AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అలా చేస్తే ఉద్యమమే.. ‘హిందీ’పై ఒక్కటవుతున్న దక్షిణాది రాష్ట్రాలు

హిందీ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ఒకే దేశం-ఒకే భాష వ్యాఖ్యల వేడి రాజుకుంటోంది. ఈ వ్యాఖ్యలపై ఉత్తరాదికి చెందిన బీజేపీ నేతలు తమ మద్దతును ఇస్తుంటే.. ప్రతిపక్షాల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ వివాదంపై ఓ ట్వీట్ చేస్తూ.. భారతదేశంలో చాలా భాషలు ఉండటం భరతమాత బలహీనత కాదంటూ కామెంట్ చేశారు. ఇక అదే పార్టీకి చెందిన సీనియర్ నేత జైరామ్ రమేష్ […]

అలా చేస్తే ఉద్యమమే.. ‘హిందీ’పై ఒక్కటవుతున్న దక్షిణాది రాష్ట్రాలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 17, 2019 | 12:46 PM

Share

హిందీ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ఒకే దేశం-ఒకే భాష వ్యాఖ్యల వేడి రాజుకుంటోంది. ఈ వ్యాఖ్యలపై ఉత్తరాదికి చెందిన బీజేపీ నేతలు తమ మద్దతును ఇస్తుంటే.. ప్రతిపక్షాల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ వివాదంపై ఓ ట్వీట్ చేస్తూ.. భారతదేశంలో చాలా భాషలు ఉండటం భరతమాత బలహీనత కాదంటూ కామెంట్ చేశారు. ఇక అదే పార్టీకి చెందిన సీనియర్ నేత జైరామ్ రమేష్ మాట్లాడుతూ.. భారతదేశం పలు భాషలకు పుట్టినిల్లని.. ఒకే దేశం- ఒకే భాష అన్న విధానాన్ని ఆచరణలోకి తీసుకురావడం కష్ట సాధ్యమని స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే ఈ వ్యాఖ్యలపై దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకమవుతున్నాయి. కేంద్రమంత్రి వ్యాఖ్యలపై మండిపడుతున్న ఇక్కడి పలు పార్టీల నేతలు ‘‘మా మీద బలవంతంగా హిందీని రుద్దకండి’’ అంటూ తమ గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. ఒకవేళ హిందీని బలవంతంగా రుద్దాలని చూస్తే ఉద్యమం తప్పదంటూ కూడా హెచ్చరికలు చేస్తున్నారు.

ఇటీవల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ వ్యాఖ్యలపై ట్వీట్ చేస్తూ.. హిందీ భాష దేశం మొత్తాన్ని ఒకే తాటిపైకి తీసుకొస్తుందనుకోవడం చాలా అసంబద్ధం. భారతీయులందరికీ హిందీ మాతృ భాష కాదు. వారందరిపై హిందీ భాషను బలవంతంగా రుద్దాలనుకోవడం వారిని బానిసలుగా మార్చడం లాంటిదే. కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు హిందీయేతర భాషలు మాట్లాడేవారిపై దాడి చేయడమే. భాష వలన ఏ భారతీయుడు ఇబ్బంది పడకూడదు. వైవిధ్యమే భారతదేశం బలం. సంఘ్ పరివార్ విభజన విధానాలను విడిచిపెట్టాలి. సమస్యల నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకు ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు’’ అని ఆయన కామెంట్ చేశారు.

మరోవైపు డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ వ్యాఖ్యలకు నిరసనగా తమ పార్టీ నేతృత్వంలో సెప్టెంబర్ 20న రాష్ట్ర వ్యాప్త నిరసనకు పిలుపునిచ్చిన ఆయన.. అమిత్ షా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలన్ని కలిసి రావాలని సూచించారు.

నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ కూడా ఈ వివాదంపై గళం విప్పారు. ఒక దేశం- పలు భాషలు పేరుతో ఓ వీడియోను విడుదల చేసిన ఆయన అందులో.. దేశంలోని అన్ని భాషలు, సంస్కృతిని గౌరవిస్తాం అన్న వాగ్దానంతో 1950లో భారతదేశం గణతంత్ర దేశంగా ఏర్పడిందని అన్నారు. ఇండియా స్వేచ్ఛాయుతమైన దేశమన్న వాదనను మీరు తప్పనిసరిగా నిరూపించుకోవల్సిందే.. ఏదైనా ఒక కొత్త చట్టం, కొత్త పథకం ప్రవేశపెట్టేముందు ప్రజల అభిప్రాయాలను సేకరించాలంటూ కేంద్రానికి చురకలు వేశారు. అంతేకాదు బలవంతంగా హిందీని తమపై రుద్దాలని చూస్తే మరో జల్లికట్టు తరహా ఉద్యమానికి సిద్ధమవుతామంటూ ఆయన హెచ్చరికలు జారీ చేశారు. అలాగే తమిళనాడులో అధికార డీఎంకే సైతం అమిత్ షా వ్యాఖ్యలపై నిరసన తెలిపింది. కేంద్రం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే తమ మద్దతు ఎప్పటికీ లభించదంటూ మంత్రి కె. పాండిరాజన్ నొక్కి వక్కాణించారు.

ఇక నటుడు ప్రకాశ్ రాజ్ కూడా హిందీ భాష వివాదంపై ట్విట్టర్‌లో స్పందించారు. నేను భారతదేశంలోని కన్నడిగుడిని. హిందీని రుద్దడం ఆపండి. ఒకే మతం, ఒకే భాష.. ఇంకా ఏం చేయబోతున్నారో అంటూ ఆయన మండిపడ్డారు.

వీరందరినీ పక్కనపెడితే ‘ఒకే దేశం ఒకే భాష’ నినాదంపై దక్షిణాదిన ఉన్న బీజేపీ నేతల నుంచి కూడా వ్యతిరేకత వినిపిస్తోంది. దీనిపై బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక సీఎం యడియూరప్ప ట్వీట్ చేస్తూ.. దేశంలో ఉన్న అన్ని భాషలు సమానమే. కర్ణాటకలో కన్నడ భాషను తగ్గించాలనుకునే ఏ నిర్ణయాన్ని మేము స్వాగతించం. కన్నడ భాషాభివృద్ధికి, రాష్ట్ర సంస్కృతికి మేము కట్టుబడి ఉన్నాం అని కామెంట్ చేశారు.

కాగా దేశ వ్యాప్తంగా విద్యా సంస్థల్లో రెండో భాషగా హిందీని తప్పనిసరి చేయాలని అమిత్ షా వ్యాఖ్యానించారు. విభిన్న సంస్కృతులను ఏకం చేయడానికే ఈ భాష ఉపయోగపడుతుందని కూడా ఆయన ప్రకటించారు. కాగా రెండోసారి ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలోనూ ఇలాంటి కామెంట్లే చేశారు కేంద్రమంత్రులు. దీనిపై అప్పుడు కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.