AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: శాంతి చర్చల ద్వారానే యుద్ధాన్ని ఆపగలం.. ప్రధాని మోదీ ఉక్రెయిన్‌ పర్యటన హైలెట్స్.. వీడియో

PM Modi Ukraine Visit: ఉక్రెయిన్‌లో ప్రధాని మోదీ పర్యటన చరిత్రాత్మకంగా నిలిచిపోనుంది. ఓవైపు యుద్ధం.. ఇంకోవైపు మోదీ శాంతి సందేశం ఆసక్తికరంగా మారింది. మోదీ ప్రతిపాదనలు తమకు ఓకే అన్నారు జెలెన్‌స్కీ. ఇక ఉక్రెయిన్‌ రాజధానిలో మోదీ బిజీబిజీగా గడిపారు.

PM Modi: శాంతి చర్చల ద్వారానే యుద్ధాన్ని ఆపగలం.. ప్రధాని మోదీ ఉక్రెయిన్‌ పర్యటన హైలెట్స్.. వీడియో
PM Modi Ukraine Visit Highlights
Shaik Madar Saheb
|

Updated on: Aug 24, 2024 | 7:09 AM

Share

PM Modi Ukraine Visit: ఓవైపు భీకర యుద్ధం నడుస్తోంది.. ఇంకోవైపు శాంతి సందేశాన్ని మోసుకెళ్లారు ప్రధాని మోదీ. ఉక్రెయిన్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నా.. భారత ప్రధాని సాహసోపేతమైన పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో చారిత్రక భేటీ జరిగింది. రెండు రోజులు పోలండ్‌లో పర్యటించిన ప్రధాని మోదీ.. అక్కడి నుంచి ఉక్రెయిన్‌ చేరుకున్నారు. ఉక్రెయిన్‌-రష్యా మధ్య నెలకొన్న వివాదాన్ని చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్‌ మరోసారి స్పష్టం చేసింది. ఇరు దేశాలు సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని.. ఇందుకోసం అన్ని విధాలా సహాయం చేసేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. సాధ్యమైనంత త్వరగా శాంతి నెలకొల్పేందుకు అన్ని విధాలుగా సహకరించేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని అధ్యక్షుడు జెలెన్‌స్కీకి మోదీ స్పష్టం చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జులైలో మోదీ జరిపిన చర్చల వివరాలను జెలెన్‌స్కీకి వివరించారన్నారు. జెలెన్‌స్కీతో భేటీలో ఇరు దేశాల మధ్య నాలుగు ఒప్పందాలు కుదిరినట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. పలు అంశాల్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు వాణిజ్యం, ఆర్థిక అంశాలు, రక్షణ రంగం, ఫార్మాస్యూటికల్స్‌, వ్యవసాయం, విద్య అంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారని, ఉక్రెయిన్‌లో యుద్ధానికి సంబంధించే ఎక్కువ మాట్లాడుకున్నారు. ఉక్రెయిన్ పర్యటనకు సంబంధించిన ఓ వీడియోను ప్రధాని మోదీ పంచుకున్నారు.. ఎక్స్ వేదికగా.. ప్రధాని మోదీ హైలెట్స్ కు సంబంధించిన వీడియోను షేర్ చేశారు.. ఈ వీడియోలో.. కీవ్ లో పర్యటన, చర్చలు తదితర దృశ్యాలను పంచుకున్నారు.

మరోవైపు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భారత ప్రధాని మోదీ పర్యటనను ప్రశంసించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఉక్రెయిన్‌కు రావడం సంతోషంగా ఉందన్నారు. ఇది ఓ చారిత్రక పర్యటన అంటు కొనియాడారు. ప్రధాని పర్యటనతో రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయన్నారు జెలెన్‌స్కీ. రెండు దేశాల మధ్య శాంతి కోసం అన్ని ప్రయత్నాలు మోదీ చేస్తున్నారు కాని.. పుతిన్‌ శాంతి కోరుకునే మనిషి కాదన్నారు ఉక్రెయిన్‌ ప్రెసిడెంట్‌. అదే సమయంలో తమ భూభాగాన్ని వదులుకోడానికి కూడా సిద్ధంగా లేమన్నారు. ఇక రష్యాతో శాంతి చర్చలకు భారత్‌ వేదిక అయితే తప్పకుండా అక్కడకు వస్తామని జెలెన్‌స్కీ ప్రకటించారు.

ప్రధాని మోదీ వీడియో..

నిన్న ఉదయం ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి అధికారులు, భారత సంతతి ప్రజలు రైల్వేస్టేషన్‌ దగ్గర ఘన స్వాగతం పలికారు. మువ్వన్నెల జెండాలను ప్రదర్శిస్తూ ప్రధానితో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. రాజధాని కీవ్‌లోని అమరుల స్మారక ప్రాంతానికి చేరుకున్న మోదీకి స్వాగతం పలికిన అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అక్కడి తాజా పరిస్థితులను వివరించారు.

ఈ పర్యటనలో భాగంగా కీవ్‌లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి ప్రధాని మోదీ నివాళి అర్పించారు. బాపూజీ ఆశయాలు విశ్వవ్యాప్తమన్న ఆయన.. కోట్లాది మందికి స్ఫూర్తిదాయకమని చెప్పారు. మానవాళికి మహాత్ముడు చూపించిన బాటలో నడుద్దామని పిలుపునిచ్చారు.

అంతేకాకుండా రష్యా దాడిలో మరణించిన చిన్నారులకు మోదీ నివాళి అర్పించారు. డాక్యుమెంటరీని జెలన్‌స్కీతో కలిసి ప్రధాని మోదీ వీక్షించారు. ఉక్రెయిన్‌ ఎదుర్కొన్న అతిపెద్ద సంక్షోభాల ఆనవాళ్లకు సంబంధించి అక్కడి మ్యూజియంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఇద్దరు నేతలు వీక్షించారు.