Ambedkar and Modi: అంబేద్కర్‌కు నిజమైన అనుచరుడు మోడీయే.. మాజీ రాష్ట్రపతి కోవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు..

|

Sep 16, 2022 | 8:09 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. బీఆర్ అంబేద్కర్‌కు నిజమైన అనుచరుడని, సంఘ సంస్కర్త దార్శనికతను సాకారం చేసేందుకు ఆయన అనునిత్యం కృషి చేస్తున్నారని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు.

Ambedkar and Modi: అంబేద్కర్‌కు నిజమైన అనుచరుడు మోడీయే.. మాజీ రాష్ట్రపతి కోవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Ram Nath Kovind
Follow us on

Ambedkar and Modi Book: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. బీఆర్ అంబేద్కర్‌కు నిజమైన అనుచరుడని, సంఘ సంస్కర్త దార్శనికతను సాకారం చేసేందుకు ఆయన అనునిత్యం కృషి చేస్తున్నారని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (Ram Nath Kovind) పేర్కొన్నారు. విద్య, కార్మిక సంక్షేమం, మహిళా సాధికారత, స్వావలంబనతో కూడిన దేశాన్ని నిర్మించడం కోసం ప్రధాని మోడీ పాటుపడుతున్నారని కొనియాడారు. జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించి రాజ్యాంగంలోని 370 ఆర్టికల్‌ను రద్దు చేయడం గురించి ప్రస్తావించిన కోవింద్.. మోడీ కూడా అంబేద్కర్ దృష్టితోనే ఆలోచించి చేశారని తెలిపారు. భారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శుక్రవారం ‘అంబేద్కర్ అండ్ మోడీ: రిఫార్మర్స్ ఐడియాస్ పెర్ఫార్మర్స్ ఇంప్లిమెంటేషన్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి కెజి బాలకృష్ణన్, కేంద్ర సమాచార సహాయ మంత్రి ఎల్. మురుగన్, బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ డైరెక్టర్ హితేష్ జైన్ పాల్గొన్నారు.

ఈ పుస్తకాన్ని బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ రూపొందించగా.. దీనికి సంగీత స్వరకర్త, రాజ్యసభ సభ్యుడు ఇళయరాజా ముందుమాట రాశారు. 12 అధ్యాయాలలో మౌలిక సదుపాయాలు, విద్య, సామాజిక-ఆర్థిక చలనశీలత, లింగ సమానత్వం, స్వావలంబన, మరెన్నో విభిన్నమైన అంశాల గురించి దీనిలో ప్రస్తావించారు. ఈ పుస్తకం భారతదేశం గురించి అంబేద్కర్ దృష్టి.. మోడీ అనుసరించిన విధానం, కేంద్ర ప్రభుత్వం సాధించిన అనేక విజయాలను పరిగణనలోకి తీసుకోని ప్రచురించారు. అంతకుముందు ఇక్కడి నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీలో “లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్” అనే అంశంపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను బాలకృష్ణన్ ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి కోవింద్ మాట్లాడుతూ.. ఈ పుస్తకం బాబా సాహెబ్ డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్, ప్రధాని నరేంద్ర మోడీ బహుమితీయ సిద్ధాంతాలు, దేశం కోసం వారు చేసిన కృషి సమాహారమని చెప్పారు. ఇది పారిశ్రామిక అభివృద్ధి, కార్మికుల హక్కులు, స్వావలంబన, విద్యుత్, నీటి వనరుల అభివృద్ధి, ప్రణాళికల వారీగా నగరాల అభివృద్ధి, విద్య, లింగ సమానత్వం వంటి ముఖ్యమైన విషయాలపై సైద్ధాంతిక పునాదని, దృఢమైన సమాచారాన్ని ఈ పుస్తకం అందిస్తుందని కోవింద్ అభివర్ణించారు.

బాబాసాహెబ్, రాజ్యాంగ సభ ముసాయిదా కమిటీ ఛైర్మన్‌గా.. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ప్రతిపాదనను తిరస్కరించారని కోవింద్ గుర్తుచేశారు. తరువాత సంక్లిష్టమైన సంఘటనల తరువాత, జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించారన్నారు. బాబాసాహెబ్ కలలు కన్న దానికి ఇది వ్యతిరేకమని తెలిపారు. అయితే.. మోదీ ప్రభుత్వ కృషితో 2019 ఆగస్టులో జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హోదా రద్దయి, ఈ అసమానత తొలగిపోయిందని కోవింద్ తెలిపారు. ఈ ఉత్తర్వు బాబాసాహెబ్ ఆశయాలను నెరవేరుస్తుందన్నారు. భారత రాష్ట్రపతి హోదాలో ఈ ఉత్తర్వుపై సంతకం చేసే అవకాశం లభించడం తన అదృష్టమని కోవింద్ అన్నారు.

స్వాతంత్య్ర పోరాట సమయంలో దేశం మతతత్వాల ఊబిలో ఉన్నప్పుడు, ప్రజలను మతం కోణంలో చూడకూడదని చాలా మంది నాయకుల నుంచి సూచనలు వచ్చాయని కోవింద్ పేర్కొన్నారు. కానీ, బాబాసాహెబ్ ఆలోచన చాలా ఉన్నత స్థాయిలో ఉందని.. మనం మొదట భారతీయులమని చెప్పారని గుర్తుచేశారు. భారతీయత నిజమైన గుర్తింపు మరియు మతం, కులం, వర్గాలకు స్థానం లేదని కోవింద్ పేర్కొన్నారు. అలానే నరేంద్ర మోడీ కూడా మొదట భారతదేశం గురించి మాట్లాడుతారన్నారు. మోడీ బాబాసాహెబ్ దార్శనికతను సమర్థిస్తూ.. ఆయన బాటలో నడుస్తున్నారని మాజీ రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రధాని మోదీ బాబా అంబేద్కర్‌కు నిజమైన శిష్యుడు అని చెప్పడానికి ఈ పుస్తకమే నిదర్శనమని కోవింద్ అభిప్రాయపడ్డారు.

డాక్టర్ అంబేద్కర్ పేరు మీద ఓట్లు సేకరించి విగ్రహాలు తయారు చేసే పనిని చాలా మంది చేసారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. కానీ ఆయన దార్శనికత అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, ఎవరైనా దానిని అంచెలంచెలుగా అమలు చేస్తున్నారంటే.. అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే అని కొనియాడారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..