రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం.. ఖలాసీ వ్యవస్థకు ముగింపు

భారతీయ రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అనాదిగా వస్తోన్న ఖలాసీ వ్యవస్థకు ముగింపు పలకాలని రైల్వే శాఖ నిర్ణయించింది.

  • Tv9 Telugu
  • Publish Date - 1:46 pm, Fri, 7 August 20
రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం.. ఖలాసీ వ్యవస్థకు ముగింపు

Khalasi System in Railways: భారతీయ రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అనాదిగా వస్తోన్న ఖలాసీ వ్యవస్థకు ముగింపు పలకాలని రైల్వే శాఖ నిర్ణయించింది. అధికారుల ఇళ్ల వద్ద ప్యూన్లుగా పనిచేసే ఖలాసీలకు సంబంధించి ఎలాంటి కొత్త నియామకాలు చేపట్టకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు టెలిఫోన్‌ అటెండెంట్‌ కమ్‌ డాక్‌ ఖలాసీల(టీఏడీకే)కు సంబంధించిన నియామక ప్రక్రియను సమీక్షిస్తున్నట్లు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే జూలై 1, 2020 నాటికి చేపట్టిన నియామకాలను రైల్వే బోర్డు పునఃసమీక్షించబోతున్నట్లు పేర్కొంది. అన్ని రైల్వే సంస్థలకు ఇది వర్తిస్తుందని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

కాగా గ్రూప్ డీ కేటగిరీకి చెందిన ఖలాసీలు సీనియర్‌ రైల్వే అధికారుల నివాసాల వద్ద విధులు నిర్వహిస్తుంటారు. ఫోన్‌ కాల్స్‌ని‌ అటెండ్‌ చేయడం, ఫైల్స్‌ అందించడం వంటి పనులను వీరు చేస్తుంటారు. అయితే చాలా మంది అధికారులు వీరిని తమ వ్యక్తిగత పనులకు ఉపయోగించుకుంటున్నారన్న ఆరోపణలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఖలాసీ వ్యవస్థకు చరమగీతం పలకబోతోంది. కాగా కాలానుగుణంగా పలు మార్పులకు శ్రీకారం చుట్టిన రైల్వే శాఖ.. ఇప్పటికే డాక్‌ మెసేంజర్‌ వ్యవస్థకు ముగింపు పలికిన విషయం తెలిసిందే.

Read This Story Also: కూలీకి జాక్‌పాట్‌.. 35లక్షలు విలువ చేసే వజ్రాలు లభ్యం