Vice President: నెల రోజుల్లో ఉపరాష్ట్రపతి ఎన్నిక..! ఏ క్షణమైనా షెడ్యూల్ రిలీజ్.. బీజేపీ అభ్యర్థిపై ఉత్కంఠ..?
ఉపరాష్ట్రపతి అభ్యర్ధుల రేసులో ప్రధానంగా నీతిష్ కుమార్, హరివంశ్ నారాయణ్ సింగ్, రామ్ నాథ్ థాకూర్ వీకే సక్సేనా, మనోజ్ సిన్హా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, శశి థరూర్, అరిఫ్ మొహమ్మద్ ఖాన్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అటు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరం చేసింది.

భారత 15 ఉపరాష్ట్రపతిగా ఎవరు అవుతారని దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.. భారత అత్యున్నత రాజ్యాంగ బద్ధమైన పదవిలో బీజేపీ అభ్యర్థి ఉంటారా..? ఎన్డీఏ అభ్యర్థి ఉంటారా? లేక అనూహ్యంగా మరెవరినైనా ఉపరాష్ట్ర పదవికి అధికార ఎన్డీఏ ప్రభుత్వం ఎంపిక చేస్తుందా..? అన్న చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. అభ్యర్థి ఎవరైనా మరో నెల రోజుల్లోనే ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఇప్పటికే ఉపరాష్ట్రపతి ఎన్నికల నిర్వహణ ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ముమ్మరం చేసింది. ఈ క్షణమైనా ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్‌ని ప్రకటించే అవకాశం ఉంది. మరి ప్రస్తుతం ఉపరాష్ట్రపతి పదవి రేసులో ఎవరెవరున్నారో..? ఎవరి గురించి చర్చ జరుగుతుంది..? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
నూతన ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే జులై 21న ఇప్పటివరకు ఉపరాష్ట్రపతిగా కొనసాగిన జగదీప్ దన్కడ్ ఆరోగ్య కారణాల వల్ల రాజీనామా చేశారు. ఈ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. దీనిపై పార్లమెంట్‌లో ప్రకటన సహా కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ విడుదల చేయడం.. ఆ నోటిఫికేషన్ కేంద్ర ఎన్నికల సంఘానికి చేరడం వేగంగా జరిగిపోయాయి. ఇక తదుపరి ఉపరాష్ట్రపతి ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సైతం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఆర్టికల్ 324 ప్రకారం భారత ఉపరాష్ట్రపతి పదవికి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తుంది. ఇందుకోసం ఉపరాష్ట్రపతి ఎన్నికలకు రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ RO లను ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది..ఉపరాష్ట్రపతి ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్ర మోడీని ఈసీ నియమించింది.. రాజ్యసభ సెక్రటేరియట్ జాయింట్ సెక్రటరీ గరిమా జైన్, రాజ్యసభ సెక్రటేరియట్ డైరెక్టర్ విజయ్ కుమార్‌లను అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా నియమించింది. సంప్రదాయం ప్రకారం, లోక్‌సభ సెక్రటరీ జనరల్ లేదా రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ను రొటేషన్ ద్వారా రిటర్నింగ్ అధికారిగా నియమిస్తారు. గత ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో, లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ను రిటర్నింగ్ అధికారిగా నియమించారు. అందువల్ల, ఎన్నికల సంఘం న్యాయ మంత్రిత్వ శాఖతో సంప్రదించి, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ సమ్మతితో, 2025లో జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికకు రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ను రిటర్నింగ్ అధికారిగా నియమించింది.
ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎప్పుడు ? ఎవరు ఎన్నుకుంటారు ?
ఉప రాష్ట్రపతి ఎన్నికకి ఇప్పటికే ఈసీ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుండటంతో ఆగస్టు చివరిలో ఎన్నిక ఉండే అవకాశం ఉంది. భారత ఉపరాష్ట్రపతిని ఉభయసభల ఎంపీలు ఎన్నుకుంటారు. ఇది 788 మంది సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీని కలిగి ఉంటుంది. రహస్య బ్యాలెట్ విధానంలో ఓటింగ్ ప్రక్రియ ఉంటుంది. అధికార ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యర్థిని ఎన్నికల్లో నిలబెట్టవచ్చు. ఉపరాష్ట్రపతి గెలుపు కోసం 392 ఓట్లు అవసరం. అయితే ప్రస్తుతం ఎన్‌డీఎకు 422 సభ్యుల మద్దతు ఉండటం వల్ల ఖచ్చితంగా వారి అభ్యర్థి గెలుస్తారు. ఓట్ల లెక్కింపు అదే రోజు జరుగుతుంది. గెలుపొందిన అభ్యర్థి ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఐదేళ్లపాటు ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ చైర్మన్‌గా కొనసాగుతారు.
ఉపరాష్ట్రపతి రేసులో ప్రముఖుల పేర్లు
రాజకీయ, సామాజిక కోణాల్లో ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక ఉండే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నియామకం, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తోను నూతన ఉపరాష్ట్రపతి ఎన్నిక ముడిపడి ఉండే అవకాశం కనిపిస్తోంది. అయితే అధికార పక్షం నుంచి ఆర్ఎస్ఎస్, బీజేపీ అగ్రనాయకత్వం, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల చర్చల అనంతరం ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. భారత 15 ఉపరాష్ట్రపతి ఎన్నిక రేసులో అనేక మంది ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి, గవర్నర్లు, ఎంపీల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. రాజకీయ కోణంలో ఎంపిక జరిగితే బీహార్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు సంబంధించిన వారే ఉపరాష్ట్రపతి అభ్యర్థుల ముందుండే అవకాశం ఉంది.
