Deputy CM’s Appointment: ‘డిప్యూటీ సీఎంల నియామకం రాజ్యాంగ విరుద్ధం కాదు..’ సుప్రీంకోర్టు స్పష్టం

|

Feb 12, 2024 | 9:05 PM

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉపముఖ్యమంత్రులను నియమించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం (ఫిబ్రవరి 12) కొట్టివేసింది. ఈ విధానాన్ని అవలంబించడం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14 ఉల్లంఘన కాదని కోర్టు స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పబ్లిక్‌ పొలిటికల్‌ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం ప్రధాన న్యాయమూర్తి డాక్టర్‌ ధనంజయ యశ్వంత్‌ చంద్రచూద్‌తో కూడిన ధర్మాసనం కొట్టేసింది..

Deputy CMs Appointment: డిప్యూటీ సీఎంల నియామకం రాజ్యాంగ విరుద్ధం కాదు.. సుప్రీంకోర్టు స్పష్టం
Supreme Court
Follow us on

ఢిల్లీ, ఫిబ్రవరి 12: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉపముఖ్యమంత్రులను నియమించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం (ఫిబ్రవరి 12) కొట్టివేసింది. ఈ విధానాన్ని అవలంబించడం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14 ఉల్లంఘన కాదని కోర్టు స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పబ్లిక్‌ పొలిటికల్‌ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం ప్రధాన న్యాయమూర్తి డాక్టర్‌ ధనంజయ యశ్వంత్‌ చంద్రచూద్‌తో కూడిన ధర్మాసనం కొట్టేసింది. రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎంల నియామకాన్ని సవాల్‌ చేస్తూ పబ్లిక్‌ పొలిటికల్‌ పార్టీ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వడం రాజ్యాంగంలోని నిబంధనను ఉల్లంఘించడమేనని పిటీషన్‌లో పేర్కొంది. ఇలా చేయడం ద్వారా రాష్ట్రాలు తప్పుడు ఉదాహరణగా నిలుస్తున్నాయని పిటిషనర్‌ ఆరోపించారు. ఈ పిటీషన్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిన్‌ డివై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. డిప్యూటీ సీఎంగా నియమితులైన వ్యక్తి ఎమ్మెల్యే, మంత్రి కాబట్టి.. ఆ పదవి ఎటువంటి రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించదు. ఎవరినైనా డిప్యూటీ సీఎంగా నియమిస్తే.. వారు క్యాబినెట్‌ మంత్రి హోదాలోనే ఉంటారు. ఇది రాజ్యాంగ విరుద్ధమేమీ కాదని సుప్రీం వెల్లడించింది.

ప్రజా రాజకీయ పార్టీ (పిటిషనర్) తరఫు న్యాయవాది కోర్టు ముందు వాదిస్తూ.. వివిధ రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎంలను నియమించడం ద్వారా అధికారులు తప్పుడు ఉదాహరణను చూపుతున్నారని, డిప్యూటీ సీఎంను నియమించడంలో ఆధారం ఏమిటని ప్రశ్నించారు. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ఉల్లంఘించడమేనని అన్నారు. తద్వారా ఈ కేసులో సంబంధిత అధికారులకు కోర్టు తగిన ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. అందుకు కోర్టు సమాధానం ఇస్తూ..‘ఒక పార్టీ లేదా సంకీర్ణ ప్రభుత్వంలోని సీనియర్‌ నాయకులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడానికి చాలా రాష్ట్రాలు ఉపముఖ్యమంత్రులను నియమించే పద్ధతిని అవలంబిస్తున్నాయి. అది కేవలం ఒక పేరు మాత్రమే. డిప్యూటీ సీఎంగా ఎవర్నైనా నియమిస్తే వారు కేబినెట్‌ మంత్రి హోదాలోనే ఉంటారు. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం ఉపముఖ్యమంత్రి అత్యంత ముఖ్యమైన మంత్రిగా ఉంటారు.

ఇది రాజ్యాంగ ఉల్లంఘన కిందకు రాదు. ముఖ్యమంత్రికి సహాయ సహకారాలు అందించేందుకు, ఇతర నాయకులకు తగిన ప్రాధాన్యం కల్పించేందుకు చాలా రాష్ట్రాలు డిప్యూటీ సీఎంలను నియమిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు ఒకరి కంటే ఎక్కువ ఉపముఖ్యమంత్రులను నియమించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలా నియమించిన ఉపముఖ్యమంత్రులకు కేబినెట్‌ మంత్రి హోదాలోనే వేతనం, ఇతర సదుపాయాలు అందిస్తారని కోర్టు స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.