PM Modi: నేను వచ్చింది మీ ఆశీస్సుల కోసమే.. నారీ శక్తి వందన సమ్మేళనంలో ప్రధాని మోదీ కీలక కామెంట్స్..
నేను ఇక్కడ ఉపదేశం ఇవ్వడానికి రాలేదు.. కేవలం ఈ దేశ మహిళల ఆశీస్సులు కోరడానికే వచ్చానంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ వేదికగా నారీ శక్తికి నీరాజనం పలికారు. దశాబ్దాల కాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ల కల సాకారం కాబోతోందని, ఏప్రిల్ 16న పార్లమెంట్ ఒక నూతన చరిత్రను సృష్టించబోతోందని ఆయన అన్నారు.

దేశ రాజకీయాల్లో నూతన శకం ఆరంభం కాబోతోంది. దశాబ్దాల కాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ల కల సాకారం అయ్యే సమయం ఆసన్నమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలో జరిగిన నారీ శక్తి వందన సమ్మేళనంలో పాల్గొన్న ఆయన, మహిళా సాధికారతపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో మహిళల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఏప్రిల్ 16న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రత్యేక భేటీ జరగనుందని ప్రధాని వెల్లడించారు. ‘‘నేను ఇక్కడ ఉపదేశం ఇవ్వడానికి రాలేదు.. కేవలం దేశంలోని కోట్లాది మంది తల్లులు, సోదరీమణుల ఆశీస్సులు కోరడానికే వచ్చాను’’ అంటూ మోదీ భావోద్వేగంగా ప్రసంగించారు. 21వ శతాబ్దపు అతిపెద్ద నిర్ణయాలలో ఒకటిగా ఈ ఘట్టం నిలిచిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
దశాబ్దాల నిరీక్షణకు తెర.. 2029 లక్ష్యంగా
మహిళా రిజర్వేషన్‌పై గత నాలుగు దశాబ్దాలుగా చర్చలు జరుగుతున్నాయని, వాటన్నింటికీ ముగింపు పలికే సమయం వచ్చిందని మోదీ అన్నారు. 2023లో కొత్త పార్లమెంటు భవనంలో ప్రవేశపెట్టిన నారీ శక్తి వందన్ చట్టంకు అన్ని పక్షాలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపాయని గుర్తు చేశారు. ముఖ్యంగా ప్రతిపక్షాలు కూడా పట్టుబట్టినట్లుగానే, ఈ చట్టాన్ని 2029 నాటికి పూర్తిస్థాయిలో అమలు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉందని స్పష్టం చేశారు.
మహిళలకు 32 కోట్ల బ్యాంక్ ఖాతాలు
గత పదేళ్లలో మహిళా అభివృద్ధి కోసం చేపట్టిన విప్లవాత్మక మార్పులను ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జన్ ధన్ యోజన ద్వారా గతంలో బ్యాంక్ గడప తొక్కని సుమారు 32 కోట్ల మంది మహిళలకు కొత్తగా ఖాతాలు తెరిపించినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో 14 లక్షల మందికి పైగా మహిళలు నాయకత్వ బాధ్యతలు చేపట్టారని, సుమారు 21 రాష్ట్రాల్లో పంచాయతీలలో మహిళల భాగస్వామ్యం 50 శాతానికి చేరుకుందని ఆయన గర్వంగా ప్రకటించారు.
అభివృద్ధి చెందిన భారత్.. మహిళల తోడ్పాటుతోనే
నిర్ణయాధికారంలో మహిళల భాగస్వామ్యం పెరగడం వల్ల వ్యవస్థలో సున్నితత్వం పెరిగిందని పలు అధ్యయనాలు చెబుతున్నాయని మోదీ అన్నారు. ‘‘మహిళలు దేశానికి గర్వకారణం. వారి కలలకు రెక్కలు వచ్చినప్పుడే వికసిత్ భారత్ అనే తీర్మానం నెరవేరుతుంది” అని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
