Telangana: నిమిషాల్లోనే 130 రకాల వైద్య పరీక్షలు.. సెకన్లలోనే వాట్సప్‌కు రిపోర్ట్స్.. హెల్త్ ఏటీఎంలు వచ్చేశాయ్..
ప్రభుత్వ దవాఖానాల్లో వైద్య సేవలను మెరుగుపర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హెల్త్ ఏటీఎంలను త్వరలో అన్ని ఆస్పత్రుల్లో అందుబాటులోకి తీసుకురానుంది. దీని ద్వారా నిమిషాల వ్యవధిలోనే 130 రకాల టెస్టులు చేసుకోవచ్చు. ఇప్పటికే కొన్ని ఆస్పత్రుల్లో వీటిని ప్రవేశపెట్టారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు మెరుగైన సేవలు అందించేందుకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో హెల్త్ ఏటీఎంలను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ అత్యాధునిక పరికరాలు కేవలం నిమిషాల వ్యవధిలోనే 130 రకాల టెస్టులు ఆటోమేటిక్‌గా నిర్వహిస్తాయి. అనంతరం వాట్సప్‌కు లేదా ఎస్‌ఎంఎస్ రూపంలో మొబైల్‌కు టెస్టుల రిపోర్టులు వచ్చేస్తాయి. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాన్యువల్ విధానంలో టెస్టులు చేయాలంటే గంటల కొద్ది సమయం పడుతుంది. దీంతో రోగుల వెయిట్ చేయాల్సి వస్తుంది. దీని వల్ల రోగ నిర్ధారణకు ఎక్కువ సమయం పడుతుంది. దీనిని తగ్గించి రోగులకు సత్వర చికిత్స అందించేందుకు ప్రభుత్వం సాంకేతికతతో కూడిన హెల్త్ ఏటీఎంలను తీసుకొచ్చింది.
నిమిషాల్లోనే 130 రకాల పరీక్షలు
తొలుత కింగ్ కోఠి, మలక్ పేట ప్రభుత్వ ఆస్పత్రుల్లో పైలట్ ప్రాజెక్ట్ విధానంతో ఈ హెల్త్ ఏటీఎంలను ప్రభుత్వం ప్రారంభించింది. వీటి ద్వారా వచ్చే ఫలితాలను టీ డయాగ్నోస్టిక్ కేంద్రాల్లో కూడా పరీక్షించారు. దీంతో హెల్త్ ఏటీఎంల ద్వారా వచ్చిన రిజల్ట్స్.. టీ డయాగ్నోస్టిక్ సెంటర్లలో వచ్చిన ఫలితాలు ఒకేలా ఉన్నాయి. ఇక ప్రైవేట్ ల్యాబుల్లో కూడా వీటిని పరిశీలించారు. అన్నీచోట్ల ఒకేలా ఫలితాలు వచ్చాయి. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడంతో రోగుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రభుత్వ ఆస్పత్రుల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు వైద్యఆరోగ్యశాఖ సిద్దమవుతోంది. దీంతో వేలల్లో ఖర్చు అయ్యే టెస్టులు ఉచితంగా పొందటమే కాకుండా వేగంగా సేవలు పొందవచ్చు.
డిజిటల్ రూపంలో టెస్టులు
ఈసీజీ, బీపీ, బాడీ మాస్ ఇండెక్స్, ఆక్సిజన్ లెవల్స్, బాడీ టెంపరేచర్, గ్లూకోజ్, హిమోగ్లోబిన్ లెవల్స్, లివర్, కిడ్నీ ఫంక్షన్, థైరాయిడ్, లిపిడ్ ప్రొఫైల్ వంటి టెస్టులు నిమిషాల్లోనే ఈ మెషీన్ల ద్వారా కంప్లీట్ అవుతాయి. ఇక గర్బిణులకు ఫీటల్ డాప్లర్ టెస్టులు, చర్మ వ్యాధులకు డెర్మాస్కోప్ వంటి ఫీచర్లు కూడా ఈ మెషీన్లలో ఉన్నాయి. ఈ మెషీన్ల ద్వారా వచ్చే రోగుల హెల్త్ రిపోర్టులను ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్‌తో అనుసంధానిస్తారు. దీంతో రోగికి సంబంధించి ప్రతీ రిపోర్ట్ డిజిటల్ రూపంలో వైద్యులకు అందుబాటులో ఉంటుంది. దీని వల్ల వైద్యులకు రోగుల హిస్టరీ అందుబాటులో ఉంటుంది. దీంతో వేగంగా ట్రీట్ మెంట్ చేయవచ్చు. కాగా ఈ యంత్రాలను ఉపయోగించుకునేలా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించేందుకు కొంతమంది సిబ్బందిని అధికారులు అందుబాటులో ఉంచనున్నారు. వీళ్లు రోగులకు సహాయం అందిస్తారు. రాబోయే రోజుల్లో అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వీటిని ప్రవేశపెట్టనున్నారు.
