Rahul Gandhi Team: ఏఐసీసీ ప్రక్షాళన షురూ..! సొంత టీమ్ ఏర్పాటు చేసుకుంటున్న రాహుల్..!
ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (AICC)లో భారీ మార్పులు, చేర్పుల దిశగా కసరత్తు జరుగుతోంది. రాహుల్ గాంధీ తన సొంత టీమ్ తయారు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఏకంగా సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శినే మార్చనున్నట్టు ఏఐసీసీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (AICC)లో భారీ మార్పులు, చేర్పుల దిశగా కసరత్తు జరుగుతోంది. రాహుల్ గాంధీ తన సొంత టీమ్ తయారు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఏకంగా సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శినే మార్చనున్నట్టు ఏఐసీసీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. అదే సమయంలో మరికొందరు ప్రధాన కార్యదర్శులను తప్పించి కొత్తవారికి ఆ బాధ్యతలు అప్పగించాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. ఏఐసీసీ కార్యదర్శులుగా 35 మందితో జాబితాను కూడా ఆయన సిద్ధం చేసుకున్నారట. కొద్ది రోజుల వ్యవధిలోనే సంస్థాగత మార్పులపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ క్రమంలో తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జులుగా ఉన్న ప్రధాన కార్యదర్శులను మార్చి మాజీ ముఖ్యమంత్రులకు ఆ బాధ్యతలు అప్పగించనున్నట్టు సమాచారం. అలాగే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకుని ఏఐసీసీ నుంచి కొందరు నేతలను తమ తమ సొంత రాష్ట్రాలకు కీలక బాధ్యతలు అప్పగించి పంపనున్నట్టు తెలిసింది. సాధారణంగా ఏ పార్టీలోనైనా మార్పులు, చేర్పులు సహజమే అయినప్పటికీ.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న మార్పుల్లో సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా ఉన్న కేసీ వేణుగోపాల్‌కు ఉద్వాసన పలకుతారన్న వార్తలే చర్చనీయాంశంగా మారాయి.
ఇంతకీ ఏం జరిగింది?
139 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కల్గిన కాంగ్రెస్ పార్టీలో ఏఐసీసీ అధ్యక్షుడి తర్వాత అంత కీలకమైన పదవి ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్). రాజకీయాల్లో కుటుంబ, వారసత్వంపై వస్తున్న విమర్శల నేపథ్యంలో గాంధీ-నెహ్రూ పరివారం తమకు అత్యంత నమ్మకస్తుడైన మల్లికార్జున ఖర్గేకు ఏఐసీసీ పగ్గాలు అప్పగించినప్పటికీ, పార్టీపై పూర్తి గుత్తాధిపత్యం ఆ కుటుంబానిదే అన్న విషయం బహిరంగ రహస్యమే..! పేరుకు మాత్రమే ఖర్గే అధ్యక్షుడు, కానీ కీలక నిర్ణయాలు తీసుకునేదీ గాంధీ-నెహ్రూ కుటుంబమే. విధేయత విషయంలో ఖర్గేతో ఈ కుటుంబానికి వచ్చిన ఇబ్బందేమీ లేనప్పటికీ.. దాదాపు అంతే ప్రాధాన్యత కలిగిన ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) పదవిలో ఉన్న కేసీ వేణుగోపాల్ విషయంలో విభేదాలు తలెత్తినట్టు తెలిసింది.
కేసీ వేణుగోపాల్ వ్యవహారశైలిపై పార్టీలో ఇతర సీనియర్లు చాలా కాలంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీ వాటిని మొదట్లో పెద్దగా లెక్కచేయలేదు. కానీ కొన్ని విషయాల్లో ఆయనే స్వయంగా చేదు అనుభవాలు ఎదుర్కోన్నట్టు తెలిసింది. అందుకే ఏఐసీసీ కార్యదర్శుల ఎంపిక విషయంలో కేసీ వేణుగోపాల్‌ను పూర్తిగా పక్కనపెట్టి మొత్తం 35 మందిని ఎంపిక చేశారు. ఈ కసరత్తులో రాహుల్ గాంధీకి సచిన్ రావు, మీనాక్షి నటరాజన్, శశికాంత్ సెంథిల్ సహకరించారని తెలిసింది. ఈ విషయం తెలియని కేసీ వేణుగోపాల్.. తానొక జాబితాను సిద్ధం చేశారని, అయితే రాహుల్ గాంధీ తాను రూపొందించిన జాబితా ఇచ్చి దాన్ని అమలు చేయాల్సిందిగా ఆదేశించేసరికి అవాక్కయ్యారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా ఉన్న తనకు ఏమాత్రం తెలీకుండా జాబితా రూపొందించడంపై ఆయన అసహనం కూడా వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఏదెలా ఉన్నా.. ఈ ఒక్క పరిణామం కేసీ ఉద్వాసన ఖాయమన్న సంకేతాలిస్తోంది. అయితే ఈ ఉద్వాసన కాస్త మర్యాదపూర్వకంగా ఉండేలా చూస్తున్నారని, ఆ క్రమంలో కేరళ పీసీసీ పగ్గాలు అప్పగించి ఆ రాష్ట్రానికి పంపించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ అది కుదరకపోతే పార్లమెంటులో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించి పక్కన పెట్టవచ్చని కొందరు నేతలు భావిస్తున్నారు.
