AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamil Nadu Politics: తమిళనాట పొలిటికల్ కిరికిరి.. అన్నాడీఎంకేపై కన్నేసిన చిన్నమ్మ..!

పూలమ్మిన చోట కట్టెలమ్మడం అన్నది రాజకీయాల్లో అనేక సందర్భాల్లో నిజమైన మాట.. అలాగే పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి అన్నది కూడా రాజకీయాల్లో పలువురు చేసి చూపించిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం తమిళనాట రాజకీయాల్లో అదే జరుగుతోందా? అంటే అవుననే చెప్పాలి. అన్నాడీఎంకే మాజీ చీఫ్, దివంగత జయలలిత నెశ్చెలి, చిన్నమ్మ శశికళ కూడా అదే ప్రయత్నాల్లో ఉన్నారు. అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురై రాజకీయాలకు దూరంగా ఉంటున్న శశికళ.. తమిళ పాలిటిక్స్‌లో మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు.

Tamil Nadu Politics: తమిళనాట పొలిటికల్ కిరికిరి.. అన్నాడీఎంకేపై కన్నేసిన చిన్నమ్మ..!
Sasikala
Ch Murali
| Edited By: Janardhan Veluru|

Updated on: Jun 17, 2024 | 6:43 PM

Share

తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే కూటమి క్లీన్ స్వీప్‌ చేసింది. అన్నాడీఎంకే తో పాటు.. బీజేపీ కూడా తుడిచి పెట్టుకుపోయింది. దీంతో డీఎంకేకి పోటీ లేని పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో దివంగత సీఎం జయలలిత సహచరిణి శశికళ మళ్లీ పొలిటికల్ సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తమిళనాడుకు నేనున్నానంటున్నారు. తన పని అయిపోలేదని.. ఇంకా పోరాడే సత్తా ఉందని చెబుతున్నారు శశికళ. 2026లో తమిళనాడులో అమ్మ పాలనను తీసుకొస్తానంటున్నారు. త్వరలోనే ప్రజల్లోకి వచ్చి పర్యటిస్తానని వారికి భరోసా కల్పిస్తామని అన్నారు.

ప్రస్తుతం శశికళ అన్నాడీఎంకేలో లేకపోయినా.. ఆ పార్టీని రక్షించేది తాను మాత్రమే అంటున్నారు. డీఎంకే కోరల నుంచి తమిళనాడు ప్రజలను కాపాడాలంటే.. అన్నాడీఎంకే రావాల్సిన పరిస్థితి ఉందంటున్నారు శశికళ. అసలు రాజకీయాలే వద్దనుకున్న శశికళ, అసలు శశికళే వద్దనుకున్న అన్నాడీఎంకే వర్గాల మనసు మారిందా..? మూడు ముక్కలైన రెండాకుల పార్టీ మళ్ళీ ఒక్కటవుతుందా..? శశికళ అందుకు సిద్దంగా ఉన్నారా? అంటే అవుననే వాదన బలంగా వినిపిస్తోంది. అందుకు అనేక కారణాలు కళ్లముందు కనబడుతున్నాయి. జయలలిత మరణం తర్వాత శశికళ సారథ్యంలో ఎడపాడి పలనీ స్వామి సిఎం అయ్యారు.. శశికళ జైలుకి వెళ్లాక సీన్ మారింది. పలనీ ప్లేట్ మార్చారు. శశికళను పార్టి చీఫ్ పదవి నుంచి, పార్టీ నుంచి తొలగించారు. ఆ తర్వాత పరిణామాల్లో మాజీ సీఎంలు ఓ పన్నీర్ సెల్వం, పలనీ స్వామి రెండుగా విడిపోయారు. శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం ని స్థాపించారు. అంటే అన్నాడీఎంకే ఓటు బ్యాంకు మూడుగా చీలిపోయింది. కొందరు అన్నాడీఎంకే మాజీ ఎంపీలు బీజేపీ గూటికి కారడంతో లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి డ్యామేజ్ మరింత పెరిగింది.

2021 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధికారంలోకి రాగా.. అన్నాడిఎంకే 64 స్థానాలకు పరిమితం అయ్యింది. తాజా లోకసభ ఎన్నికల్లో తమిళనాడు, పుదుచ్చేరిలోని 40 కి 40 స్థానాల్లో డీఎంకే కూటమి విజయం సాధించింది. డీఎంకే పట్ల వ్యతిరేకత ఉన్నా అన్నాడిఎంకె ఓటు బ్యాంకు మూడుగా చీలడంతో డీఎంకే కూటమికి కలిసొచ్చింది. అందుకే అన్నాడీఎంకే మళ్ళీ అధికారంలోకి రావాలంటే మూడు ముక్కలైన పార్టీ అంతా ఏకతాటిపైకి రాక తప్పదు అంటోంది చిన్నమ్మ. అన్నాడిఎంకెలో కూడా కీలక నేతలు అందుకు సమ్మతిస్తున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు. ఏపీఎస్, ఓపిఎస్ కూడా ఇందుకు సిద్ధం కావాలని, లేదంటే డీఎంకేని కొట్టడం సాధ్యం కాదన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే అన్నాడీఎంకేపై శశికళ నీడకూడా పడకూడదని కోరుకునే సీనియర్ నేతలు అన్నాడీఎంకేలో చాలా మందే ఉన్నారు. అన్నాడీఎంకే శశికళ చేతికి వెళితే ఇక తమ రాజకీయ భవితవ్యం ముగిసిపోయినట్లేనని వారు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో అన్నాడీఎంకేను తన ఆధీనంలోకి తీసుకోవడం శశికళకు అంత ఈజీ పనికాదు.

అటు నటుడు విజయ్ కూడా తమిళగ వెట్రి కళగం స్థాపించి 2026 ఎన్నికల టార్గెట్ గా ప్రజల్లోకి వస్తున్నారు.. ఈ నేపథ్యంలో శశికళ అడుగులు ముందుకు వేస్తున్నారు.. శశికళ ప్రయత్నాలు ఏమేరకు సఫలం అవుతాయో చూడాల్సివుంది.