Ugadi 2026: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. తులా రాశి వారికి ఎలా ఉందంటే..?
Ugadi 2026 Panchangam Tula Rashi Phalalu: షష్ట స్థానంలో శని, దశమ-భాగ్య స్థానాల్లో గురు ప్రభావంతో తుల రాశి వారికి తెలుగు కొత్త సంవత్సరమంతా యోగప్రదమైన ఫలితాలు లభిస్తాయి. ఆదాయం పెరిగే అవకాశముంది. అదృష్టం అనుకూలంగా ఉంటుంది, సంతానం లేని వారికి సంతానం కలగవచ్చు. ఆర్థికంగా వృథా ఖర్చులను తగ్గించి ఆదాయ మార్గాలను పెంచడం సులభం. వ్యక్తిగత సమస్యలు కొద్దిగా పరిష్కారం అవుతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు..
ఆదాయం-5, వ్యయం-14 | రాజపూజ్యం-6, అవమానం-3
షష్ట స్థానంలో శనీశ్వరుడు ఈ ఏడాదంతా యోగప్రదంగా ఉంటాడు. భాగ్య, దశమ స్థానాల్లో ఉన్న గురువు వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. జూన్ మొదటి వారం నుంచి గురువు దశమ స్థానమైన కర్కాటకంలో ఉచ్ఛపడుతున్నందువల్ల జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. రాహు కేతువులు 11, 5 స్థానాల్లో బాగా అనుకూలంగా ఉన్నారు. మొత్తం మీద ప్రధాన గ్రహాలన్నీ శుభప్రదంగా ఉన్నందువల్ల ఈ సంవత్సరమంతా అనేక విధాలుగా యోగదాయకంగా ఉంటుంది.
ఆర్థిక వ్యవహారాలుః అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృథా ఖర్చులకు కళ్లెం వేస్తారు. ఇష్టమైన పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు ఒకటి రెండు పరిష్కారం అవుతాయి.
వృత్తి, ఉద్యోగాలుః ఉద్యోగంలో బాగా అనుకూల వాతావరణం ఉంటుంది. జీతభత్యాలు, ప్రమోషన్ వంటి విషయాలకు సంబంధించి శుభవార్త వింటారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ఇంటా బయటా ఒత్తిడి ఎక్కువగానే ఉన్నా ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగం మారడం గానీ, ఉద్యోగంలో మార్పు చోటు చేసుకోవడం గానీ జరుగుతుంది.
కుటుంబ వ్యవహారాలుః పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీసే అవకాశం కూడా ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో జూలై ప్రాంతంలో పెళ్లి జరిగే అవకాశం ఉంది. కుటుంబ, దాంపత్య జీవితాలు హ్యాపీగా సాగపోతాయి.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..