PMVBRY: కొత్తగా ఉద్యోగంలో చేరితే రూ.15వేలు ఇస్తున్న కేంద్రం.. అగస్టు 1 నుంచే అమలు
కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వారిని ప్రోత్సహించేందుకు రూ.15వేలు ఇవ్వనుంది. రెండు విడతలుగా దీనిని అందించనుంది. అటు కంపెనీలకు సైతం ఇన్సెంటీవ్స్ ఇవ్వనుంది. ఉద్యోగాలను సృష్టించడం, తయారీ రంగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్రం ఈ స్కీమ్ తీసుకొచ్చింది.

కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారికి కేంద్రం ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. దీనికి సంబంధించి గతంలోనే నిర్ణయం తీసుకోగా.. అగస్టు 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. అదే పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన స్కీమ్. పీఎఫ్‌లో ఫస్ట్ టైమ్ రిజస్టర్ చేసుకున్న ఉద్యోగులు ఈ స్కీమ్ కింద రూ.15వేలు వరకు అందుకోనున్నారు. ఈ పథకం దేశంలో స్థిరమైన ఉపాధి అవకాశాలను సృష్టించాలనే ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని కేంద్రం తెలిపింది. గతంలో ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ ఈ పథకాన్ని ఆమోదించింది. రూ. 99,446 కోట్ల వ్యయంతో దేశంలో 2ఏళ్లలో 3.5 కోట్లకు పైగా ఉద్యోగాలను సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో 1.92 కోట్ల మంది లబ్ధిదారులు తొలిసారిగా ఉద్యోగ రంగంలోకి ప్రవేశించనున్నారు. ఈ పథకం 2025 ఆగస్టు 01 నుంచి 2027 జూలై 31 వరకు అమల్లో ఉంటుంది.
ఉద్యోగికి రెండు విడతలుగా..
పీఎఫ్‌లో తొలిసారి చేసుకున్న మొదటిసారి ఉద్యోగులకు రెండు విడతలుగా రూ.15వేలను అందజేయనున్నారు. రూ. లక్ష వరకు జీతాలు ఉన్న ఉద్యోగులు దీనికి అర్హులు. 6 నెలల సర్వీస్ తర్వాత తొలి విడత, 12 నెలల సర్వీస్ తర్వాత రెండో విడ డబ్బులు చెల్లిస్తారు. సేవింగ్స్‌ను ప్రోత్సహించడానికి.. ఇందులోని కొంత డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్‌లో వేస్తారు. తరువాత ఉద్యోగి దానిని విత్ డ్రా చేసుకోవచ్చు.
కంపెనీలకు ఇన్సెంటీవ్స్..
కంపెనీలు సైతం ప్రభుత్వం నుంచి ప్రోత్సహకాలను అందుకుంటాయి. కనీసం ఆరు నెలల పాటు పనిచేసిన ఉద్యోగికి కంపెనీ నెలకు రూ. 3000 వరకు ఇన్సెంటివ్‌ను అందుకుంటుంది. అయితే దీనికి సంబంధించి కంపెనీలు కొన్ని రూల్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. కంపెనీలో 50కంటే తక్కువ మంది ఉద్యోగులు ఉంటే కనీసం ఇద్దరినీ ఎక్స్‌ట్రా వర్కర్స్‌గా తీసుకోవాలి. 50 కంటే ఎక్కువ మంది ఉంటే ఐదుగురిని తీసుకోవాలి. అంతేకాకుండా వారికి 6 నెలల పాటు ఉపాధి కల్పించాల్సి ఉంటుంది. కొత్త ఉద్యోగాలను సృష్టించడానికే కంపెనీలను కేంద్రం ప్రోత్సహించనుంది.




