BJP: కమలదళానికి పొత్తులు అనివార్యమే.. ఆ పార్టీలతో సిక్రెట్‌గా మంతనాలు.. 2024లో అలా జరిగితేనే..

| Edited By: Shaik Madar Saheb

Jun 11, 2023 | 5:24 PM

BJP Open To Regional Allies In Several States: స్థిరత్వం అంటూ లేకుండా అప్పటికప్పుడు ఏర్పడే సంభావ్యతలపై ఆధారపడే ఏకైక వృత్తి రాజకీయం.. మన నియంత్రణలో ఉన్న అంశాల కంటే నియంత్రణలో లేని అంశాలే ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంటాయి. అవే అభ్యర్థులు, పార్టీల గెలుపోటములను నిర్ణయిస్తూ ఉంటాయి.

BJP: కమలదళానికి పొత్తులు అనివార్యమే.. ఆ పార్టీలతో సిక్రెట్‌గా మంతనాలు.. 2024లో అలా జరిగితేనే..
BJP - 2024 Election
Follow us on

BJP Open To Regional Allies In Several States: స్థిరత్వం అంటూ లేకుండా అప్పటికప్పుడు ఏర్పడే సంభావ్యతలపై ఆధారపడే ఏకైక వృత్తి రాజకీయం.. మన నియంత్రణలో ఉన్న అంశాల కంటే నియంత్రణలో లేని అంశాలే ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంటాయి. అవే అభ్యర్థులు, పార్టీల గెలుపోటములను నిర్ణయిస్తూ ఉంటాయి. చివరకు దేశంలో ఏర్పడే ఎన్నికైన ప్రభుత్వాలను శాసిస్తూ ఉంటాయి. ఒక్క సీటు కూడా గెలుపొందకుండా కేవలం 4-5 శాతం ఓట్లను పొందగలిగే రాజకీయ పార్టీలు సైతం గెలిచే అభ్యర్థుల అదృష్టానికి గండి కొడుతుంటాయి. అందుకే యుద్ధంలో, రాజకీయాల్లో పొత్తులు చాలా ముఖ్యమని చెప్పడానికి చారిత్రక ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ భారతీయ జనతా పార్టీగా బాగా తెలుసు. వరుసగా రెండు పర్యాయాలు సంపూర్ణ మెజారిటీతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఈ సారి గెలుపు అంత ఈజీ కాదని భావిస్తోంది. ఎక్కడికక్కడ బలాబలాల లెక్కలు వేసుకుంటూ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. 2019లో రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో మొత్తం స్థానాల సంఖ్యలో ఒకట్రెండు మినహా దాదాపు అన్నీ గెలుచుకుని గరిష్ట స్థాయి సీట్లను కైవం చేసుకుంది. కానీ 2024లో ఇది పునరావృతం కాదని కమలదళానికి తెలుసు. ఇక్కడ తగ్గే సీట్లను ఇతర రాష్ట్రాల్లో సొంత బలాన్ని పెంచుకోవడం ద్వారా భర్తీ చేసుకోవాలని చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. అయితే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట ఆ ప్రయత్నం అనుకున్నంత సాఫీగా ముందుకు సాగడం లేదు. పైపెచ్చు బిహార్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో చెదిరిపోయిన స్నేహాలు అక్కడి విజయావకాశాలకు సవాళ్లు విసురుతున్నాయి. అదే సమయంలో ప్రతిపక్షాల ఐక్యత ఏ కాస్త రూపుదాల్చినా బీజేపీకి హోరాహోరీగా తలపడాల్సిన పరిస్థితి చాలా చోట్ల ఏర్పడుతుంది. మరోవైపు ప్రతిపక్షాల ఐక్యతారాగం, 450 నియోజకవర్గాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థిని బరిలో దింపడం వంటి వ్యూహాలు కూడా సవాలుగా మారాయి. ఈ పరిస్థితుల్లో భావసారూప్యత కల్గిన పార్టీలతో జట్టుకట్టి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)ను బలోపేతం చేయాలని నిర్ణయించింది. అయితే ప్రతిపక్షాల మాదిరిగా హడావుడి, హంగామా లేకుండా నిశ్శబ్దంగా మంతనాల కసరత్తు మొదలుపెట్టింది.

