National: ‘బెహెన్‌జీ’ కి నో ఎంట్రీ.. తేల్చి చెప్పేసిన సమాజ్‌వాదీ.. యూపీలో ఇక ముక్కోణపు పోటీయే
అసలు విపక్ష కూటమి తొలి సమావేశానికి కనీసం మాటమాత్రంగానైనా ఆహ్వానం లేకపోవడంతో మాయావతే విపక్ష కూటమిని తూలనాడుతూ దూరంగా ఉన్నారు. ఒకవేళ సంప్రదింపులు జరిపినా సరే సానుకూల నిర్ణయం వస్తుందన్న నమ్మకం కూడా లేదు. తాను కోరినన్ని సీట్లు ఇస్తే తప్ప కూటమిలో చేరే..

బహుజన్ సమాజ్ పార్టీ (BSP)కి విపక్ష కూటమి (I.N.D.I.A) నో ఎంట్రీ బోర్డ్ పెట్టేసింది. ఆ పార్టీని కూడా కూటమిలో చేర్చుకోవాలన్న కాంగ్రెస్ పార్టీ ఆలోచనలకు సమాజ్‌వాదీ పార్టీ (SP) బ్రేకులు వేసింది. ససేమిరా మాయావతిని చేర్చుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసింది. బీఎస్పీని చేర్చుకుంటే తాము తెగదెంపులు చేసుకోవాల్సి వస్తుందని కూడా హెచ్చరించింది. ప్రతిపక్ష కూటమి (I.N.D.I.A)లో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ, రాష్ట్రీయ లోక్‌దళ్ (RLD) సరిపోతాయని, నాలుగో పార్టీ అవసరం లేదని ఎస్పీ నేతలు స్పష్టం చేశారు. సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ నేతలు జరిపిన చర్చల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే అసలు బీఎస్పీని తమ కూటమిలో చేర్చుకోవాలన్న ఆలోచనే తప్ప సంప్రదింపులు కూడా జరగలేదు.
అసలు విపక్ష కూటమి తొలి సమావేశానికి కనీసం మాటమాత్రంగానైనా ఆహ్వానం లేకపోవడంతో మాయావతే విపక్ష కూటమిని తూలనాడుతూ దూరంగా ఉన్నారు. ఒకవేళ సంప్రదింపులు జరిపినా సరే సానుకూల నిర్ణయం వస్తుందన్న నమ్మకం కూడా లేదు. తాను కోరినన్ని సీట్లు ఇస్తే తప్ప కూటమిలో చేరే ప్రసక్తే లేదన్నట్టుగా బెహెన్‌జీగా పేరొందిన మాయావతి పట్టుబట్టే అవకాశాలే ఎక్కువ. మొత్తంగా మంగళవారం కాంగ్రెస్ – సమాజ్‌వాదీ పార్టీల మధ్య జరిగిన చర్చతో రాష్ట్రంలో పార్టీలు, పొత్తులు, కూటములపై స్పష్టత వచ్చింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో అధికార భారతీయ జనతా పార్టీ (BJP) నేతృత్వంలోని ‘నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్’ (NDA) ఒకవైపు, కాంగ్రెస్, సమాజ్‌వాదీ, రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీలతో కూడిన విపక్ష కూటమి (I.N.D.I.A) ఇంకోవైపు, మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (BSP) మరోవైపు.. మొత్తంగా ముక్కోణపు పోటీకి తెరలేచింది. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయన్నది మరింత ఆసక్తికరంగా మారింది.
బీఎస్పీతో చేదు అనుభవాలే..
ఉత్తర్‌ప్రదేశ్‌లో దళిత, బహుజన వర్గాల్లో ఇప్పటికీ గట్టి పట్టున్న బహుజన్ సమాజ్ పార్టీని సమాజ్‌వాదీ పార్టీ నేతలు దరిచేరనీయకపోవడానికి అనేక కారణాలు సాకుగా చూపుతున్నారు. ఆ పార్టీతో పొత్తు వల్ల పరస్పర ప్రయోజనం ఉండడం లేదన్నది మొదటి కారణం. గత సార్వత్రిక ఎన్నికలతో పాటు మరో దఫా బీఎస్పీతో సమాజ్‌వాదీ పొత్తు పెట్టుకుంది. కానీ ఏ సందర్భంలోనూ ఈ కూటమి విజయం సాధించలేకపోయింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ, ఎస్పీ, ఆర్ఎల్డీ పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. రాష్ట్రంలోని మొత్తం 80 సీట్లకు బీఎస్పీ 38, ఎస్పీ 37, ఆర్ఎల్డీ 3 స్థానాల్లో పోటీ చేశాయి. నాడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేకపోయినా స్నేహపూర్వకంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పోటీ చేసిన రాయ్‌బరేలీ, అమేఠీ నియోజకవర్గాల్లో తమ కూటమి తరఫున అభ్యర్థులను బరిలోకి దింపలేదు.
