PM Modi: ప్రాణాలను పణంగా పెట్టారు.. Z-Morh టన్నెల్‌ ప్రారంభోత్సవంలో కార్మికులకు ప్రధాని మోదీ నివాళులు..

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సోనా‌మార్గ్‌ టన్నెల్‌ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.. దాదాపు 2,500 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన Z-Morh టన్నెల్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం దేశ ప్రజలకు అంకితం చేశారు. పూర్తిగా సొరంగ మార్గంలో నిర్మించిన సోనా‌మార్గ్‌ టన్నెల్‌ పొడవు ఆరున్నర కిలోమీటర్లు ఉంటుంది..

PM Modi: ప్రాణాలను పణంగా పెట్టారు.. Z-Morh టన్నెల్‌ ప్రారంభోత్సవంలో కార్మికులకు ప్రధాని మోదీ నివాళులు..
Pm Modi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 13, 2025 | 2:48 PM

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సోనా‌మార్గ్‌ టన్నెల్‌ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.. దాదాపు 2,500 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన Z-Morh టన్నెల్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం దేశ ప్రజలకు అంకితం చేశారు. పూర్తిగా సొరంగ మార్గంలో నిర్మించిన సోనా‌మార్గ్‌ టన్నెల్‌ పొడవు ఆరున్నర కిలోమీటర్లు ఉంటుంది.. మొత్తం 12 కిలోమీటర్ల ప్రాజెక్టులో Z-మోడ్ టన్నెల్ పొడవు 6.5 కిలోమీటర్లు.. దీని ద్వారా సోనామార్గ్‌కు ఏడాది పొడవునా కనెక్టివిటీ ఉంటుంది. శీతాకాలంలో తీవ్ర హిమపాతం ఉన్నప్పటికీ రవాణాకు ఆటంకం లేకుండా టన్నెల్ ద్వారా ప్రయాణం చేయవచ్చు. కాగా.. Z-Morh టన్నెల్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. కీలక వ్యాఖ్యలు చేశారు.. ప్రాజెక్టును పూర్తి చేస్తున్న క్రమంలో ప్రాణాలు కోల్పోయిన ఏడుగురు కార్మికులకు నివాళులర్పించారు. కార్మికులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పనిచేశారని ప్రశంసించారు. జమ్ముకశ్మీర్‌ ఆర్థిక వ్యవస్థకు, పర్యాటక రంగానికి ఈ Z-మోడ్ టన్నెల్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు ప్రధాని మోదీ.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ జమ్మూ కాశ్మీర్‌తో తనకున్న లోతైన సంబంధాన్ని గుర్తుచేసుకున్నారు.. జమ్మూకశ్మీర్‌తో తనకు పాత సంబంధాలే ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఈ రోజు తాను గొప్ప బహుమతితో ఈ ప్రాంత ప్రజల మధ్యకు వచ్చానన్నారు. కొద్ది రోజుల క్రితం జమ్మూలో రైల్వే డివిజన్‌కు శంకుస్థాపన చేసే అవకాశం తనకు లభించిందన్నారు. ఈ రోజు సోనామార్గ్ టన్నెల్‌ను దేశానికి, జమ్మూ ప్రజలకు అప్పగించే అవకాశం తనకు లభించిందన్నారు. జమ్మూ-కశ్మీర్, లడఖ్‌ల చిరకాల కోరిక ఈ రోజు నెరవేరిందని పేర్కొన్నారు.

మోదీ శంకుస్థాపన చేశారంటే.. ప్రారంభిస్తారని.. అందుబాటులోకి తీసుకువస్తురని.. ఇదే అందరూ నమ్మాలని ప్రధాని మోదీ అన్నారు. ప్రతి పనికి ఒక సమయం ఉంటుందని.. సరైన సమయంలో సరైన పని జరగుతుందన్నారు. 2015 లో తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రమే సోనామార్గ్ టన్నెల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని.. తమ ప్రభుత్వ హయాంలో ఈ సొరంగం పనులు పూర్తి కావడం సంతోషంగా ఉందని మోదీ పేర్కొన్నారు.

ప్రధాని మోదీని ప్రశంసించిన సీఎం ఒమర్ అబ్దుల్లా..

జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికలు సజావుగా జరగడంపై ఒమర్ అబ్దుల్లా ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపారు.. “జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికలు జరిగాయి.. ఎక్కడా ఎలాంటి అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు లేవు.. అధికార దుర్వినియోగంపై ఫిర్యాదు లేదు. ఈ ఘనత మీకు (ప్రధాని మోదీకి), మీ సహచరులకు, భారత ఎన్నికల కమిషన్‌కు చెందుతుంది.. రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామన్న మీ వాగ్దానాన్ని అతి త్వరలో మీరు (పీఎం మోదీ) నెరవేరుస్తారని నా హృదయం చెబుతోంది’’.. అంటూ ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు.

ఈ ఇంజినీరింగ్ మైలురాయిని సాధించడానికి కఠినమైన పరిస్థితులను అధిగమించడంలో కార్మికుల అంకితభావాన్ని ప్రశంసిస్తూ ప్రాజెక్ట్‌లో పాలుపంచుకున్న అధికారులు, కార్మికులతో ప్రధానమంత్రి మోదీ ప్రత్యేకంగా సంభాషించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, జమ్మూ & కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పాల్గొన్నారు. ప్రారంభోత్సవం తరువాత, ప్రధాని మోదీ సొరంగంను పరిశీలించారు.. దాని రూట్ మ్యాప్‌ను సమీక్షించారు.. నిర్మాణ ప్రక్రియపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అన్నివైపులా టన్నెల్స్..

కశ్మీర్ లోయలో చలికాలం కురిసే మంచు..రవాణా వ్యవస్థను స్తంభింపజేస్తుంది. లోయను దాటి ఎటు వెళ్లాలన్నా..ఎత్తైన హిమాలయ పర్వత శిఖరాలను దాటి వెళ్లాల్సి ఉంటుంది. పర్వత శ్రేణుల్లో నివసించే గ్రామాలు, పట్టణాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతుంటాయి. ఈ పరిస్థితిని నివారించాలంటే పర్వతాలను అడ్డంగా తొలుస్తూ సొరంగాలను నిర్మించాల్సిందే. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అదే పని చేస్తోంది. శ్రీనగర్‌ను..రోడ్డు మార్గంలో నిరంతరం అనుసంధానించేందుకు అన్ని వైపులా టన్నెళ్లను నిర్మిస్తోంది. అందులో భాగంగా సోనామార్గ్‌ ప్రాంతంలో నిర్మించిన జడ్‌ మోడ్‌ టన్నెల్‌ను ప్రారంభించారు ప్రధాని మోదీ.

ఈరోజు ప్రారంభించిన Z-Morh సొరంగం కాశ్మీర్ లోయ – లడఖ్ మధ్య దూరాన్ని 49 కి.మీ నుంచి 43 కి.మీలకు తగ్గిస్తుంది.. వాహన వేగాన్ని గంటకు 30 కి.మీ నుండి 70 కి.మీ/గంకు పెంచుతుంది. సముద్ర మట్టానికి 8,650 అడుగుల ఎత్తులో ఉన్న ఈ సొరంగం కొండచరియలు – హిమపాతాలు సంభవించే మార్గాలను దాటవేసి, లేహ్‌కు వెళ్లే మార్గంలో శ్రీనగర్ – సోనామార్గ్ మధ్య అన్ని వాతావరణ కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి