రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పెద్దల సమక్షంలో, సంప్రదాయబద్దంగా పెళ్లి చేసుకున్న భర్తకు అతని భార్య రాఖీ కట్టింది. ‘ప్లీజ్ నన్ను నా ప్రియుడు వద్దకు పంపించు’ అంటూ వేడుకుంది’ ఆ భార్య. ఇప్పుడీ వ్యవహారం రాజస్థాన్‌లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
రాజస్థాన్‌లోని బాలేసర్ ప్రాంతానికి చెందిన తరుణ శర్మ.. తన చిన్ననాటి మిత్రుడైన సురేంద్ర సంఖ్లను ప్రేమించి పెళ్లాడింది. అయితే, తమ కులస్తుడు కాదనే కారణంతో అమ్మాయి కుటుంబ సభ్యులు పెళ్లిని నిరాకరించారు. వీరిద్దరినీ విడదీశారు. కొన్నాళ్లపాటు తరుణను బంధించారు. ఆ తరువాత ఛత్తీస్‌ఘడ్ ప్రాంతానికి చెందిన తమ కులస్తుడైన జితేంద్ర జోషితో పెళ్లి చేశారు. అయితే, ఈ పెళ్లి ఇష్టం లేని తరుణ.. తన భర్తకు ఈ విషయాన్ని చెప్పింది. పైగా చేతికి రాఖీ కట్టి.. తనను తన ప్రియుడి వద్దకు పంపాలని వేడుకుంది. ఇదివరకే తనకు, తన ప్రియుడికి వివాహం జరిగిందని, తన తల్లిదండ్రులు బలవంతంగా ఈ పెళ్లి జరిపించారని మ్యాటర్ అంతా చెప్పేసింది. అయితే, జితేంద్ర ఇవేవీ పట్టించుకోకుండా ఆమెను వేధింపులకు గురి చేశాడట. దాంతో ప్లాన్ మార్చేసింది తరుణ. ఆరోగ్యం బాగోలేదంటూ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ ఇతరుల వద్ద నుంచి మొబైల్ ఫోన్ తీసుకుని, తన ప్రియుడికి సమాచారం అందించింది. అంతేకాదు.. తన పరిస్థితి సోషల్ మీడియాలో షేర్ చేసింది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సోనూసూద్ ని కూడా ట్యాగ్ చేసింది. దాంతో మ్యాటర్ సెన్సేషన్ అయ్యింది.
కాగా, ప్రస్తుతం ఈ మ్యాటర్ పోలీసుల వద్ద ఉంది. ఆమెను ఛత్తీస్‌ఘడ్ కాంకేర్ పరిధిలోని ‘సఖీ వన్ స్టాప్ సెంటర్’ సంరక్షణకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..