పోటీ చేసిన మొత్తం 78 స్థానాల్లో కూటమి 15 గెలుచుకోగా, అందులో 10 సీట్లు బీఎస్పీ గెలుచుకుంది. సమాజ్‌వాదీ పార్టీ కుటుంబ సభ్యులు పోటీ చేసిన స్థానాలు మాత్రమే ఆ పార్టీ దక్కించుకోగలిగింది. తమ బలమైన ఓటుబ్యాంకుగా ఉన్న యాదవుల జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లోనే అఖిలేశ్ యాదవ్ కుటుంబ సభ్యులు గెలుపొందారు. ఈ ఎన్నికల అనంతరం విశ్లేషించుకున్న సమాజ్‌వాదీ తమకు పొత్తు కారణంగా లాభం జరగలేదని, తమ ఓట్లు బీఎస్పీకి బదిలీ అయ్యాయి తప్ప బీఎస్పీ ఓట్లు తమకు బదిలీ కాలేదని తేల్చింది. అందుకే బీఎస్పీతో పొత్తు అంటే చేదు అనుభవాలే తప్ప ప్రయోజనం లేదని కాంగ్రెస్-ఎస్పీ సమావేశం అనంతరం ఎస్పీ నేత రాంగోపాల్ యాదవ్ తెలిపారు.
పెద్దరికం చేజార్చుకోవద్దు..
బీఎస్పీని వద్దని చెప్పడానికి రెండో కారణం.. రాష్ట్రంలో సమాజ్‌వాదీ పార్టీ పోషిస్తున్న పెద్దరికం, మాయావతి పెట్టే షరతులు. ప్రస్తుతం విపక్ష కూటమిలో పెద్దన్న పాత్రలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ.. యూపీలో మాత్రం సమాజ్‌వాదీయే పెద్దన్న. మొత్తం 80 సీట్లలో ఎవరికి ఎన్ని ఇవ్వాలన్నది డిసైడ్ చేసేది కూడా సమాజ్‌వాదీయే. యూపీలో తాము చిన్న భాగస్వామి అంటూ కాంగ్రెస్ పార్టీయే స్వయంగా ఈ విషయాన్ని తేల్చి చెప్పింది. ఈ దశలో 65 సీట్లకు తగ్గకుండా పోటీ చేయాలని ఎస్పీ నేతలు భావిస్తున్నారు. ఇలాంటి స్థితిలో బీఎస్పీ కూడా విపక్ష కూటమిలో చేరితే తమ పెద్దన్న పాత్ర చేజారిపోతుంది. రాష్ట్రంలో కూటమి పొత్తులపై బెహెన్‌జీ పెత్తనం పెరిగిపోతుంది. పైగా 40 సీట్లు ఆమె డిమాండ్ చేస్తుంది. ఒకవేళ కూటమి పొత్తులు ఫలించినా.. ఎస్పీ గెలుపొందే సీట్లు పరిమితమైపోతాయి. తద్వారా కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినా తమకు అంత పట్టులేకుండా పోతుంది. అదే 65కు పైగా సీట్లలో పోటీ చేసి, వీలైనన్ని ఎక్కువ గెలుచుకోగల్గితే కూటమిలో రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించవచ్చు. దానికి తగ్గట్టే మంత్రివర్గంలోనూ చోటు పొందవచ్చు. ప్రభుత్వ స్టీరింగ్‌ను తమ కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు. మాయావతిని చేర్చుకుంటే ఇవన్నీ అనివార్యంగా వదులుకోవాల్సి వస్తుంది. అందుకే సమాజ్‌వాదీ పార్టీ నేతలు కారణాలు, సాకులు వెతుకుతూ మాయావతికి ‘నో ఎంట్రీ’ బోర్డు పెడుతున్నారు.
