మార్క్సిస్ట్ పార్టీలో సీతారాం ఏచూరి వారసుడు ఎవరు? రేసులో ముందున్నది వారే..

సీతారాం ఏచూరి మరణానంతరం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) కొత్త ప్రధాన కార్యదర్శి ఎవరనే చర్చ మొదలైంది. 1964లో ఏర్పాటైన సీపీఐ(ఎం) చరిత్రలో ప్రధాన కార్యదర్శి ఒకరు పదవిలో ఉండగానే మరణించడం ఇదే తొలిసారి. రాజకీయ పార్టీలకు అధ్యక్ష పదవిలో ఉన్నవారే అధినేతగా వ్యవహరిస్తుంటారు. అయితే కమ్యూనిస్టు పార్టీలకు అందుకు భిన్నం.

మార్క్సిస్ట్ పార్టీలో సీతారాం ఏచూరి వారసుడు ఎవరు? రేసులో ముందున్నది వారే..
Sitaram Yechury
Follow us
Mahatma Kodiyar, Delhi, TV9 Telugu

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 13, 2024 | 11:42 AM

సీతారాం ఏచూరి మరణానంతరం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) కొత్త ప్రధాన కార్యదర్శి ఎవరనే చర్చ మొదలైంది. 1964లో ఏర్పాటైన సీపీఐ(ఎం) చరిత్రలో ప్రధాన కార్యదర్శి ఒకరు పదవిలో ఉండగానే మరణించడం ఇదే తొలిసారి. రాజకీయ పార్టీలకు అధ్యక్ష పదవిలో ఉన్నవారే అధినేతగా వ్యవహరిస్తుంటారు. అయితే కమ్యూనిస్టు పార్టీలకు అందుకు భిన్నం. ఈ పార్టీల్లో అధ్యక్ష పదవి ఉండదు. ప్రధాన కార్యదర్శి పదవి మాత్రమే ఉంటుంది. ఆ పదవిలో ఉన్నవారే పార్టీ అధినేతగా వ్యవహరిస్తుంటారు. మరణించే వరకు సీతారాం ఏచూరి సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన వారసుడి ఎంపిక కూడా పార్టీకి సవాలుగా మారింది. సీపీఐ(ఎం) నియమావళి ప్రకారం ప్రధాన కార్యదర్శిని పార్టీ కేంద్ర కమిటీ సమావేశంలో చర్చించి ఎన్నుకుంటారు. ఈ కమిటీ తదుపరి సమావేశం ముందు నిర్ణయించిన తేదీ ప్రకారం 9 నెలల తర్వాత జరగాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏచూరి వారసుడి కోసం సీపీఎం తన నియమావళిని మార్చుకుంటుందా అనే ప్రశ్న తలెత్తుతోంది.

సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శిని ఎలా ఎంపిక చేస్తుంది?

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) నియమావళిలోని ఆర్టికల్ 15 (5) పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంపిక గురించి వివరిస్తుంది. దీని ప్రకారం ప్రధాన కార్యదర్శిని ఎన్నుకునే హక్కు కేంద్ర కమిటీకి మాత్రమే ఉంది. కేంద్ర కమిటీ సమావేశంలో ప్రధాన కార్యదర్శితో పాటు ఆయనకు సహకరించేందుకు పొలిట్ బ్యూరో సభ్యులను కూడా ఎన్నుకుంటారు. ఇప్పటి వరకు సీపీఐ(ఎం)లో చేసిన ప్రధాన కార్యదర్శులంతా ఈ విధానంలోనే ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకునే నేత కచ్చితంగా పొలిట్ బ్యూరో సభ్యుడై ఉండాల్సి ఉంటుంది. 2015లో ఏచూరిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆయన పదవీకాలాన్ని 2022లో మళ్లీ పొడిగించారు.

సీపీఐ(ఎం) తదుపరి కేంద్ర కమిటీ సమావేశం 2025 ఏప్రిల్‌ నెలలో జరగాల్సి ఉంది. దీంతో పార్టీ ముందు రెండు ప్రత్యామ్నాయాలు కనిపిస్తున్నాయి. మొదటిది తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుత పొలిట్‌ బ్యూరో నేతను నియమించడం. అయితే, పార్టీ నియమావళిలో దీనికి ఎలాంటి నిబంధన లేదు.రెండవది, పార్టీ సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ ప్రతిపాదిత సమావేశపు తేదీలను ముందుకు జరిపి కొత్త ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోవడం. ఈ రెండింట్లో పార్టీ ఎటువైపు మొగ్గుచూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.

తదుపరి ప్రధాన కార్యదర్శి విషయంలో పార్టీ నేతలు ఏం చేయాలో నిర్ణయిస్తారని, అయితే ప్రధాన కార్యదర్శి పదవి ఎక్కువ కాలం ఖాళీగా ఉండదని, అందుకే త్వరలో సమావేశం నిర్వహించే అవకాశం ఉందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో మాజీ సభ్యుడు హన్నన్ మొల్లా తెలిపారు.

కొత్త ప్రధాన కార్యదర్శి రేసులో ఎవరున్నారు?

