Update: జనతా కర్ఫ్యూ వెనుక అసలు రహస్యమిదే..!

జనతా కర్ఫ్యూ ఎందుకు? పద్నాలుగు గంటల పాటు ఇంట్లో వుండిపోతే కరోనాపై యుద్దమెలా అవుతుంది? ఎవరి ఇళ్ళలో వారు ఉంటూ.. చప్పట్లు కొడితే అత్యవసర పరిస్థితుల్లో పని చేస్తున్న వారికి కృతఙ్ఞత తెలిపినట్లు అవుతుందా ? గురువారం రాత్రి ప్రధాని మోదీ ప్రకటన తర్వాత ఈ సందేహాలు జోరందుకున్నాయి.

Update: జనతా కర్ఫ్యూ వెనుక అసలు రహస్యమిదే..!
Follow us
Rajesh Sharma

| Edited By: Ravi Kiran

Updated on: Mar 25, 2020 | 7:47 PM

Update: ‘జనతా కర్ఫ్యూ’ రహస్యమిది అని ఇంతకముందు చేసిన పోస్ట్ లో.. కరోనా వైరస్ సాధారణ వాతావరణంలో 10 నుంచి 12 గంటలు మాత్రమే బ్రతుకుతుంది అని రాశాం. కానీ కేంద్ర ప్రభుత్వ అధికారిక పౌర సమాచార శాఖ(PIB) వారు కరోనా వైరస్ మహమ్మారి 12 గంటల మాత్రమే జీవించి ఉంటుందన్న దానిపై ఎటువంటి ఆధారం లేదని సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. అలాగే కొన్ని ఉపరితలాల(గ్లాస్, ప్లాస్టిక్)పై సుమారు 72 గంటలు ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక కొన్ని అధ్యయనాల ప్రకారం కరోనా వైరస్ కొన్ని గంటల నుంచి కొద్ది రోజుల వరకు ఉపరితలాలపై జీవించి ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ కూడా వెల్లడించింది. అందువల్ల ఇంతకముందు మేము చేసిన పోస్ట్ లో కరోనా వైరస్ సాధారణంగా 10 నుంచి 12 గంటలు బ్రతుకుతుందన్నది తప్పు అని గమనించగలరు.

కరోనాపై యుద్దం ప్రకటించిన ప్రధాన మంత్రి ఈ ఆదివారం దేశ ప్రజలంతా జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఒక్కరోజు ఇంట్లో వుండిపోయినంత మాత్రాన కరోనా మహమ్మారిని ఎలా నివారిస్తామన్న సెటైర్లు పలు చోట్ల వినిపిస్తున్నాయి. విపక్షాలకు చెందిన వారు ప్రధాన మంత్రినుద్దేశించి సెటైర్లు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

ప్రధాన మంత్రి గురువారం రాత్రి దేశ ప్రజలనుద్దేశించి సుమారు అరగంట పాటు ప్రసంగించారు. అందరం కలిసి కరోనా మహమ్మారిని తరిమి కొట్టాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. ఎక్కువగా భయాందోళన వద్దంటూనే అదే సమయంలో నిర్లక్ష్యం వద్దని కూడా చెప్పారు. ఆదివారం (22 మార్చి, 2020) దేశప్రజలంతా ఇళ్ళలోనే వుండి జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చారు. జనతా కర్ఫ్యూ పాటించాల్సిన సమయాన్ని ప్రధాన మంత్రి స్వయంగా వెల్లడించారు. ఆదివారం ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ప్రజలంతా ఇళ్ళకే పరిమితి కావాలని సూచించారు.

అయితే ఉదయం ఏడు నుంచి రాత్రి 9 వరకు అంటే 14 గంటల పాటు ప్రతీ ఒక్కరు ఇంటికే పరిమితం కావాలని మోదీ పిలుపునిచ్చారు. ఈ  14 గంటలు జనతా కర్ఫ్యూ చేస్తే కరోనాను జయించగలమా అనే సందేహాలు అందరిలోనూ వ్యక్తమయ్యాయి. దాని వెనక ఉన్న అసలు రహస్యం ఏంటంటే కరోనా వైరస్ ఓ చోట 12 గంటలు మాత్రమే జీవించి ఉంటుందని.. కర్ఫ్యూ 14 గంటలు కాబట్టి.. అంతేకాకుండా ఈ సమయంలో ఏ ఒక్కరు, మరొకరిని కలిసే అవకాశం ఉండదు. దీనితో కరోనా వైరస్‌ వ్యాప్తి చెయిన్‌ లింక్‌ను తెగ్గొట్టేందుకు అవకాశం దొరుకుతుంది. అలాగే కొన్ని చోట్ల కర్ఫ్యూ వ్యవధినిపెంచుతుండటం వల్ల కరోనా వైరస్ బ్రతికే ఛాన్స్ ఉండదు.

ఇక ఈ అత్యంత కీలక సమయంలో అత్యవసర సేవలు నిర్వహిస్తున్న వారికి (డాక్టర్లు, నర్సులు, ఇతర అత్యవసర సేవా సిబ్బందికి, అంబులెన్స్ డ్రైవర్ నుండి ఆకుకూరలు, పాల పాకెట్లు వేసే కుర్రాని వరకు) కృతఙ్ఞత తెలిపేందుకు సాయంత్రం 5 గంటలకు ఇంటి వాకిట్లోకి/బాల్కనీలోకి వచ్చి చప్పట్లు కొడుతూ జేజేలు పలకడం కూడా పౌరులందరి బాధ్యత అని ప్రధాని సూచించారు.