Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhole Baba: సత్సంగ్ పేరుతో వంద మందికి పైగా మృతికి కారణమైన భోలే బాబా ఎవరు..?

ఓ ఆధ్యాత్మిక ఉత్సవం వందమందికి పైగా అమాయకులను బలితీసుకుంది. ఇంతకూ ఎవరీ భోలే బాబా..? లక్షల మంది భక్తులు వెళ్లేంతగా..ఆ సత్సంగ్‌లో ఏముంది..?

Bhole Baba: సత్సంగ్ పేరుతో వంద మందికి పైగా మృతికి కారణమైన భోలే బాబా ఎవరు..?
Bhole Baba
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 02, 2024 | 9:19 PM

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో ఒక ఆధ్యాత్మిక ఉత్సవం వందమందికి పైగా అమాయకులను బలితీసుకుంది. అనేక మంది గాయపడ్డారు. సాకార్ విశ్వ హరి, భోలే బాబా అని పిలిపించుకునే నారాయణ్ సకార్ హరి నిర్వహించిన సత్సంగం ముగింపులో ఈ సంఘటన జరిగింది. ఇంతకూ ఎవరీ భోలే బాబా..? లక్షల మంది భక్తులు వెళ్లేంతగా.. ఆ సత్సంగ్‌లో ఏముంది..?

యూపీలోని ఎటా జిల్లాలోని పాటియాలీ తహసీల్‌ ప్రాంతానికి చెందిన భోలే బాబా అసలు పేరు.. సూరజ్‌పాల్. కాన్షీరామ్‌నగర్‌కు చెందిన ఇతడు.. తనను తాను దేవుడికి ప్రతిరూపంగా చెప్పుకుంటాడు. ఉత్తరప్రదేశ్ పోలీస్‌ విభాగంలో పనిచేసిన సూరజ్‌పాల్‌.. 2006లో వీఆర్‌ఎస్‌ తీసుకుని భోలే బాబాగా అవతారం ఎత్తాడు. తనకు ఎవరూ గురువులు లేరని, భగవంతుడే తనకు జ్ఞానాన్ని అనుగ్రహించాడని చెప్పుకుంటాడు భోలే బాబా. మొదట్లో తన సొంత గ్రామంలోనే ఒక గుడిసెలో ఉంటూ ఆధ్యాత్మిక ఉపదేశాలు చేసిన భోలేబాబా.. ఇతర ప్రాంతాల్లో కూడా తన ఆశ్రమాలను ఏర్పాటు చేశాడు. ఇతడికి ఉత్తరప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా లక్షల సంఖ్యలో భక్తులు ఉన్నారు.

తన భక్తులకు బోధనలు ఇచ్చేందుకు ప్రతి ఏటా సత్సంగ్‌ పేరుతో భారీ ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహిస్తాడు భోలే బాబా. ఈ సత్సంగ్‌లో తన భార్యతో పాటు ఆసనంలో కూర్చుని బోధనలు అందిస్తాడు భోలే బాబా. కార్యక్రమం చివర్లో బాబా అనుచరులు భక్తులకు జలాన్ని పంపిణీ చేస్తారు. ఈ పవిత్ర జలం తీసుకుంటే రోగాలు దూరమవుతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఈ సంత్సంగ్‌కు లక్షల సంఖ్యలో జనం తరలి వస్తుంటారు. కరోనా సమయంలో కూడా నిబంధనలు పాటించకుండా.. 50వేల మందితో ఈ కార్యక్రమం నిర్వహించాడు భోలే బాబా.

ప్రస్తుతం ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో గత రెండేళ్లుగా భారీగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు..బాబా అనుచరులు. ఈ ఏడాది రతిభాన్పూర్‌లో నిర్వహించిన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రచారం కూడా నిర్వహించారు. ఊరూరా పోస్టర్లు అంటించారు. అయితే ఇంతపెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నా కూడా.. పోలీసుల నుండి గానీ, అధికార యంత్రాంగం నుండి గానీ ఎలాంటి అనుమతులు తీసుకోలేదు నిర్వాహకులు. అటు అధికారం యంత్రాంగం కూడా ఈ బాబా వ్యవహారంలో చూసి చూడనట్టు వ్యవహరించింది. భక్తుల తాకిడితో స్థానికంగా ఉన్న ట్రాఫిక్‌ వ్యవస్థ కుప్పకూలింది. అటు నిర్వాహకులు కూడా లక్షల సంఖ్యలో వచ్చిన భక్తులను కంట్రోల్‌ చేయలేక చేతులెత్తేశారు. దీంతో పెనువిషాదం చోటుచేసుకుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…