RBI: కరెన్సీ నోట్లపై దేవతల చిత్రాలు సాధ్యమేనా..? రిజర్వు బ్యాంకు నిబంధనలు ఏం చెబుతున్నాయి..?
దేశంలో అమలులో ఉన్న కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ ఫోటోతో పాటు ఇతర ఫోటోలు ముద్రించాలనే డిమాండ్ పై రిజర్వు బ్యాంకు ఇండియా 2010లోనే స్పష్టత ఇచ్చింది. దేశంలోని పలువురు ప్రముఖుల చిత్రాలు, నోబెల్ బహుమతి గ్రహీతల ఫోటోలు కరెన్సీ నోట్లపై ముద్రించే విషయమై పూణేకు చెందిన వ్యాపారవేత్త..
కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీతో పాటు హిందూ దేవతలైన లక్ష్మిదేవి, గణేష్ ఫోటోలను ముద్రించాలంటూ ఓ కొత్త డిమాండ్ ను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెరపైకి తీసుకొచ్చారు. ఈ డిమాండ్ పై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలతో పాటు, ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు ఈ ఏడాది చివరిలో జరగనున్నాయి. ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ తో పాటు తన పార్టీ ఎమ్మెల్యేలు చేసిన కొన్ని వివాదస్పద వ్యాఖ్యల కారణంగా వారు హిందువులకు వ్యతిరేకమనే ప్రచారాన్ని బీజేపీ విస్తృతం చేసింది. దీంతో ఆ విమర్శ నుంచి బయటపడేందుకు కేజ్రీవాల్ కరెన్సీ నోట్లపై హిందూ దేవతల ఫోటోలు ముద్రించాలనే డిమాండ్ తీసుకువచ్చినట్లు కొంతమంది రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ఇది సాధ్యం కాదని తెలిసే అరవింద్ కేజ్రీవాల్ అవసరం లేని ఓ విషయాన్ని తెరపైకి తీసుకువచ్చారనే వాదన మరోవైపు వినిపిస్తోంది. ఈ డిమాండ్ ను బీజేపీ వ్యతిరేకించకపోయినా, హిందూ వ్యతిరేకి అయిన అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ స్వార్థం కోసం ఈ వ్యాఖ్యలు చేశారంటున్నారు. వాస్తవానికి కరెన్సీ నోట్లపై దేశానికి చెందిన పలువురు ప్రముఖుల చిత్రాలు కూడా ముద్రించాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. ఈ నేపథ్యంలో రిజర్వు బ్యాంక్ ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదిక ప్రకారం మహాత్మా గాంధీ చిత్రాన్ని మాత్రమే కర్సెనీ నోట్లపై ముద్రించాలని నిర్ణయం తీసుకుని.. దానినే ఆర్బీఐ పాటిస్తూ వస్తోంది. కరెన్సీ నోట్లపై లక్ష్మిదేవి, గణేశుడి చిత్రాలు ముద్రించాలనే డిమాండ్ తెరపైకి వచ్చిన క్రమంలో రిజర్వు బ్యాంకు నిబంధనలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం.
ఆర్బీఐ ఉన్నత స్థాయి ప్యానెల్ ఏం చెప్పింది..
దేశంలో అమలులో ఉన్న కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ ఫోటోతో పాటు ఇతర ఫోటోలు ముద్రించాలనే డిమాండ్ పై రిజర్వు బ్యాంకు ఇండియా 2010లోనే స్పష్టత ఇచ్చింది. దేశంలోని పలువురు ప్రముఖుల చిత్రాలు, నోబెల్ బహుమతి గ్రహీతల ఫోటోలు కరెన్సీ నోట్లపై ముద్రించే విషయమై పూణేకు చెందిన వ్యాపారవేత్త ప్రఫుల్ సర్ధా సమాచార హక్కు చట్టం ప్రకారం చేసిన దరఖాస్తుకు 2019లో ఆర్థిక వ్యవహారాల అదనపు కార్యదర్శి మనీషా సిన్హా ప్రఫుల్ సర్దాకు సమాధానం ఇచ్చారు. ఇండియన్ కరెన్సీ నోట్ (ఐసిఎన్) రూపకల్పనలో ఇతర ప్రముఖులు, భారతరత్న, నోబెల్ బహుమతి గ్రహీతలు, స్వాతంత్ర్య సమరయోధులు లేదా ప్రముఖ క్రీడాకారుల ఫోటోలను చేర్చాల్సిన అంశం గురించి 2010లో భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి ప్యానెల్ సుదీర్ఘంగా చర్చించిందని కేంద్ర ఆర్థిక శాఖ గతంలోనే తెలిపింది. 2010లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సలహా మేరకు హై-లెవల్ స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటైందని, ఆ కమిటీ సుదీర్థంగా చర్చించిన తర్వాత మహాత్మాగాంధీ కంటే మరే వ్యక్తి భారతదేశం యొక్క తత్వాన్ని మెరుగ్గా సూచించలేదని భావించింది. దీంతో మహాత్మాగాంధీ చిత్రాన్ని నోట్లకు ఎదురుగా, వాటర్‌మార్క్‌పై ఉంచాలని నిర్ణయించారు. ఈ సిఫార్సును అప్పటి భారత ప్రభుత్వం ఆమోదించిందని సమాచార హక్కు చట్టం ద్వారా దాఖలైన దరఖాస్తుకు 2019లో ఆర్థిక శాఖ ఇచ్చిన సమాధానంలో పేర్కొంది. ఢిల్లీ సీఏం అరవింద్ కేజ్రీవాల్ కొత్త డిమాండ్ తెరపైకి వచ్చిన సందర్భంలో వ్యాపారవేత్త ప్రఫుల్ సర్ధా స్పందిస్తూ.. ఇండియన్ కరెన్సీ నోట్లపై భారత రత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లేదా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫోటోలను ముద్రించడాన్ని పరిశీలించాలని తాను ప్రధానమంత్రి కార్యాలయాన్ని కోరారని, ఈ విషయమైన ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చిన తర్వాత ఈ విషయంపై చర్చ ముగిసిందన్నారు. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కొత్త డిమాండ్ ను ప్రతిపాదించడం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నట్లు స్పష్టమవుతున్నాయని ప్రఫుల్ సర్ధా తెలిపారు.
