమ ఎమ్మెల్యే పదవులను వదులుకున్నారు.
BJP MLAs Resign: ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేలు ఇద్దరు రాజీనామా చేశారు. బెంగాల్ అసెంబ్లీలో ఎన్నికల్లో ఇటీవల పోటీ చేసి బీజేపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన నిషిత్ ప్రమాణిక్, జనన్నాథ్ సర్కార్‌లు తమ ఎమ్మెల్యే పదవులను వదులుకున్నారు. తమ రాజీనామా లేఖలను స్పీకర్ బిమన్ బెనర్జీకి వీరు అందజేశారు. ఈ ఇద్దరూ బీజేపీ ఎంపీలుగా ఉంటూనే అసెంబ్లీ ఎన్నికల బరిలో ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ బలం 77 నుంచి 75కు తగ్గింది.
తాజాగా ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయడంతో వీరు బీజేపీ ఎంపీలుగా కొనసాగనున్నారు. రణఘాట్ నియోజవర్గానికి సర్కార్ ఎంపీగా ఉండగా, కూచ్‌బెహర్ నియోజకవర్గం నుంచి ప్రమాణిక్ ఎంపీగా కొనసాగుతున్నారు. కాగా, గత ఎన్నికలో పార్టీ ఆదేశాల మేరకు దిన్‌హటా, శాంతిపూర్ నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచారు. తాజాగా పార్టీ ఆదేశాల మేరకే తాము ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసినట్టు సర్కార్, ప్రమాణిక్ తెలిపారు. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి ఎంపీలుగా కొనసాగాలని అధిష్ఠానం ఆదేశించిందని చెప్పారు.
అధిష్ఠానం నుంచి సమాధానం రాకపోవడంతో ఈ ఇద్దరూ గత వారం ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేయలేదు. తాజాగా ఈ ఇద్దరూ రాజీనామా చేయడంతో ఆరు నెలల్లోగా వారు గెలిచిన దిన్‌హటా, శాంతిపూర్ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు అనివార్యం కానున్నాయి. ఈ ఇద్దరి రాజానామాలతో బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ బలం 77 నుంచి 75కు తగ్గింది.
ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికలలో సర్కార్ శాంతిపూర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలిచారు. సర్కార్ తన సమీప ప్రత్యర్థిపై 15,878 ఓట్ల తేడాతో శాంతిపూర్ సీటును గెలుచుకోగా, దిన్‌హటా నియోజకవర్గంలో ప్రమానిక్ టీఎంసీ అభ్యర్థిపై 57 ఓట్ల తేడాతో గెలుపొందారు.
కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో, లాకెట్ ఛటర్జీ, రాజ్యసభ మాజీ సభ్యుడు స్వాపన్ దాస్‌గుప్తా మరో ఇద్దరు లోక్‌సభ ఎంపీలను కూడా బీజేపీ అసెంబ్లీ బరిలో నిలబెట్టింది. కానీ వారంతా ఎన్నికల్లో ఓడిపోయారు. మొత్తం బెంగాల్ అసెంబ్లీలో 292 నియోజకవర్గాల్లో 213 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. కాగా, అభ్యర్థుల మరణం కారణంగా రెండు స్థానాల్లో ఎన్నికలు నిలిచిపోయాయి.
2016 ఎన్నికలలో కేవలం ముగ్గురు ఎమ్మెల్యేల ఉన్న భారతీయ జనతా పార్టీ బలం 77 మంది ఎమ్మెల్యేలకు పెరిగింది. ప్రభుత్వాన్ని నడిపించడంలో అనుభవాన్ని జోడించడానికి, కొంతమంది ఎంపీలను రంగంలోకి దించారు. అయితే, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యాన్ని పార్టీ సాధించలేకపోయింది ”అని పార్లమెంట్ సభ్యులు సర్కార్ అన్నారు.