PM Modi: ఉగ్రమూకలకు నిద్రలేని రాత్రులు మిగిల్చాం.. ప్రధాని మోదీ
కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు పాక్ ప్రతినిధులుగా మారారని ప్రధాని మోదీ విమర్శించారు. భారత సైన్యం స్థైర్యాన్ని దెబ్బతీసేలా విపక్షం వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. పాక్ మళ్లీ దుస్సాహసం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఆపరేషన్ సింధూర్ ముగిసిపోలేదని.. కొనసాగుతుందని చెప్పారు.

పహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి కేవలం 22 నిమిషాల్లోనే సమాధానం చెప్పామని ప్రధాని మోదీ అన్నారు. సింధూ నుంచి సింధూర్ వరకు పరాక్రమం చూపామని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ త్రివిధ దళాల సమన్వయానికి నిదర్శనమని కొనియాడారు. ఆపరేషన్ సింధూర్‌పై లోక్‌సభలో ప్రధాని మోడీ మాట్లాడారు. గతంలో దాడులు చేసి ఉగ్రవాదులు హాయిగా నిద్రపోయేవారని.. కానీ ఇప్పుడు దాడులు చేయాలంటేనే వణుకుతున్నారని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిన దేశానికి చుక్కలు చూపించామన్న మోదీ.. మరోసారి పాక్ దాడి చేస్తే భారీ మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. భారత్ దెబ్బకు ఇప్పటికీ పాలక్ కోలుకోలేకపోతుందని.. దాన్ని ఎయిర్ బేస్‌లు ఇంకా ఐసీయూలోనే ఉన్నాయని ఎద్దేవా చేశారు. మేకిన్ ఇండియా డ్రోన్లు పాక్ మిస్సైల్స్‌ని కూల్చేశాయని.. భారత శక్తి ఏంటో ప్రపంచానికి తెలిసిందని అన్నారు.
సైన్వానికి పూర్తి స్వేచ్చ ఇచ్చామంటూ రాహుల్ గాంధీకి మోదీ కౌంటర్ ఇచ్చారు. భారత శక్తిని ప్రపంచ దేశాలు గుర్తిస్తే.. కాంగ్రెస్ విమర్శిస్తుందని ఆరోపించారు. హెడ్ లైన్స్‌లో రావడానికి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. భారత సైన్యం స్థైర్యాన్ని దెబ్బతీసేలా విపక్షం వ్యవహరిస్తోందని.. స్వార్థ రాజకీయాల కోసం సైన్యాన్ని తక్కువ చేశారని తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. పహల్గాం దాడి తర్వాత మూడు రోజులకే కాంగ్రెస్ రాజకీయం మొదలుపెట్టిందని ఆరోపించారు. 193 దేశాల్లో 3 దేశాలు మాత్రమే పాక్‌ను సమర్ధించాయని చెప్పారు. అణు బాంబు బెదిరింపులకు భారత్ లొంగదని నిరూపించామన్నారు. ఆపరేషన్ సింధూర్‌తో మాస్టర్ మైండ్లకు నిద్ర కరువైందని.. ఏ క్షణాన భారత్ దాడులు చేస్తుందోనని గజగజ వణికిపోయారన్నారు. చివరకు డీజీఎంవోల మీటింగ్‌లో యుద్ధం ఆపాలంటూ పాక్ ప్రాధేయపడిందని చెప్పారు. కాంగ్రెస్ దాన్ని మిత్రపక్షాలు పాక్ అధికార ప్రతినిధులుగా మారాయి
ఏ దేశాధినేత యుద్ధం ఆపాలని భారత్‌కు చెప్పలేదని మోదీ స్పష్టం చేశారు. ‘‘మే 9న అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఫోన్ చేశారు. కానీ నేను మిలటరీ అధికారులతో మీటింగ్‌లో ఉండడంతో మాట్లాడలేకపోయాను. జేడీ వాన్స్ చాలా సార్లు ఫోన్ చేశారు. పాక్ దాడి చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వాన్స్‌తో చెప్పాను. ఆపరేషన్ సింధూర్ ముగిసిపోలేదు.. కొనసాగుతుంది. ఆపరేషన్ సింధూర్‌తో పాక్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టాం. స్వాలంబనతో దేశం ముందుకు సాగుతుంది’’ అని మోదీ అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ..