మిత్రులు దూరమైతే..

2019 సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలోని మొత్తం 48 సీట్లలో నాటి మిత్రపక్షం శివసేనతో కలిసి పోటీ చేయగా బీజేపీ 23, శివసేన 18 సీట్లు గెలుచుకున్నాయి. ఓట్ల శాతం చూసినా బీజేపీ 27.59 %, శివసేన 23.29% పొందాయి. రెండు పార్టీలకు కలిపి 50 శాతం కంటే ఎక్కువే వచ్చాయి. సార్వత్రిక ఎన్నికలు జరిగిన కొద్ది నెలలకే జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగిన స్నేహం, ఎన్నికల ఫలితాల అనంతరం చెదిరిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాతి పరిణామాల్లో ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ శివసేనలో ఏక్‌నాథ్ షిండే రూపంలో వచ్చిన చీలికతో ఆ ప్రభుత్వం పడిపోయింది. ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తే ఉద్దవ్ ఠాక్రే లేని శివసేన క్షేత్రస్థాయిలో అంత బలంగా లేదని తెలుసు. ఇక్కడ బీజేపీ తన సొంత బలానికి తోడుగా ఏక్‌నాథ్ షిండే వర్గంతో కలిసి కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) కూటమిని ఢీకొట్టడం అంత ఈజీ కాదని భావిస్తోంది.

ఇక బిహార్ విషయానికొస్తే 2019లో బీజేపీ, జనతాదళ్ (యునైటెడ్) కలిసి పోటీ చేయగా మొత్తం 40 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ 17, జేడీ(యూ) 16 సీట్లు గెలుపొందాయి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, జేడీ(యూ) అధినేత నితీశ్ కుమార్ ఎన్డీయేతో తెగదెంపులు చేసుకుని ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్న విషయం తెలిసిందే. ఇన్నాళ్లుగా బీజేపీ-జేడీ(యూ) ఒకవైపు, ఆర్జేడీ-కాంగ్రెస్ ఇతర పార్టీలు కలిసి ఒకవైపు నిలిచి పోటీపడ్డప్పుడు పైచేయి సాధిస్తూ వచ్చిన కమలనాథులు ఇప్పుడక్కడ ఒంటరిగా మిగిలిపోయారు. మిగతా అందరూ ఒక గొడుగు కిందికి చేరారు. సామాజిక సమీకరణాలు, ఎన్నికల గణాంకాలు అన్నీ బీజేపీ వ్యతిరేక కూటమికే అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ తీవ్రమైన పోటీని, ప్రతికూలతను ఎదుర్కోక తప్పదని ఆ పార్టీ అధినేతలకు అర్థమైంది. ఈ రెండు రాష్ట్రాల్లో కోల్పోయే సీట్లతో బీజేపీ సొంత బలం మెజారిటీ మార్కుకు దిగువకు పడిపోతుంది.

ఇవి కూడా చదవండి

కిం కర్తవ్యం?

దేశంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తూ.. అందుకు అనుగుణంగా వ్యూహాలు రచించే కమలదళం ఈ పదేళ్లలో చేసిన అభివృద్ధి పనుల గురించి గొప్పలు చెప్పుకున్నంత మాత్రాన ఓట్లు రాలవని గ్రహించింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీ సైద్ధాంతిక మాతృసంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్) కూడా ఇదే విషయం చెప్పింది. భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోదీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం, హిందుత్వ సైద్ధాంతిక ఎజెండా బలమైన ఆయుధాలేనని.. కానీ అవి మాత్రమే ఎన్నికల్లో గెలిపించడానికి సరిపోవని అభిప్రాయపడింది. రాష్ట్రాల్లో నాయకత్వాన్ని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. ఇందుకు ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలను ఉదాహరణలుగా చూపుతోంది. అక్కడ మోదీ పట్ల ఎంత అభిమానం, క్రేజ్ ఉందో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు కూడా దాదాపు అదే స్థాయిలో.. ఇంకా చెప్పాలంటే రవ్వంత ఎక్కవే ఉందన్న విశ్లేషణలు ఉన్నాయి. అలాగే ఆ రాష్ట్రానికే ప్రత్యేకమైన గూండాగిరి, రౌడీయిజం, నేర సామ్రాజ్యాలు వంటి ప్రత్యేక సమస్యలను ఉక్కుపాదంతో అణచివేయడం కూడా ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూలత తీసుకొచ్చింది. కానీ కర్ణాటకలో ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ముద్ర పడింది. అసమర్థ పాలనకు ఉదాహరణగా నిలించింది. దీంతో జాతీయ నాయకత్వం ఎంత బలంగా ఉన్నా సరే.. రాష్ట్ర నాయకత్వం బలంగా లేకపోవడం, ఎన్నికల ప్రచారంలో స్థానిక సమస్యలను విస్మరించి జాతీయ అంశాల గురించే ఎక్కువగా ప్రస్తావించడం వంటివి పార్టీకి ప్రతికూలంగా మారాయి.

ఈ పరిస్థితుల్లో పాత మిత్రులు, భావసారూప్యత కల్గిన కొత్త మిత్రులను కలుపుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల బీజేపీ ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశంలో భావసారూప్యత ఉన్న పార్టీలతో జతకట్టాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. అలాగే పాత మిత్రులతో తెగిన సంబంధాలను పునరుద్ధరించడానికి తగిన బ్రిడ్జిలను నిర్మించాలని కూడా సూచించారు. ప్రతిపక్షాల ఐక్యతను ఎదుర్కోవడానికి బలమైన జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) అవసరమని ప్రధాని మోదీ భావిస్తున్నట్లు పార్టీ అంతర్గత సమాచారం.

తెరుచుకుంటున్న తలుపులు

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి దక్షిణ భారతదేశంలో ఉన్న సొంత ప్రభుత్వాన్ని కోల్పోయిన బీజేపీ, పోయినచోటే వెతకాలి అన్న చందంగా అక్కణ్ణుంచే ఎన్డీయేను బలోపేతం చేసే కసరత్తు మొదలుపెట్టింది. కర్ణాటకతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఇంతకాలం మూసిన తలుపులను తెరుస్తోంది. కర్ణాటకలో జనతాదళ్ (సెక్యులర్)తో మంతనాలు ఈ కసరత్తులో భాగంగానే కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 19 సీట్లకే పరిమితమై నానాటికీ బలహీనపడుతున్న స్థితిలో ఉన్న జేడీ(ఎస్)కు కూడా ఇప్పుడు ఆసరా కావాలి. రాష్ట్రంలో వొక్కలిగ సామాజికవర్గంతో పాటు మైనారిటీలు, మరికొన్ని వర్గాలు కలిసి జేడీ(ఎస్) బలం గతంలో 18 శాతం కంటే ఎక్కువే ఉండేది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో వొక్కలిగ వర్గానికే చెందిన కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ జేడీ(ఎస్) ఓటుబ్యాంకులో చీలిక తీసుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నికల వరకు ఇది ఫలించినా.. తదుపరి ఇంత మేర చీలిక ఉండదని.. అటూ ఇటుగా 15% ఓటు బ్యాంకు జేడీ(ఎస్) వెంట ఉంటుందని కమలనాథులు అంచనా వేస్తున్నారు. గత ఎన్నికలతో పోల్చితే పెద్దగా ఓట్లను కోల్పోనప్పటికీ… జేడీ(ఎస్) నుంచి చీలి, కాంగ్రెస్‌కు అదనంగా జోడైన ఓట్లతో 42.8 శాతానికి చేరుకోవడం ఆ పార్టీకి కలిసొచ్చింది. ఇప్పుడు జేడీ(ఎస్)తో బీజేపీ జట్టుకడితే తమకున్న సొంత ఓటుబ్యాంకు 36 శాతానికి జేడీ(ఎస్) ఓటుబ్యాంకు కలిపితే 50 శాతం దాటవచ్చని అంచనాలు, లెక్కలు వేస్తున్నారు. బీజేపీతో పొత్తు కారణంగా జేడీ(ఎస్) నుంచి దూరమయ్యే ముస్లిం మైనారిటీలను పరిగణలోకి తీసుకుని లెక్కించినా సరే.. అంతిమంగా రెండు పార్టీలకూ లాభమేనని ఇరు పార్టీల నేతలు భావిస్తున్నారు. ఒకవేళ జేడీ(ఎస్) బీజేపీతో కాకుండా కాంగ్రెస్‌తో జట్టుకడితే పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటుంది. అందుకే మాజీ ప్రధాని దేవెగౌడ నేతృత్వంలోని ఆ పార్టీని ప్రతిపక్ష కూటమిలో చేరకుండా ప్రధాని మోదీ పావులు కదుపుతున్నారు.

పంజాబ్‌లో శిరోమణి అకాళీదల్ (ఎస్ఏడీ) వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దూరమవడంతో ఆ రాష్ట్రంలో బీజేపీ సొంతంగా బలపడాలని భావించింది. ఆ మేరకు తీవ్రంగా శ్రమించింది. అయినప్పటికీ పెద్దగా ఫలితం కనిపించలేదు. ఈలోగా జరిగిన అనేక ఎన్నికల్లో ప్రత్యర్థులు లాభపడుతూ వస్తున్నారు. జలంధర్ ఉప ఎన్నికల ఫలితాలు కూడా బీజేపీని ఆలోచనలో పడేశాయి. బీజేపీ, అకాలీదళ్ విడివిడిగా పొందుతున్న ఓట్లను కలిపి చూస్తే చాలా చోట్ల ఫలితాలు తారుమారవుతున్నాయి. అకాలీదళ్‌తో పొత్తుల గురించి క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుని చెప్పాలని బీజేపీ అధిష్టానం అక్కడి నాయకత్వాన్ని ఆదేశించింది. మరోవైపు రెండు పార్టీల సీనియర్ నేతల మధ్య ప్రాథమిక స్థాయి చర్చలు కూడా జరిగాయి. అకాలీదళ్ ఎన్డీఏ కూటమి నుంచి వెళ్లిపోవడానికి చూపిన ప్రధాన కారణం వివాదాస్పద వ్యవసాయ చట్టాలు. వాటిని ఎలాగూ కేంద్రం వెనక్కి తీసుకుంది కాబట్టి మళ్లీ తిరిగి కలవడానికి రాజకీయపరమైన అడ్డంకులు పెద్దగా ఏమీ కనిపించడం లేదు.

తెలుగుదేశంతో దోస్తీ..

తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీతో పాత స్నేహం మళ్లీ కొత్తగా చిగురిస్తే వచ్చే లాభనష్టాలపై కూడా చర్చలు మొదలయ్యాయి. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సమావేశం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలుగుదేశంతో పొత్తు గురించి తెలంగాణ నేతల అభిప్రాయాలు కోరగా.. చాలావరకు వ్యతిరేకతనే వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. సొంతంగా బలపడుతున్న సమయంలో ఆ బలాన్ని మరింత పెంచేలా ఉంటే ఫరవాలేదని, కానీ 2018లో తెలుగుదేశంతో జట్టుకట్టి విజయావకాశాలను దారుణంగా దెబ్బతీసుకున్న కాంగ్రెస్ ఉదాహరణ కళ్ల ముందు కనిపిస్తుంది కదా అని కొందరు నేతలు చెబుతున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీలోనూ ఇదే మీమాంస కనిపిస్తోంది. విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఆదుకోవడంలో బీజేపీ సరిగా వ్యవహరించలేదని, ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే మైనారిటీ ఓటుబ్యాంకు దూరమవడం, బీజేపీ వ్యతిరేకత ప్రభావం తమపై పడుతుందని తెలుగుదేశంలో కొందరు అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది. ఇలాంటి లెక్కలు, లాభనష్టాల బేరీజుల సంగతెలా ఉన్నా.. మొత్తంగా తెలుగుదేశంతో మళ్లీ కలిసే ప్రసక్తే లేదన్న స్థాయి నుంచి బీజేపీ చర్చలకు ద్వారాలు తెరిచే వరకు వచ్చింది. యూపీ, బిహార్ రాష్ట్రాల్లో కూడా బీజేపీ చిన్న చిన్న రాజకీయ పార్టీలతో మంతనాలు సాగిస్తోంది. పంతాలు వీడి పట్టువిడుపులతో పాత మిత్రులను కలుపుకుపోతేనే 2024లో విజయం తథ్యమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఆ దిశగానే కసరత్తు సాగిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..