తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై పొలిటికల్ పార్టీల ఫోకస్.. ఈనెల 23న నడ్డా పర్యటన

తమిళనాడులో ఏప్రిల్ - మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండంతో బీజేపీ జాతయ అధ్యక్షుడు జేపీ నడ్డా రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.

  • Balaraju Goud
  • Publish Date - 9:52 am, Wed, 10 February 21
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై పొలిటికల్ పార్టీల ఫోకస్.. ఈనెల 23న నడ్డా పర్యటన

JP Nadda tamilnadu tour : తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయాలు వేడెక్కాయి. అధికార అన్నాడీఎంకే, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కలసి పోటీ చేయబోతున్నాయని ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా ప్రకటించారు. తమిళనాడులో ఏప్రిల్ – మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండంతో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు జేపీ నడ్డా.

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని పార్టీ శ్రేణులతో సమీక్షా సమావేశం నిర్వహించేందుకు జేపీ నడ్డా ఈ నెల 23న రాష్ట్రానికి రానున్నారు. ఆయన కృష్ణగిరి, ధర్మపురి, వేలూరు, కడలూరు, విల్లుపురం, రాణిపేట, తిరువణ్ణామలై, తిరుపత్తూర్‌ జిల్లాల్లోని శాసనసభ నియోజకవర్గాలకు బీజేపీ అధిష్ఠానం నియమించిన ఎన్నికల నిర్వాహకులతో చర్చించనున్నారు. 23వ తేది వేలూరులో జరుగనున్న బహిరంగసభలో నడ్డా పాల్గొంటారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేటీ రాఘవన్‌ తెలిపారు.

మరోవైపు, నడ్డా పాల్గొనే కార్యక్రమాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్‌ఛార్జీ సీటీ రవి, కో-ఇన్‌ఛార్జి పొంగులేటి సుధాకర్‌ రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎల్‌.మురుగన్‌ తదితరులు పాల్గొంటారని తెలిపారు. నడ్డా రాకను పురస్కరించుకొని ఆయన పాల్గొనబోయే కార్యక్రమాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నట్లు రాఘవన్‌ తెలిపారు.

మరోవైపు, తమిళనాడులో రాబోయే ఎన్నికల్లో విజయం తమదేనన్న ధీమాతో ఉన్నారు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసే ముందుకు సాగాలని భావిస్తున్నారు. అటు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కూడా తమిళనాడు ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే తమిళనాడు లోని పలు ప్రాంతాలలో ఆయన పర్యటిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా కానీ తమిళనాడు అసెంబ్లీలో సత్తా చూపించడానికి జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ కూడా ప్రయత్నిస్తూ ఉన్నాయి.

Read Also…  మరికాసేపట్లో నెల్లికల్లు ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం.. హాలియా ధన్యవాద సభకు భారీగా ఏర్పాట్లు