హన్నన్ మొల్లా చెప్పిన ప్రకారం, సీతారాం ఏచూరి వారసుడి ఎంపిక అంత సులభమేమీ కాదు. పార్టీని, ప్రజాస్వామిక ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఆయన లాంటి నాయకుడు లేడని అన్నారు. పార్టీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. రేసులో ముగ్గురి పేర్లు ముందంజలో ఉన్నాయి. మొదటి పేరు బెంగాల్ సీపీఐ(ఎం) కార్యదర్శి మహమ్మద్ సలీం. లోక్‌సభ మాజీ ఎంపీ సలీం మైనారిటీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. 2015లో విశాఖపట్నంలో జరిగిన సమావేశంలో సలీం పొలిట్‌బ్యూరో సభ్యునిగా ఎన్నికయ్యారు. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ మైనారిటీ ఓట్లపై కన్నేసింది. మైనారిటీల్లో పట్టు పెంచుకోడానికి సలీంకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంటుందని కొందరు విశ్లేషిస్తున్నారు.

పోటీదారుల జాబితాలో రెండో పేరు ఎంవీ గోవిందన్‌ది. గోవిందన్ కేరళ సీపీఐ(ఎం) కార్యదర్శిగా ఉన్నారు. 2022లో ఆర్గనైజేషన్ కమాండ్‌ని అప్పగించారు. 2026లో కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, గోవిందన్ ముఖ్యమంత్రి పి విజయన్ వర్గానికి చెందిన వ్యక్తిగా పేరుంది.

త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ పేరుపై కూడా చర్చ జరుగుతోంది. బెంగాల్, కేరళ బయటి నుంచి జనరల్ సెక్రటరీని నియమించే సమయం వస్తే మాణిక్ సర్కార్ పార్టీ బాధ్యతలు చేపట్టవచ్చని చెబుతున్నారు. సర్కార్‌కు సీపీఐ(ఎం)లో వర్గాలు లేవు.

అయితే ఇప్పటి వరకు మార్క్సిస్టు పార్టీలో ప్రకాష్ కారత్ వర్గం మాత్రమే ఆధిపత్యం చెలాయించింది. ఈ పరిస్థితుల్లో ఈ పోస్ట్‌కు ఆశ్చర్యకరమైన పేరు కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంటుందని కొందరు భావిస్తున్నారు.

కారత్ జనరల్ సెక్రటరీ అయితే ఇదే బ్రేకర్

మాజీ జనరల్ సెక్రటరీ ప్రకాష్ కారత్ వయసు ఇప్పుడు 75 ఏళ్లు కావడంతో జనరల్ సెక్రటరీ పదవికి ఆయన పేరు కూడా చర్చనీయాంశమైంది. సీపీఐ(ఎం) నియమావళి ప్రకారం, పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎవరైనా 3 పర్యాయాలు మాత్రమే జనరల్ సెక్రటరీగా పనిచేస్తారు. పదవీకాలం సగటున 3 సంవత్సరాలు. ప్రకాష్ కారత్ 2005 నుండి 2015 వరకు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. గరిష్ట పరిమితి మూడు పర్యాయాల పదవీకాలం పూర్తి చేశారు. కారత్ మళ్లీ ప్రధాన కార్యదర్శి కావాలనుకుంటే, పార్టీ నియమావళి సవరించాల్సి ఉంటుంది. ఇందుకోసం కనీసం మూడింట రెండు వంతుల కేంద్ర కమిటీ సభ్యుల సమ్మతి అవసరం.

సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి బాధ్యతలు ఏంటి?

మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీలో, జనరల్ సెక్రటరీ పదవిలో ఉండేవారే పార్టీ అధిపతిగా వ్యవహరిస్తారు. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి పొలిట్‌బ్యూరోలో కూర్చుని ప్రధాన విధాన నిర్ణయాలు తీసుకుంటారు. ఎన్నికల విధానాన్ని రూపొందించడం నుంచి ఉద్యమ రూపు రేఖలను నిర్ణయించడం వరకు పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యత. అయితే సీపీఐ(ఎం) నియమావళి ప్రకారం ప్రధాన కార్యదర్శి ఏకపక్షంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేరు. పొలిట్‌బ్యూరోతో పాటు, కేంద్ర కమిటీకి ఆయన నిర్ణయాలను వీటో చేసే హక్కును కలిగి ఉంటుంది.

సీతారాం ఏచూరి జనరల్ సెక్రటరీ ఎలా అయ్యారు?

2014 లోక్‌సభ ఎన్నికలలో ఘోర పరాజయం తర్వాత, ప్రకాష్ కారత్ రాజీనామాపై పుకార్లు తీవ్రమయ్యాయి. 2015లో జరిగిన పార్టీ కేంద్ర కమిటీ సమావేశంలో ఆయన రాజీనామాను కూడా ఆమోదించారు. ఆ తర్వాత కొత్త ప్రధాన కార్యదర్శిపై చర్చ మొదలైంది. సీనియర్ లెఫ్ట్ నాయకుడు రామచంద్రన్ పిళ్లైని ప్రధాన కార్యదర్శిగా చేయాలని ప్రకాష్ కారత్, ఆయన మద్దతుదారులు కోరుకున్నారు. అయితే ఈ ప్రతిపాదనపై పార్టీలో ఏకాభిప్రాయం కుదరలేదు. చివరకు పిళ్లై తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత సీపీఐ(ఎం) కొత్త ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి పేరు తెరపైకి వచ్చింది. ఏచూరి పట్ల వ్యతిరేకత లేకపోవడంతో ఏకగ్రీవంగా ఆయన ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.