ఆ రెండు స్థానాలు మీవే..
తొలి సమావేశంలో కాంగ్రెస్ పోటీ చేయబోయే స్థానాల్లో రెండు స్థానాలకు సమాజ్‌వాదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అవి గత రెండు దశాబ్దాలుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పోటీచేస్తున్న రాయ్‌బరేలీ, అమేఠీ స్థానాలు. అక్కడ మీరు అభ్యర్థులను ప్రకటించుకోవచ్చు అంటూ రెండు పార్టీల జరిగిన తొలి సమావేశంలో తేల్చి చెప్పింది. ఎస్పీ, ఆర్ఎల్డీ, కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల పంపకం, సర్దుబాటు గురించి ఈనెల 12న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించుకుంది. అత్యధిక స్థానాల్లో సమాజ్‌వాదీ, ఆ తర్వాత ఆర్ఎల్డీ, అతి కొద్ది స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. సమాజ్‌వాదీ ఆ దిశగా ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేసింది. పార్టీ తరఫున అసెంబ్లీలో గెలుపొందిన 111 మంది ఎమ్మెల్యేలతో పాటు ఓడిన అభ్యర్థులు, ఎంపీలు, సీనియర్ నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తోంది.
రాష్ట్రంలోని మొత్తం 80 నియోజకవర్గాల్లో స్థితిగతులు, విజయావకాశాలపై ఆరా తీస్తోంది. వివిధ సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుంటూ కసరత్తు చేస్తోంది. తమ వెంట నిలుస్తున్న యాదవ, ముస్లిం వర్గాలతో పాటు యాదవేతర బీసీ వర్గాలను కూడా ఆకట్టుకోవాలన్నది సమాజ్‌వాదీ ఆలోచన. ఆ దిశగా ఈసారి టికెట్ల కేటాయింపులో యాదవేత బీసీ వర్గాలకు పెద్దపీట వేసే అవకాశం ఉంది. ఎందుకంటే.. యాదవేతర బీసీ వర్గాలు బీజేపీకి వెన్నుదన్నుగా నిలిచాయి. అలాగే చెప్పుకోదగ్గ సంఖ్యాబలం కల్గిన బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ (ఠాకూర్లు) కూడా బీజేపీకే మద్దతుగా నిలుస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఒకప్పుడు తమవెంట నడిచిన ఇతర బీసీ వర్గాలను మళ్లీ దరిచేర్చుకోవాలన్న ప్రయత్నం సమాజ్‌వాదీ చేస్తోంది. జనవరి 12న జరిగే సమావేశంలో ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న అంశంపై స్పష్టత రానుంది. ఆ తర్వాత ఏయే స్థానాల్లో ఎవరు పోటీ చేయాలన్నది నిర్ణయించి, ఆ వెంటనే అభ్యర్థులను కూడా ప్రకటించాలని కూటమి నేతలు భావిస్తున్నారు. షెడ్యూల్ ప్రకటించేలోగానే అభ్యర్థుల కసరత్తు పూర్తిచేస్తే ఎక్కువ సమయం ప్రచారానికి ఆస్కారం ఉంటుందన్నది వారి ఆలోచన.
మొత్తంగా మాయావతికి ‘నో’ చెప్పడం ద్వారా ముక్కోణపు పోటీకి తెరలేపిన యాదవ పరివారం నేతలు… రాష్ట్రంలో ఆసక్తికర రాజకీయ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ట కార్యక్రమంతో హిందూ ఓటుబ్యాంకును సంఘటితం చేసి ప్రయోజనం పొందాలని చూస్తున్న బీజేపీకి ఈ కూటమి ఎంతమేర చెక్ పెడుతుందన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో బలమైన పార్టీగా ఉన్న బీఎస్పీతో కలిసి పోటీచేసినా ఓడించలేకపోయినా యాదవ పరివారం, ఇప్పుడు రాష్ట్రంలో ఒకట్రెండు ప్రాంతాల్లో తప్ప పెద్దగా ప్రభావం లేని కాంగ్రెస్, ఆర్ఎల్డీలతో కలిసి ఎంతమేర ఢీకొట్టగలదు అన్న సందేహాన్ని రేకెత్తిస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..