Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PK Meet Rahul Gandhi: గుజరాత్‌‌పై గురి పెట్టిన కాంగ్రెస్.. రంగంలోకి పీకే.. రాహుల్‌తో కీలక భేటీ!

కాంగ్రెస్ కోసం గుజరాత్ ఎన్నికల్లో పీకే.. రాహుల్ గాంధీతో చర్చలు

PK Meet Rahul Gandhi: గుజరాత్‌‌పై గురి పెట్టిన కాంగ్రెస్.. రంగంలోకి పీకే.. రాహుల్‌తో కీలక భేటీ!
Congress
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 26, 2022 | 11:10 AM

Prashant Kishor Meet Rahul Gandhi: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ కాంగ్రెస్(Congress) కీలక నేత, ఎంపీ రాహుల్‌ గాంధీతో సమావేశం అయ్యారు. గత కొంతకాలంగా దూరంగా ఉంటూ వస్తున్న ఇద్దరు భేటీ రాజకీయ వర్గాల్లో హాట్‌ హాట్‌గా మారింది.. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో.. కాంగ్రెస్‌ పార్టీకి దారుణమైన ఫలితాలు చవిచూడాల్సి వచ్చింది. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లో కేవలం రెండు సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌లోనూ ఆశించిన స్థాయిలో సీట్లను సాధించలేకపోయింది. అధికారంలో ఉన్న పంజాబ్‌(Punjab) రాష్ట్రాన్ని చేజేతులారా వదులుకుంది. ఈ ఛేదు అనుభవాలను విశ్లేషించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలోనూ సుదీర్ఘంగా చర్చించారు. ఆ తర్వాత జీ-23 నేతలు గాంధీ కుటుంబంపై విమర్శలు ఎక్కుపెట్టారు. సోనియా, రాహుల్ గాంధీలు నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్‌తో రాహుల్ గాంధీ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కాంగ్రెస్‌ పార్టీతో కలిసి పని చేసేందుకు ప్రశాంత్ కిశోర్ గతంలో సుముఖత వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గతేడాది రాహుల్ గాంధీ పీకేతో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో కాంగ్రెసేతర ప్రతిపక్ష పార్టీల నేతలను ఏకం చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కలిసి పని చేసి టీఎంసీ పార్టీని బెంగాల్‌లో అధికారం తీసుకురావడం ప్రముఖ పాత్ర పోషించారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి వచ్చే ఎన్నికల కోసం పనిచేస్తున్నారు. అటు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సహా పలు పార్టీల కీలక నేతలతో నిరంతరం సమావేశమవుతున్నారు ప్రశాంత్ కిషోర్. దేశంలో 2024 ఎన్నికల నాటికి బీజేపీ ఎదుర్కొనేందుకు కూటమి ఏర్పాటు దిశగా సమావేశాలు జరుగుతున్నాయని జాతీయ రాజకీయాల్లో ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పనిచేసేందుకు.. గత ఏడాది ఇరువురి మధ్య చర్చలు జరిగాయి.

విశాల ప్రయోజనాల దృష్ట్యా.. ఇరువురి మధ్య సఖ్యత కుదిరినట్లు సమాచారం. పాత విభేదాలను పక్కన పెట్టి.. మళ్లీ ఇద్దరు కలిసినట్లు తెలుస్తోంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక, రాహుల్, ప్రశాంత్ కిషోర్ సమావేశాలను ధృవీకరించారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎన్నికల బాధ్యతలు చూస్తున్న మరో వ్యూహకర్త, ప్రశాంత్ కిషోర్ ఒకప్పటి సహచరుడు సునీల్ కనుగోలు.. ఈ ఏడాది చివర్లో జరిగే గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో.. కాంగ్రెస్‌ పార్టీ విజయం కోసం ప్రశాంత్‌ కిషోర్‌ పని చేసేందుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. కాంగ్రెస్‌ పార్టీతో ఎలాంటి అనుబంధం లేకుండా.. కేవలం ఓ ప్రొఫెషనల్‌గా పని చేసేందుకు ప్రశాంత్‌ కిశోర్‌ ఓకే చేసినట్లు తెలుస్తోంది. గుజరాత్‌ కాంగ్రెస్‌ నేతలతో రాహుల్ గాంధీ నిర్వహించిన సమావేశంలో.. ఈ అంశం ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ విజయం కోసం పనిచేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని గుజరాత్ కాంగ్రెస్ నేతలు సమావేశంలో వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ విషయంలో తుది నిర్ణయాన్ని రాహుల్ గాంధీకే విడిచి పెట్టినట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి..

Gujarat Elections: కాంగ్రెస్ కోసం గుజరాత్ ఎన్నికల్లో పీకే.. రాహుల్ గాంధీతో చర్చలు

బీజేపీ-శివసేన మధ్య ముదురుతున్న మాటల యుద్ధం.. తాజాగా మోడీకి సవాల్ విసిరిన సీఎం ఉద్ధవ్ ఠాక్రే!