భద్రతా దళాలు భారీ ఆపరేషన్.. 21 బంకర్లు ధ్వంసం, 13 ఐఈడీలు స్వాధీనం..!
మణిపూర్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా దళాలు భారీ ఆపరేషన్ నిర్వహించాయి. శనివారం (ఏప్రిల్ 11, 2026) నాడు రాష్ట్రంలోని ఉఖ్రుల్, టెంగ్నౌపాల్ జిల్లాల్లో జరిపిన దాడుల్లో తిరుగుబాటుదారుల స్థావరాలను స్వాధీనం చేసుకున్నారు. ఉఖ్రుల్ జిల్లాలోని సికిబుంగ్, మోంగ్‌కోట్ చెపు గ్రామాల్లో సాయుధ తిరుగుబాటుదారులు అక్రమంగా నిర్మించిన 21 బంకర్లను భద్రతా దళాలు ధ్వంసం చేశాయి.

మణిపూర్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా దళాలు భారీ ఆపరేషన్ నిర్వహించాయి. శనివారం (ఏప్రిల్ 11, 2026) నాడు రాష్ట్రంలోని ఉఖ్రుల్, టెంగ్నౌపాల్ జిల్లాల్లో జరిపిన దాడుల్లో తిరుగుబాటుదారుల స్థావరాలను స్వాధీనం చేసుకున్నారు. ఉఖ్రుల్ జిల్లాలోని సికిబుంగ్, మోంగ్‌కోట్ చెపు గ్రామాల్లో సాయుధ తిరుగుబాటుదారులు అక్రమంగా నిర్మించిన 21 బంకర్లను భద్రతా దళాలు ధ్వంసం చేశాయి. లిటాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ తనిఖీల్లో సికిబుంగ్‌లో 14, మోంగ్‌కోట్ చెపులో 7 బంకర్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ బంకర్లన్నీ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే లక్ష్యంతో నిర్మించినవేనని అధికారులు వెల్లడించారు.
మరోవైపు, టెంగ్నౌపాల్ జిల్లాలోని మోరే ప్రాంతంలో నిర్వహించిన సోదాల్లో భారీగా మందుగుండు సామగ్రి బయటపడింది. భద్రతా దళాలు అక్కడ 13 ఐఈడీలను (IEDs)స్వాధీనం చేసుకుని, వాటిని అక్కడికక్కడే నిర్వీర్యం చేశాయి. వీటితో పాటు ఒక 9ఎంఎం పిస్టల్ మ్యాగజైన్ ఇతర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల మోంగ్‌కోట్ చేపు గ్రామం సమీపంలో గుర్తు తెలియని దుండగుల కాల్పుల్లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీఎస్ఎఫ్ జవాన్ ప్రాణాలు కోల్పోయాడు. గ్రామం సమీపంలో విధి నిర్వహణలో ఉన్న ఆ సైనికుడిపై గుర్తు తెలియని దిశ నుండి వచ్చిన తూటా దూసుకురావడంతో ఈ ఘటన జరిగింది. ఈ నేపథ్యంలో ఈ గాలింపు చర్యలు తీవ్రతరమయ్యాయి.
ఇదిలావుంటే, మణిపూర్ రాష్ట్రంలో పరిస్థితులు ఇంకా ఆందోళనకరంగానే ఉన్నాయి. ఏప్రిల్ 7న బిష్ణుపూర్ జిల్లా ట్రోంగ్లావోబిలో అనుమానిత ఉగ్రవాదులు ఒక ఇంటిపై బాంబు దాడి చేయడంతో ఐదేళ్ల బాలుడు, ఆరు నెలల పసికందు మరణించడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై ఆగ్రహించిన సుమారు 500 మంది నిరసనకారులు సీఆర్పీఎఫ్ శిబిరంపై దాడి చేసి వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు నిరసనకారులు ప్రాణాలు కోల్పోగా, 30 మంది గాయపడ్డారు. ప్రస్తుతం ఈ కేసులో యునైటెడ్ కుకీ నేషనల్ ఆర్మీకి చెందిన ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాంబు దాడిలో వీరి ప్రమేయంపై లోతైన విచారణ జరుగుతోంది. శాంతిని పునరుద్ధరించేందుకు సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా బలగాలు నిరంతరం నిఘా పెంచారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
