Thalapathy Vijay: రాజకీయాల్లోకి దళపతి విజయ్.? త్వరలోనే కొత్త పార్టీ ప్రకటన.!
తమిళనాట మరో రాజకీయ పార్టీ ఏర్పాటు కాబోతోంది. సినీ చరిష్మాతో ఇక్కడ ఇప్పటికే అనేక మంది రాజకీయాల్లోకి వచ్చి.. కొందరు సక్సెస్ కూడా అయ్యారు. ఇప్పుడు తమిళనాట మాస్ ఫాలోయింగ్ ఉన్న దళపతిగా అభిమానులు ఆరాధించే విజయ్ పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమయ్యారు.

తమిళనాడు/చెన్నై, జనవరి 27: తమిళనాట మరో రాజకీయ పార్టీ ఏర్పాటు కాబోతోంది. సినీ చరిష్మాతో ఇక్కడ ఇప్పటికే అనేక మంది రాజకీయాల్లోకి వచ్చి.. కొందరు సక్సెస్ కూడా అయ్యారు. ఇప్పుడు తమిళనాట మాస్ ఫాలోయింగ్ ఉన్న దళపతిగా అభిమానులు ఆరాధించే విజయ్ పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమయ్యారు. సొంతంగా పార్టీ ఏర్పాటుకు సన్నద్ధం అవుతున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
తమిళనాట రాజకీయాల్లోకి ఇప్పటిదాకా ఎంతోమంది నటీనటులు ఎంట్రీ ఇచ్చారు. అందులో సక్సెస్ అయ్యింది మాత్రం చాలా తక్కువ. సినీ నేపథ్యం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారు.. కరుణానిధి, ఎం.జి రామచంద్రన్, జయలలిత, టి.రాజేందర్, రాధా రవి, కారుణాస్, గౌతమి, సీమాన్, శరత్ కుమార్, కుష్బూ, విజయ్ కాంత్, కమల్ హాసన్.. తాజాగా ఉదయనిధి స్టాలిన్. ఉదయనిధి స్టాలిన్ సినీ నటుడు మాత్రమే కాదు దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి మనవడు, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు. అయితే ఇందులో సక్సెస్ అయ్యింది మాత్రం కేవలం ముగ్గురంటే ముగ్గురే. అది కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత.. వారికున్న పొలిటికల్ చరిష్మానే నమ్ముకోకుండా రాజకీయ వ్యూహాలతోనే రాణించగలిగారు.
ఇపుడు మరో నటుడు పొలిటికల్ ఎంట్రీ కోసం సిద్ధమవుతున్నారు. అతడే తమిళనాట మాస్ ఫాలోయింగ్ ఉన్న దళపతి విజయ్. చాలాకాలంగా విజయ్ పొలిటికల్ ఎంట్రీపై ప్రచారం జరుగుతోంది. విజయ్ మక్కల్ ఇయక్కమ్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. 2022లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మక్కల్ ఇయక్కమ్ తరపున అభ్యరులను బరిలోకి దింపారు. మొత్తం 169 స్థానాల్లో పోటీ చేస్తే 121 స్థానాల్లో విజయం సాధించారు. కమల్ హసన్ స్థాపించిన మక్కల్ నీదిమయ్యం, సీమాన్ నేతృత్వంలోని నామ్ తమిలర్ కట్చి ఈ ఎన్నికల్లో ఖాతా కూడా తెరవలేదు. దీంతో ఒక్కసారిగా తమిళ రాజకీయాల్లో నటుడు విజయ్ ట్రెండింగ్‌గా మారారు.
దక్షిణాది సూపర్ స్టార్‌గా పిలువబడే రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై ఎక్కడ లేని చర్చ నడిచింది. కానీ చివరకు తాను రాజకీయాల్లోకి రావడం లేదని తేల్చేశారు. అలాంటిది ఇప్పుడు విజయ్ పార్టీ ఏర్పాటు అంశం తెరపైకి వచ్చింది. ఇప్పటికే విజయ్ పేరుతో విజయ్ మక్కల్ ఇయక్కమ్ అభిమాన సంఘం ఉండగా దాన్నే రాజకీయ పార్టీగా మార్చనున్నారా.. లేదా.. మరో పేరుతో పార్టీ పెట్టనున్నారా.. అనేది తెలియాల్సివుంది. ఇందుకోసం ఇప్పటికే విజయ్ ‘మక్కల్ ఇయక్కమ్’ కీలక సమావేశం జరిగింది. ఫిబ్రవరి 4న ఢిల్లీ వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల టార్గెట్‌గా విజయ్ స్పీడ్ పెంచినట్లు ఆయన అభిమానులు చెబుతున్నారు. మరికొద్ది రోజుల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో 39 స్థానాల్లోనూ పోటీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఏర్పాటుకు ఢిల్లీలో ఈసీని కలవడానికి విజయ్ నేరుగా వెళతారా.. లేక ఆయన తరపున ప్రతినిధులు మాత్రమే వెళతారా.. అనేది చూడాలి.
మరిన్ని జాతీయ వార్తల కోసం..




