Gujarat: ఎన్నికల వేళ.. రూ.478కోట్లు విలువైన డ్రగ్స్ పట్టివేత.. ప్రకంపనలు సృష్టిస్తున్న వరస ఘటనలు..
గుజరాత్ లో మొదటి విడత అసెంబ్లీ జరుగుతున్న సమయంలో భారీగా డ్రగ్స్ పట్టబడటం ప్రకంపనలు కలిగిస్తోంది. సీజ్ చేసుకున్న నిషేధిత మత్తు పదార్థాల విలువ సుమారు. రూ.478.65 కోట్లు ఉంటుందన్న అధికారుల..
గుజరాత్ లో మొదటి విడత అసెంబ్లీ జరుగుతున్న సమయంలో భారీగా డ్రగ్స్ పట్టబడటం ప్రకంపనలు కలిగిస్తోంది. సీజ్ చేసుకున్న నిషేధిత మత్తు పదార్థాల విలువ సుమారు. రూ.478.65 కోట్లు ఉంటుందన్న అధికారుల ప్రకటన కలకలం సృష్టిస్తోంది. వడోదర నగరంలో గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ భారీ చర్యలు చేపట్టింది. శివార్లలోని తయారీ యూనిట్‌పై దాడి చేసి నిషేధిత మెఫెడ్రోన్ డ్రగ్‌తో పాటు రూ.478.65 కోట్ల విలువైన ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు రూ.290 కోట్లకు పైగా విలువైన నగదు, డ్రగ్స్, మద్యం, వస్తువులు సీజ్ చేశారు. ఐదుగురిని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఏటీఎస్ బృందం నిందితులను విచారించే పనిలో నిమగ్నమైంది. అరెస్టయిన నిందితులు లీగల్ కెమికల్స్ తయారీ ముసుగులో ఎండీ మెడిసిన్‌ను తయారుచేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. మెటల్ షీట్లతో తయారు చేసిన ఫ్యాక్టరీలో గత 45 రోజులుగా మెఫెడ్రోన్ అనే మాదక ద్రవ్యాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. మందుల తయారీకి ఉపయోగించే యంత్రాలనూ సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. అరెస్టయిన వారిని సౌమిల్ పాఠక్, శైలేష్ కటారియా, వినోద్ నిజామా, మహ్మద్ షఫీ దివాన్, భరత్ చావ్డాగా గుర్తించారు.
వడోదరకు చెందిన సౌమిల్ పాఠక్ డ్రగ్స్ తయారీ విధానాన్ని ‘డార్క్ వెబ్’ ద్వారా నేర్చుకున్నాడని, సింధ్రోత్ సమీపంలో యూనిట్ ఏర్పాటు చేసిన తర్వాత అందులో ఇతరులకు ప్రమేయం ఉందని విచారణలో తేలిందని ఏటీఎస్ అధికారులు వివరించారు. కెమిస్ట్రీ గ్రాడ్యుయేట్ అయిన శైలేష్ కటారియా కెమిస్ట్‌గా పనిచేసి వివిధ పదార్థాలతో ఎండీ డ్రగ్‌ను తయారు చేశాడు. 2017 సంవత్సరంలో ముంబయి పోలీసులు డ్రగ్స్‌తో సహా పాఠక్‌ను పట్టుకున్నారు. ఆ తర్వాత అతను జైలుకు వెళ్లాడు. జైలులో ఉన్న సమయంలో సలీం డోలాతో పరిచయం ఏర్పడింది. డ్రగ్స్ తయారీ గురించి ఇద్దరూ మాట్లాడుకునేవారు. బయటకు వచ్చిన తర్వాత ఇద్దరూ కలిసి ముడి సరుకు ఏర్పాట్లు చేశారు.
మరోవైపు.. గుజరాత్ లో గురువారం తొలి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. తొలి దశ ఎన్నికల్లో సౌరాష్ట్ర-కచ్‌తో సహా దక్షిణ గుజరాత్‌లోని 19 జిల్లాల్లోని 89 స్థానాలకు పోలింగ్ జరగనుంది. గుజరాత్ ఎన్నికలు ఢిల్లీ రాజకీయాల్లో కీలకంగా మారనున్నాయి. వరసగా ఏడోసారి కాషాయ జెండాను ఎగురవేసి.. ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలని బీజేపీ సర్వశక్తుల్ని ధారపోసింది. కమలం కంచుకోటను బద్దలుకొట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా.. ఢిల్లీ, పంజాబ్ సూత్రంతో గుజరాత్‌ను కైవసం చేసుకోవాలని ఆప్ దూకుడును ప్రదర్శించింది. చూడాలి మరి.. ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో..
మరిన్ని జాతీయ వార్తల కోసం..