ఉపరాష్ట్రపతి అభ్యర్ధుల రేసులో ప్రధానంగా నీతిష్ కుమార్, హరివంశ్ నారాయణ్ సింగ్, రామ్ నాథ్ థాకూర్ వీకే సక్సేనా, మనోజ్ సిన్హా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, శశి థరూర్, అరిఫ్ మొహమ్మద్ ఖాన్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి..
నీతిష్ కుమార్
ప్రస్తుత బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత, ఎన్‌డీఎ కూటమిలో కీలక నేతగా ఉన్న నితీష్ కుమార్ పేరు ఉపరాష్ట్రపతి అభ్యర్థి రేసులో ప్రధానంగా వినిపిస్తోంది. ఓబీసీ సముదాయం నుండి వచ్చిన వ్యక్తి కావడం ప్రస్తుతం బీహార్‌లో ఎన్నికలు వస్తుండడంతో నితీష్‌ను కేంద్రంలో కీలక బాధ్యతల్లో ఉంచి బీహార్‌లో నితీష్ కుమార్ తనయుడికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ముఖ్యమంత్రి పదవి బీజేపీ తీసుకుంటుందన్న చర్చ జరుగుతుంది
హరివంశ్ నారాయణ్ సింగ్
ప్రస్తుత రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న హరివంశ్ నారాయణ్ సింగ్ పేరు ఉపరాష్ట్రపతి అభ్యర్థి రేసులో ప్రధానంగా వినిపిస్తోంది. 2020 నుంచి రాజ్యసభ డిప్యూటీ స్పీకర్‌గా కొనసాగుతున్నారు. మోడీకి అత్యంత సన్నిహితుడు అనే పేరు ఉంది. ప్రస్తుతం రాజ్యసభ కార్యకలాపాలను రాజ్యసభ ఉపసభాపతిగా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు
రామ్‌నాథ్ థాకూర్
రామ్ నాథ్ థాకూర్ ప్రస్తుత బిహార్ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. భారతరత్న కర్పూరి థాకూర్ కుమారుడు. నై(బార్బర్) సముదాయం నుండి వచ్చిన వ్యక్తి. బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఇతనికి ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా చర్చ జరుగుతుంది
వీకే సక్సేనా
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా పేరు ఉప రాష్ట్రపతి పదవి రేసులో ప్రధానంగా వినిపిస్తోంది. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో రెసిడెంట్ గవర్నర్‌గా కీలకపాత్ర పోషించారన్న పేరు వీకే సక్సేనాకి ఉంది.
మనోజ్ సిన్హా
ప్రస్తుత జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్. బీజేపీ సీనియర్ నేత ఉత్తరప్రదేశ్‌లోని పుర్వాంచల్ ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి. కశ్మీరు పాలనలో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈయన పదవీ కాలం ఈ ఏడాది ఆగస్టు 6తో ముగుస్తుంది
రాజ్‌నాథ్ సింగ్..
ప్రస్తుతం కేంద్ర రక్షణ మంత్రిగా ఉన్న రాజ్నాథ్ సింగ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. ప్రస్తుతం రాజ్ నాథ్ వయసు 74 ఏళ్ళు. 75 ఏళ్ల ఫార్ములా నేపథ్యంలో రాజ్‌నాథ్‌ను రాజ్యాంగ బద్ద పదవిలోకి పంపుతారనే చర్చ జరుగుతుంది
జేపీ నడ్డా..
జేపీ నడ్డా ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య మంత్రి, బీజేపీ అధ్యక్షుడుగా ఉన్నారు. వచ్చే నెలలో బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడు రానున్న నేపథ్యంలో నడ్డాను రాజ్యాంగబద్ధమైన పదవిలోకి పంపుతారన్న చర్చ జరుగుతుంది. రాజ్యసభ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించగల వ్యక్తి బీజేపీకి చెందిన వారైతే సభలో ఎటువంటి ఇబ్బంది ఉండదని బీజేపీ భావిస్తున్నట్లుగా సమాచారం
శశి థరూర్..
కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీ సీనియర్ నేత శశి థరూర్ పేరునూ ప్రధాని మోదీ పరిశీలించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఏడాది కాలంగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న శశి థరూర్.. త్వరలోనే బీజేపీలో చేరతారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి పదవికి బీజేపీ అవకాశం ఇస్తుందని రాజకీయంగా చర్చ జరుగుతుంది.
అరిఫ్ మొహమ్మద్ ఖాన్
బీహార్ గవర్నర్, మాజీ కాంగ్రెస్ నేత. హిందూ పురాణాలు, గ్రంథాలపై అవగాహన కలిగిన పండితుడిగా ఆరిఫ్‌కు బీజేపీలో మంచి గుర్తింపు ఉంది. ముస్లిం వర్గానికి చెందిన ఆయనను ఉప రాష్ట్రపతి చేస్తే ముస్లిం ఓటరు పెద సంఖ్యలో ఉన్న బీహార్‌లో లబ్ది జరుగుతుందన్న ఆలోచనలు బీజేపీ ఉన్నట్లుగా తెలుస్తుంది.
ఉపరాష్ట్రపతి అధ్యక్ష పదవి రేసులో ప్రాంతాలు, రాజకీయాలు, సామాజిక కోణాల ఆధారంగా నేతల పేర్లు వినిపిస్తున్నాయి. అధికారికంగా ఎవరు రేసులో ఉంటారనేది మాత్రం కేంద్ర ఎన్నికల షెడ్యూల్ ఆధారంగానే తెలియనుంది. ఈసీ షెడ్యూల్ వెలువడిన తర్వాత బీజేపీ, ఎన్డీఏ పక్షాల సమావేశం.. ప్రతిపక్షాల తరపున ఇండియా కూటమి నేతల సమావేశం తరువాతనే అభ్యర్థులపై స్పష్టత వస్తుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




