High Court Judges: దేశవ్యాప్తంగా 15 మంది హైకోర్టు జడ్జిల బదీలీ జరిగింది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులను ఆమోదిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తం 17 మందిని బదిలీ చేయాల్సి ఉండగా అందులో ఇద్దరిని మినహాయించి మిగతా 15 మందిని బదిలీ చేసింది. తాజా నిర్ణయంతో ఏపీ హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులు బదిలీయ్యారు.. ఏపీ హైకోర్టు జడ్జిలుగా జస్టిస్ రవినాథ్ తిలహరి, ఆషానుద్దీన్ అమానుల్లా నియమితులు కాగా.. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భయాన్ నియమితలయ్యారు.
అయితే తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రరావు పంజాబ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. హైకోర్టుల్లో న్యాయమూర్తులను నియమించడానికి ఆగస్టు 25, సెప్టెంబర్ 1న కొలీజియం సభ్యులు సమావేశమై 112 మంది పేర్లను పరిశీలించారు. ఇందులో నుంచి 68 మందిని ఎంపిక చేసి కేంద్రానికి సిఫారసు చేశారు. 68 మందిలో 44 మంది బార్ సభ్యులను ఎంపిక చేసుకోగా మిగతావారు జ్యుడిషియల్ అధికారులు. న్యాయశాఖ ప్రకారం, ఈ నెల 1వ తేదీనాటికి మొత్తం 25 హైకోర్టుల్లో 465 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఒక్క అలహాబాద్ హైకోర్టులోనే 68 ఖాళీలున్నాయి. పంజాబ్, హర్యానాలో 40, కలకత్తాలో 36 ఖాళీలున్నాయి. అలహాబాద్ హైకోర్టు కోసం 16 మందిని, కేరళ హైకోర్టుకు 8 మందిని, కలకత్తా, రాజస్తాన్ హైకోర్టులకు ఆరుగురి చొప్పున నియమించాలని తాజా ప్రతిపాదనలో కొలీజియం పేర్కొంది. వీరితోపాటు గౌహతి, జార్ఖండ్ హైకోర్టుకు ఐదుగురి చొప్పున, పంజాబ్, హర్యానాలకు నలుగురి చొప్పున, చత్తీస్‌గఢ్ హైకోర్టుకు ఇద్దరిని, మధ్యప్రదేశ్ హైకోర్టుకు ఒకరిని నియమించాలని తెలిపింది.