PM Modi: బ్రిటన్‌ పీఎం రిషి సునాక్ కు ప్రధాని మోడీ ఫోన్.. ఆ అంశాలపైనే ప్రధాన చర్చ

ఇటీవల లండన్‌లోని భారత రాయబార కార్యాలయంపై ఖలిస్తాన్‌ ఏర్పాటువాదులు దాడి చేసిన అంశాన్ని మోడీ ప్రస్తావించారు. ఈ దాడిని సునాక్‌ ఖండించారని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగవంటూ భద్రత విషయంలో హామీ ఇచ్చారని పీఎంవో ఒక ప్రకటన విడుదల చేసింది. ఇండియా- యూకే రోడ్‌మ్యాప్- 2030లో భాగంగా రెండు దేశాల మధ్య..

PM Modi: బ్రిటన్‌ పీఎం రిషి సునాక్ కు ప్రధాని మోడీ ఫోన్.. ఆ అంశాలపైనే ప్రధాన చర్చ
Pm Modi, Rishi Sunak

Updated on: Apr 14, 2023 | 6:38 AM

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా యూకేలోని భారత దౌత్య కార్యాలయాల భద్రత గురించి ప్రధాని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌ వ్యతిరేక శక్తుల విషయంలో గట్టి చర్యలు తీసుకోవాలని బ్రిటన్‌ ప్రధానిని కోరారు. అలాగే ఆర్థిక నేరాలకు పాల్పడి బ్రిటన్లో ఉంటున్నవారిని మన దేశానికి అప్పగించే విషయంలో పురోగతిపై ఆరా తీశారు. ఇటీవల లండన్‌లోని భారత రాయబార కార్యాలయంపై ఖలిస్తాన్‌ ఏర్పాటువాదులు దాడి చేసిన అంశాన్ని మోడీ ప్రస్తావించారు. ఈ దాడిని సునాక్‌ ఖండించారని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగవంటూ భద్రత విషయంలో హామీ ఇచ్చారని పీఎంవో ఒక ప్రకటన విడుదల చేసింది. ఇండియా- యూకే రోడ్‌మ్యాప్- 2030లో భాగంగా రెండు దేశాల మధ్య వాణిజ్యం సహా ద్వైపాక్షిక సంబంధాలను ప్రధానులిద్దరూ సమీక్షించారు పరస్పర ప్రయోజనదాయకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని సత్వరం కుదుర్చుకోవాల్సిన అవసరం ఉందని మోడీ, సునాక్‌ అభిప్రాయపడ్డారు. ఇదే సందర్భంగా సెప్టెంబరులో డిల్లీలో జరిగే జి-20 సదస్సుకు హాజరుకావాల్సిందిగా సునాక్‌ను మోడీ ఆహ్వానించారు.

కాగా గత నెలలో లండన్‌ లోని భారత హై కమిషన్‌ కార్యాలయంపై ఖలిస్థాన్‌ వేర్పాటు వాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. సెక్యురిటీని ఛేదించుకుని కార్యాలయంలోకి దూసుకెళ్లిన వారు విధ్వంసం సృష్టించారు. హైకమిషన్ కార్యాలయాన్ని ధ్వంసం చేయడంతో పాటు కార్యాలయ భవనంపై ఎగురుతున్న మువ్వన్నెల జెండాను కిందికి దించి.. తమ ఖలిస్తాన్ వేర్పాటు జెండాను ఎగురవేసేందుకు ప్రయత్నించారు. దీనిపై సర్వత్రా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ఇదే అంశాన్ని మోడీ ప్రస్తావించారు. అలాగే బ్రిటన్‌లో నివాసముంటోన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా, వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీలను తమకు అప్పగించాలని భారత్‌ ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో పురోగతేంటో సునాక్‌ను అడిగి తెలుసుకున్నారు మోడీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.