Punjab Crisis: రాజకీయ సంక్షోభంలో పంజాబ్ కాంగ్రెస్.. మరికాసేపట్లో సీఎం చరణ్‌జీత్ సింగ్‌తో సిద్ధూ భేటీ
పంజాబ్ కాంగ్రెస్ రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయింది. ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగులోకొస్తున్నాయి. మాజీ పీసీసీ చీఫ్ సిద్ధూ కాసేపట్లో సీఎం చరణ్‌జీత్ సింగ్‌ను కలవనున్నారు.
Punjab Political Crisis: పంజాబ్ పాలిటిక్స్ రచ్చ ముదిరి పాకానపడింది. కాంగ్రెస్ రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయింది. ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగులోకొస్తున్నాయి. మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కీలక ప్రకటన చేశారు. బీజేపీలో చేరడం లేదని , కాంగ్రెస్‌లో ఉండడం లేదని తేల్చిచెప్పారు. త్వరలోనే రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు అమరీందర్. బుధవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. తాజాగా జాతీయ భద్రతాసలహాదారు అజిత్‌దోవల్‌తో కూడా భేటీ అయ్యారు.
మాజీ పీసీసీ చీఫ్ సిద్ధూ కాసేపట్లో సీఎం చరణ్‌జీత్ సింగ్‌ను కలవనున్నారు. ముఖ్యమంత్రి తనను చర్చలకు ఆహ్వానించినట్టు ట్వీట్ చేశారాయన. ముఖ్యమంత్రి చన్నీని కలుస్తామని..ఎలాంటి చర్చలకైనా సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. అమరీందర్ సింగ్ రాజీనామాతో చరణ్‌జిత్ చన్నీని సీఎంగా నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. ఆ తర్వాత పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేశారు సిద్ధూ. దీంతో మళ్లీ పార్టీలో కలవరం మొదలైంది. బుజ్జగింపులు మొదలుపెట్టింది అధిష్టానం. ఈ పరిస్థితుల్లో సిద్ధూ సీఎంతో భేటీ చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు, కాంగ్రెస్‌లో G-23 అలజడి మళ్లీ మొదలయ్యింది. పంజాబ్‌లో పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీనియర్లు. పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షుడు లేకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందన్నారు సీనియర్ నేత కపిల్ సిబాల్. వెంటనే వర్కింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారాయన. ఈ పరిణామాలతో సిబల్ ఇంటిపై దాడికి దిగారు కాంగ్రెస్ కార్యకర్తలు. టమాటాలు విసిరారు. యువజన కాంగ్రెస్ కార్యకర్తల దాడిపై ఆ పార్టీ మరో సీనియర్ నేత ఆనంద్ శర్మ మండిపడ్డారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సోనియాకు విజ్ఞప్తి చేశారు.