రాష్ట్రీయ జనతాదళ్(ఆర్‌జేడీ) అధినేత, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కిడ్నీ మార్పిడి చికిత్స కోసం సింగపూర్ బయలుదేరారు. ఈ మేరకు ఆయన వెంట తన చిన్న కుమారుడు తేజస్వి యాదవ్, ఇతర కుటుంబ సభ్యులు తోడుగా వెళ్తున్నారు. సింగపూర్‌లో ఉంటున్న లాలూ ప్రసాద్ చిన్న కూతురు రోహిణీ ఆచార్య ఆయనకు తన కిడ్నీని ప్రదానం చేయనున్నారు. ఆయన కిడ్నీ మార్పిడి కోసం సింగపూర్ వెళ్తున్న నేపథ్యంలో ఆర్‌జేడీ లీడర్ తేజస్వీ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతమవుతుందని మాకు పూర్తి నమ్మకం ఉంది. ఆయన త్వరగా కోలుకోవాలని లాలూ శ్రేయోభిలాషులు ప్రార్థిస్తున్నార’’ని అన్నారు. ఆర్జేడీ సీనియర్ నేతలకు పార్టీలో తగిన గౌరవం దక్కడంలేదన్న బీజేపీ ఆరోపణల గురించి మాట్లాడుతూ..“అద్వానీ జీ లాగానా?” అని చమత్కరించారు.
అయితే, అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ సింగపూర్‌లో ఉంటున్న ఆయన చిన్న కుమార్తె రోహిణి ఆచార్య తన తండ్రికి కిడ్నీ దానం చేయనున్నారు. నవంబర్‌లో రోహిణి ఆచార్య సోషల్ మీడియా ద్వారా తన కిడ్నీలో ఒకదాన్ని తండ్రికి దానం చేస్తానని స్పష్టం చేశారు. రోహిణి తన తండ్రికి కేవలం ఒక చిన్న మాంసపు ముక్క మాత్రమే ఇస్తున్నానని పోస్ట్‌లో రాసుకొచ్చారు. ‘‘ నాన్న(లాలూ) కోసం నేను ఏమైనా చేయగలను. అంతా సవ్యంగా జరగాలని దయచేసి ప్రార్థించండి’’ అని ఆమె తన పోస్ట్ ద్వారా అభిమానులకు కోరారు. ఇదిలావుండగా, మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతిని కూడా తన తండ్రికి తోడుగా వెళ్లెందుకు ఢిల్లీ కోర్టు అనుమతించింది. డిసెంబర్ 5న తన తండ్రికి కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స జరుగుతుందని ఆమె కోర్టుకు పంపిన దరఖాస్తులో పేర్కొన్నారు.
కాగా, ఫాడ్డర్ స్కాం కేసులో అరెస్టయిన లాలూ ప్రసాద్ చికిత్స కోసం బెయిల్‌పై బయటకు వచ్చి ఢిల్లీ, రాంచీల్లో పలుమార్లు ఆస్పత్రిలో చేరారు. కొన్ని సంవత్సరాలుగా కిడ్నీ, మధుమేహం, రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇటీవల సింగపూర్ వెళ్లినప్పుడు అక్కడి డాక్టర్లను సంప్రదించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు కిడ్నీ మార్పిడి చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆయనకు తన కిడ్నీని దానం చేస్తానంటూ ఆయన కూతురు రోహిణీ ఆచార్య ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
మరిన్ని జాతీయ వార్తల కోసం..