Rain Alert: ఆ ప్రాంతాల్లో కుండబోత వర్షాలు.. 9 జిల్లాలకు ఆరెంజ్, ఐదు జిల్లాలకు ఎల్లో అలెర్ట్
తమిళనాడులోని పలు ప్రాంతాల్లో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై సహా పలు జిల్లాల్లో కుండపోత వాన బీభత్సం సృష్టించింది. ఈ నెల 21 వరకు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ విజ్ఞప్తి చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి లుక్కేయండి.

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తమిళనాడులో వరుణుడు మళ్లీ ప్రతాపం చూపాడు. దాంతో.. చెన్నె, కంచీపురం, తిరువళ్లూరు, చెంగల్‌పట్టు సహాతోపాటు పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. చెన్నైలో కుండపోత వాన పడడంతో.. పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రధానంగా.. చెన్నై నగరంలోని గిండి, అశోక్‌నగర్, వడపళనితోపాటు అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దాంతో.. భారీగా ట్రాఫిక్ జామ్ అయి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అందులోనూ.. ఉదయం అకస్మాత్తుగా కురిసిన వర్షంతో ఆయా ప్రాంతాల్లో ఆఫీసులకు వెళ్లేవారు, స్కూల్, కాలేజ్‌లకు వెళ్లే విద్యార్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
చెన్నైలో కొద్దిగంటల్లోనే 16 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు అయింది. తిరువళ్లూరులో ఓ రైల్వే బ్రిడ్జి కింద వాన నీరు భారీగా నిలిచిపోవడంతో తమిళనాడు ఆర్టీసీ బస్సు ఆ వరద నీటిలో చిక్కుకుంది. దాంతో.. ప్రయాణికులు దిగి వెళ్లిపోగా.. ఆ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. భారీ వర్షాల నేపథ్యంలో అప్రత్తమైన అధికార యంత్రాంగం.. సహాయక చర్యలు చేపట్టింది. మరోవైపు.. తమిళనాడులోని 9 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఈరోడ్, ధర్మపురిసేలం, విరుదునగర్, రామనాథపురంతోపాటు 5 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే.. చెన్నెలో మరికొద్దిరోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 21 వరకు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ విజ్ఞప్తి చేసింది.