గతంలో పార్లమెంటులోనూ ప్రస్తావన..
తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ కూడా కరెన్సీ నోట్లపై ఇతర ప్రముఖుల ఫోటోలను చేర్చు అంశాన్ని గతంలో పార్లమెంటులో లేవనెత్తగా, అప్పటి ఆర్థిక శాఖ మంత్రి దివంగత అరుణ్ జైట్లీ సమాధానమిస్తూ ఆర్బీఐ ఉన్నత స్థాయి ప్యానెల్ కమిటీ నివేదిక గురించి తెలియజేశారు. దీంతో ఈ డిమాండ్ పెద్దగా ప్రచారంలో లేకుండాపోయింది. తిరిగి అరవింద్ కేజ్రీవాల్ కరెన్సీ నోట్లపై లక్ష్మిదేవి, గణుశుడి ఫోటోలు ముద్రించాలనే డిమాండ్ ను తెరపైకి తీసుకువస్తూ.. హిందువులు తక్కువుగా ఉన్న ఇండోనూషియాలో కరెన్సీ నోట్లపై గణేశుడి ఫోటో ముద్రిస్తుండగా, భారత్ లో ఎందుకు ముద్రించ కూడదని కూడా కేజ్రీవాల్ ప్రశ్నించారు. అయితే ఢిల్లీ సీఏం కేజ్రీవాల్ కొత్త డిమాండ్ పై కాంగ్రెస్ నాయకులు ఫైర్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర యూనిట్ అధికార ప్రతినిధి అతుల్ లోంధే స్పందిస్తూ ‘ఐఐటీ గ్రాడ్యుయేట్’ ఢిల్లీ సిఎం సోది చెప్పే వ్యక్తిలా తయారయ్యారంటూ విమర్శించారు. దేశ ఆర్థిక సంక్షోభాలను పరిష్కరించేందుకు ఇలాంటి అర్థరహితమైన ఆలోచనలు చేసే బదులు ఆయన తాను ఇప్పటివరకు నెరవేర్చని వాగ్దానాల గురించి లేదా గత ఎనిమిదేళ్లలో బిజెపి ప్రభుత్వ వైఫల్యాల గురించి ఎందుకు మాట్లాడరని లోంధే ప్రశ్నించారు.
మరో కాంగ్రెస్ నేత సచిన్ సావంత్ కూడా కేజ్రీవాల్ ప్రతిపాదనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ సీఏం చెప్పిందే జరిగితే దేవీ దేవతల చిత్రాలతో కూడిన కరెన్సీ నోట్లు బార్‌లు, కబేళాలు, చేపల మార్కెట్లు లేదా మాంసాహార దుకాణాలు, రెస్టారెంట్లలో చెలామణి అవుతాయని, అప్పుడు మీరు ఏమి సమాధానం చెప్తారని ప్రశ్నించారు. శివసేన అధికార ప్రతినిధి కిషోర్ తివారీ మాట్లాడుతూ అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదనకు బిజెపి అభ్యంతరం చెప్పకపోవచ్చని, అయితే ఈ చర్య దేశంలోని ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆర్థిక గందరగోళం వంటి అన్ని రుగ్మతలను పరిష్కరిస్తుందనే గ్యారెంటీ ఏమిటని క్వశ్చన్ చేశారు.
మొత్తం మీద కరెన్సీ నోట్లపై లక్ష్మిదేవి, గణేశుడి ఫోటోలు ముద్రించాలనే కేజ్రీవాల్ డిమాండ్ పై ఇతర పార్టీలు మాత్రం ఘాటుగా స్పందిస్తున్నాయి. రాజకీయ స్వప్రయోజనాల కోసమే ఇలాంటి డిమాండ్ ను తెరపైకి తీసుకువచ్చి ప్రజల మైండ్ సెట్ ను డైవర్ట్ చేయాలనుకుంటున్నారనే విమర్శలు పలు పార్టీల నాయకుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..