Viral News: ఆకాశం నుంచి ఆశ్చర్యకర రీతిలో వచ్చిన మృత్యు పాశం… ఓ వ్యక్తిని బలితీసుకున్న నెమలి..
Viral News: కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఓ యువకుడు అరుదైన కారణంతో ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డాడు. ఉడిపి జిల్లాకు చెందిన అబ్దుల్లా(24) మొబైల్ షాప్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
పుట్టిన ప్రతి మనిషికి మరణం తథ్యం..ఎవరూ దీన్ని తప్పించుకులేరు. అయితే ఆ మరణం ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో తెలియదు. ఆ కారణంతోనే మరణం ఎవరికీ తెలియని సృష్టి రహస్యమంటారు. కొన్ని అరుదైన కారణాలలో సంభవించే మరణాలు మనకు కాస్త ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఓ యువకుడు ఈ తరహాలోనే అరుదైన కారణంతో ప్రమాదవశాత్తు మృత్యు ఒడికి చేరాడు. ఉడిపి జిల్లాకు చెందిన అబ్దుల్లా(24) మొబైల్ షాప్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రెండ్రోజుల క్రితం తన గ్రామం నుంచి మొబైల్ షాప్‌కు జాతీయ రహదారిపై స్కూటీలో వెళ్తుండగా ఒక్కసారిగా ఆకాశంలో ఎగురుతూ వచ్చిన నెమలి…అతని తలను బలంగా ఢీకొట్టింది. ఈ అనూహ్య పరిణామంతో అబ్దుల్లా స్కూటీ అదుపుతప్పింది. రోడ్డు పక్కనున్న డివైడర్‌ను బలంగా ఢీకొన్నాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అబ్దుల్లా అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పుదుబిద్రి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. జాతీయ రహదారి ఒకవైపు నుంచి మరోవైపునకు నెమలి దాటుతుండగా…అదే సమయంలో స్కూటీపై అబ్దుల్లా రావడంతో అతని తలను నెమలి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
జాతీయ రహదారిపై నెమళ్ల గుంపు యదేచ్ఛగా సంచరిస్తూ వాహన ప్రమాదాలకు కారణమవుతున్నట్లు స్థానికులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. అలాగే తమ పంటలను నాశనం చేస్తున్నాయని వాపోతున్నారు. నెమళ్ల బెడదను పరిష్కరించేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మృతుని కుటుంబానికి పరిహారం చెల్లించడంతో పాటు… ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మొత్తానికి నెమలి ఢీకొని ఓ వ్యక్తి ఇలా ప్రాణాలు కోల్పోవడం కర్ణాటకలో చర్చనీయాంశంగా మారింది. ఆ వ్యక్తి పాలిట నెమలి మృత్యు పాశమయ్యిందని చర్చించుకుంటున్నారు.
Also Read..
‘మినీ మూవింగ్ హౌస్’ గా మారిన ఆటో.. అన్నీ ఉన్నా ఆ డ్రైవర్ లైఫ్ లో వెలితి.. ఏమిటంటే ?