Kerala Bank: బ్యాంకులో చోరీ, లాకర్ ముందు విచిత్ర పూజలు..పోలీసులకు గట్టి వార్నింగ్ ఇచ్చిన దొంగలు..
ఏదైనా శుభ కార్యం ప్రారంభించేటప్పుడు, లేదా ఉద్యోగ వ్యాపారాలు, భూమి కొనుగోలు, ఇంటి నిర్మాణం వంటి కార్యక్రమాలు చేసేటప్పుడు పూజలు చేయడం సర్వసాధారణం. కానీ, ఇప్పుడు దొంగలు కూడా దొంగతనానికి ముందు పూజలు చేసి తమ పనిలో
ఏదైనా శుభ కార్యం ప్రారంభించేటప్పుడు, లేదా ఉద్యోగ వ్యాపారాలు, భూమి కొనుగోలు, ఇంటి నిర్మాణం వంటి కార్యక్రమాలు చేసేటప్పుడు పూజలు చేయడం సర్వసాధారణం. కానీ, ఇప్పుడు దొంగలు కూడా దొంగతనానికి ముందు పూజలు చేసి తమ పనిలో విజయం సాధించాలని దేవుడిని ప్రార్థించారు. ఔను.. ఇది నిజమే..వారు బ్యాంకు దొంగతనానికి వెళ్లి.. బ్యాంకు లాకర్ ముందు పూజలు చేశారు. అనంతరం లూటీకి పాల్పడ్డారు. ఈ వింత ఘటన కేరళలోని కొల్లంలో చోటుచేసుకుంది. కొల్లాంలోని ఓ బ్యాంకులో దొంగలు చోరీకి ముందు మద్యం, తమలపాకులతో పూజలు చేసి రూ.30 లక్షల విలువైన నగలు, రూ.4 లక్షల నగదుతో పరారయ్యారు.
పాతనాపురంలోని జనతా జంక్షన్‌లో ఉన్న ఓ ప్రైవేట్ ఫైనాన్షియల్ సంస్థ పతనపురం బ్యాంకర్స్‌లో మే 16వ తేదీన దొంగలు పడ్డారు. ఈ విషయాన్ని సంస్థ యజమాని రామచంద్రన్ నాయర్ ప్రకటించారు. ఉదయం 9 గంటలకు ఆయన బ్యాంకుకు వెళ్లగా అప్పటికే బ్యాంకులో చోరీ జరిగినట్టుగా గుర్తించారు. రెండు లాకర్లలో పెట్టి ఉంచిన బంగారం, నగదను దోచుకున్నారని, మొత్తం రూ. 34 లక్షల విలువైన నగదు, నగలు చోరీ చేశారని వివరించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు…పరిసరాలను పరిశీలించారు. దొంగతనం జరిగిన తీరుకు ఖాకీలు సైతం కంగుతిన్నారు. బ్యాంకు లాకర్ ముందు ఆధ్యాత్మిక పూజలు జరిగిన ఆనవాళ్లు కనిపించాయి. ఓ దేవుడి ఫొటో కూడా కనిపించింది. ఒక బల్లెం, ఒక నిమ్మకాయ, తమలపాకు ఉన్నాయి. అంతేకాదు, పసుపు దారంతో కట్టేసి ఉంచిన ఒక నోట్‌తో పాటు నిమ్మకాయ కూడా ఉన్నాయి. అక్కడ దొరికిన లేఖలో ఇలా రాసి ఉంది… నేను డేంజరస్ మనిషిని. నా వెంట పడొద్దు అని పోలీసులను ఉద్దేశించి రాసిఉంది. ఆ గది చుట్టూ మనిషి వెంట్రుకలు చల్లి ఉన్నాయి. పోలీసు కుక్కను తప్పుదారి పట్టించడానికి ఈ పని చేసి ఉండొచ్చని అందరూ భావిస్తున్నారు. మూడు అంతస్తుల భవనం ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటుంది ఈ బ్యాంకు. బహుశా దొంగలు రూఫ్ ద్వారా లోపలికి వచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్ వరకు దిగి.. బ్యాంకుకు వేసి ఉన్న ఐరన్ గ్రిల్స్‌ను, డోర్‌ను కట్టర్ సహాయంతో తొలగించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.