మంటతో చలి కాచుకోవాలి. కౌగిలించుకుంటే మనమే కాలిపోతాం. ఈ సూత్రం పవర్ పాలిటిక్స్‌కి పూర్తిగా వర్తిస్తుంది. అధికార కేంద్రం (Power Centre)తో ఎంత దగ్గరగా, ఎంత దూరంగా ఉండాలో ఒక గీత గీసుకుని, ఆ మేరకు వ్యవహరించాలి. అంతకు మించి దగ్గరైతే.. వారికే నష్టం. అలాగని మరీ దూరంగా ఉన్న ప్రయోజనం ఉండదు. ఈ సూత్రాన్ని కేసీ వేణుగోపాల్ విస్మరించారు. అందుకే ఈ పరిణామాలను ఆయన ఎదుర్కోవాల్సి వస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
టీమ్ రాహుల్‌లో మాణిక్కం టాగోర్
మొత్తం 35 మందితో కూడిన ఏఐసీసీ కార్యదర్శుల జాబితాను రూపొందించే క్రమంలో రాహుల్ గాంధీ ప్రతి ఒక్కరి నేపథ్యాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఈ విషయంలో రాహుల్‌కు సచిన్ రావు, మీనాక్షి నటరాజన్, శశికాంత్ సెంథిల్ సహకరించారు. కాంగ్రెస్ వర్గింగ్ కమిటీ (CWC) సభ్యుడిగా ఉన్న సచిన్ రావు కమ్యూనికేషన్ నిపుణుడు. సీనియర్ నేత మీనాక్షి నటరాజన్ గతంలో మధ్యప్రదేశ్ మంద్సౌర్ నుంచి ఎంపీగా ఉన్నారు. రాహుల్ గాంధీ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టినప్పుటి నుంచి ఆయనకు చేదోడువాదోడుగా ఉన్నారు. ఇక శశికాంత్ సెంథిల్ మాజీ ఐఏఎస్ అధికారి. రాజకీయాల్లోకి వచ్చి తమిళనాడు నుంచి ఎంపీగా గెలుపొందారు. ఈ ముగ్గురూ ఏఐసీసీ కార్యదర్శుల ఎంపిక విషయంలో నేరుగా రాహుల్ గాంధీతో ఇంటర్వ్యూలు ఏర్పాటు చేశారు. సమర్థులు, ప్రతిభావంతులు అనుకున్నవారిని ఏరికోరి ఎంపిక చేశారు.
రాహుల్ గాంధీకి సన్నిహితులుగా ఈ ముగ్గురితో పాటు మాణిక్కం టాగోర్, ప్రతిణి షిండే, గౌరవ్ గగోయ్, అజయ్ మాకెన్ వంటి నేతలున్నారు. వారికి కూడా రాహుల్ టీమ్‌లో ప్రాధాన్యత ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏఐసీసీలో ఉన్న కొందరు పెద్దలను రాష్ట్రాలకు పంపే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులుగా ఉన్నవారిలో గులాం అహ్మద్ మీర్‌ను జమ్ము-కాశ్మీర్‌కు, రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలాను హర్యానాకు పంపిస్తారని తెలిసింది. అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా ఉన్న దీపాదాస్ మున్షీకి ఆమె సొంత రాష్ట్రం బెంగాల్ పీసీసీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది.
మాజీ ముఖ్యమంత్రులకు పార్టీ బాధ్యతలు..!
కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక, తెలంగాణ కీలకమైనవి. ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాలే ఆ పార్టీకి ఆయువు పట్టులా మారాయి. కాంగ్రెస్ పార్టీలో మితిమీరిన అంతర్గత ప్రజాస్వామ్యం, వర్గ పోరు వంటి సమస్యలు ప్రతి రాష్ట్రంలోనూ ఉన్నాయి. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య ఓవైపు, ఆ పదవి కోసం కన్నేసి దక్కించుకోలేకపోయిన అసంతృప్తిలో ఉన్న డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ మరోవైపు.. ఈ ఇద్దరికీ భిన్నంగా మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే మరోవైపు.. ఇలా ఎవరికివారుగా పవర్ సెంటర్లుగా మారారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. అక్కడ వారికి ప్రత్యర్థిగా ఉన్న భారతీయ జనతా పార్టీ(BJP)తో కంటే స్వపక్షంలో ఉన్న వర్గపోరు కారణంగానే పార్టీకి ఎక్కువగా నష్టం జరుగుతుందని అధిష్టానం ఆందోళన చెందుతోంది. ఈ పరిస్థితుల్లో ఆ రాష్ట్రానికి రాజకీయాల్లో, పాలనలో అనుభవం కలిగిన నేతను ఇంచార్జిగా పంపించి అన్ని గ్రూపుల మధ్య సమన్వయం సాధించాలని అధిష్టానం భావిస్తోంది. ఈ క్రమంలో రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, ఏఐసీసీ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్‌ను కర్ణాటక రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా పంపించే అవకాశం ఉందని తెలిసింది.
తెలంగాణ విషయానికి వస్తే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో అసంతృప్తులను ఎప్పటికప్పుడు గమనిస్తూ.. వారితో సమన్వయం చేసుకుంటూ సాఫీగా ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా కూడా రేవంత్ రెడ్డే ఉన్నారు. రేపు ఆ స్థానంలో మరొకరిని నియమించినప్పుడు పార్టీకి, ప్రభుత్వానికి మధ్య ఇదే సమన్వయం కొనసాగాలంటే అక్కడ కూడా అనుభవజ్ఞుడైన నేత ఇంచార్జిగా ఉండాలని అధిష్టానం భావిస్తోంది. ఈ క్రమంలో చత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ భగేల్‌ను తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా పంపించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఇలా మొత్తంగా ఏఐసీసీలో భారీస్థాయిలోనే ప్రక్షాళనకు కసరత్తు జరుగుతున్నట్టు అర్థమవుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..