Meghalaya honeymoon murder: పెళ్లికి ముందే తల్లికి తన ప్రేమ విషయం చెప్పిన సోనమ్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హనీమూన్ మర్డర్ కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. రాజా రఘువంశీతో తనకు పెళ్లి ఇష్టం లేదని, బలవంతంగా వివాహం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని సోనమ్ తన తల్లిని ముందే హెచ్చరించిందట. ‘నాకు ఇష్టంలేదని చెబుతున్నా వినకుండా బలవంతంగా పెళ్లి చేస్తున్నారు.. తర్వాత మీరే విచారిస్తారు’ అని సోనమ్ హెచ్చరించినట్లు తెలుస్తోంది.

సోదరుడి కంపెనీలో పనిచేస్తున్న రాజ్ కుష్వాహాతో ప్రేమ వ్యవహారాన్ని తల్లికి ముందే చెప్పింది సోనమ్. పోలీసుల ఎంక్వైరీలో ఈ విషయం బయటికొచ్చింది. రాజా రఘువంశీతో పెళ్లి కుదిర్చిన టైంలో తల్లితో సోనమ్ గొడవపడింది. రాజ్ కుష్వాహాతో తన ప్రేమ వ్యవహారాన్ని చెప్పేసింది. కానీ తల్లి కుదరని చెప్పటంతో గొడవ జరిగింది. రఘువంశీని పెళ్లాడతా.. కానీ ఆ తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సోనమ్ తల్లిని బెదిరించింది. చివరికి అన్నంతపని చేసింది.
మే11న అయిష్టంగానే పెళ్లి పీటలెక్కిన సోనమ్ మూడుముళ్లు పడగానే మర్డర్ స్కెచ్ వేసింది. పెళ్లయ్యాక మూడురోజులు అత్తింట్లో ఏవో కారణాలు చెప్పి భర్తకు దూరంగానే ఉంది. భర్తతో కలిసి ఉండలేనని ప్రియుడికి మెసేజ్ పెట్టింది. తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని పుట్టింటికి వచ్చేసింది. కిరాయి ముఠాతో భర్త రఘువంశీని చంపేందుకు ప్లాన్‌చేసి హనీమూన్ వంకతో షిల్లాంగ్‌కి తీసుకెళ్లింది. మే20న ఇండోర్ జంట మేఘాలయ చేరినప్పట్నించీ హంతకముఠా వారిని వెంటాడుతూనే ఉంది. చివరికి రఘువంశీని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొచ్చి దగ్గరుండి హత్యచేయించింది సోనమ్.
హనీమూన్ ట్రిప్‌లో పక్కా ప్లాన్‌తో భర్త రాజా రఘువంశీని చంపించిన సోనమ్.. హత్య తర్వాత ఇండోర్‌కొచ్చి తన ప్రియుడిని కలిసింది. వారిద్దరూ ఒక గదిలో ఉన్నారని, పారిపోయేందుకు ప్లాన్ చేసినట్లు మధ్యప్రదేశ్ పోలీసుల ఎంక్వైరీలో తేలింది. ఓ ట్యాక్సీ మాట్లాడి సోనమ్‌ని యూపీకి పంపించాడు ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా. కేసును తప్పుదోవ పట్టించేందుకు సోనమ్ ఘాజీపూర్‌లో డాబా దగ్గరికి చేరుకుని తననెవరో కిడ్నాప్ చేసినట్లు డ్రామాలాడింది. కానీ తనే హత్య కుట్రకు సూత్రధారని ఆధారాలతో తేలిపోయింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి…