Health ATM: హెల్త్ ఏటీఏంలు వచ్చేశాయి.. నిమిషాల వ్యవధిలో ఎన్నో వ్యాధులకు చెకప్..
మథుర జిల్లా ఆసుపత్రిలో ఈ హెల్త్ ఏటీఏం సేవలు ప్రారంభమయ్యాయి. ఆరోగ్య పరీక్షలు చేసే ఈ యంత్రం ద్వారా కేవలం 15 నిమిషాల్లోనే 23 వ్యాధులకు వైద్య పరీక్షలను చేసి రిపోర్టును ఇస్తుందని వైద్యులు తెలిపారు. ఓ వ్యక్తిలో రోగాలను నిర్థారించడమే కాకుండా రోగులకు తక్షణ చికిత్సకు..
సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. పెరుగుతున్న టెక్నాలజీని ఉపయోగించి అనేక సమస్యలకు పరిష్కారాలు కనుగొనగలుగుతున్నాం. విద్య, వైద్య రంగంలో గతంతో పోలిస్తే ఎన్నో మార్పులు వచ్చాయి. ఆసుపత్రుల్లో అయితే గతంలో రోగ నిర్థారణ కోసం చేయించుకునే వైద్య పరీక్షల నివేదికలు రావాలంటే రోజుల సమయం పట్టేది. ఇటీవల కాలంలో టెక్నాలజీ పెరగడంతో ఆ సమస్య కొంతమేర తగ్గింది. అయినా ఏ ఆసుపత్రిలో చూసినా పెద్ద పెద్ద క్యూలైన్లు కనబడుతూనే ఉంటున్నాయి. వైద్యుడు పరీక్ష చేయడం ఒకటైతే.. రోగ నిర్థారణ కోసం వైద్య నిపుణులు రాసిన పరీక్షలు చేయించుకోవడానికి కూడా పెద్ద పెద్ద క్యూలు కనిపిస్తాయి. ఆసుపత్రులే కాకుండా పేరొందిన డయాగ్నోస్టిక్ సెంటర్లలో కూడా క్యూలైన్లు కనిపిస్తాయి. వైద్య పరీక్షల రిపోర్టు రావడం కూడా చాలా సందర్భాల్లో ఆలస్యం అవుతూ ఉంటాయి. డాక్టర్ వెళ్లిపోతారు త్వరగా రిపోర్టులు ఇవ్వండని కూడా అడుగుతూ ఉంటారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అయితే పెద్ద ఆసుపత్రులు మినహా మిగిలిన చోట్ల అన్ని రకాల పరీక్షలు చేయడానికి సరైన సదుపాయాలు ఉండవు. అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ సౌకర్యాలను మెరుగుపరుస్తున్నారు. ప్రయివేటు ఆసుపత్రులకు ధీటుగా సర్కారీ దావాఖానాలను తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనేక సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. పేద, మధ్య తరగతి ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించడమే తమ లక్ష్యమని పలు సార్లు ప్రకటించారు. పెరుగుతున్న టెక్నాలజీని ఉపయోగించి వైద్య రంగంలో మరిన్ని మార్పులు రావల్సిన విషయాన్ని గతంలోనే చెప్పారు. దీనిలో భాగంగా ప్రస్తుతం ఉత్తరప్రదేశ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఏంలను ఏర్పాటు చేస్తోంది.
ప్రస్తుతం మథుర జిల్లా ఆసుపత్రిలో ఈ హెల్త్ ఏటీఏం సేవలు ప్రారంభమయ్యాయి. ఆరోగ్య పరీక్షలు చేసే ఈ యంత్రం ద్వారా కేవలం 15 నిమిషాల్లోనే 23 వ్యాధులకు వైద్య పరీక్షలను చేసి రిపోర్టును ఇస్తుందని వైద్యులు తెలిపారు. ఓ వ్యక్తిలో రోగాలను నిర్థారించడమే కాకుండా రోగులకు తక్షణ చికిత్సకు మార్గం సుగమం చేస్తుందని మథుర ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ (సిఎంఎస్) డాక్టర్ ముకుంద్ బన్సాల్ తెలిపారు.
వైద్య పరీక్షలు విడివిడిగా చేయడం ద్వారా ఎంతో సమయం పడుతుందని, అదే 23 రకాల పరీక్షలను ఒకే యంత్రం ద్వారా చేయడంతో ఎంతో సమయం ఆదా అవుతుందని వైద్యులు పేర్కొన్నారు. హెమోగ్లోబిన్, బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెజర్, శరీర ఉష్ణోగ్రత, ఊబకాయం, ఆక్సిజన్ స్థాయి, శరీర బరువు, బాడీ ఇండెక్స్ తదితర అంశాలను ఈ ఆరోగ్య ఏటీఎం పరిశీలిస్తుందని వైద్యులు తెలిపారు. ఎలక్ట్రో కార్డియోగ్రామ్ (ఈసీజీ)ని కూడా ఈ యంత్రం ద్వారా పొందే వెసులుబాటు ఉందని వైద్య నిపుణులు తెలిపారు. ఏటీఏంను పోలి ఉండే ఈ యంత్రం ఒక రోగికి సంబంధించి రక్త నమూనాలను అందజేస్తే ఆ వ్యక్తికి సంబంధించిన వ్యాధి స్థితి నివేదికను అందజేస్తుందని చెబుతున్నారు వైద్యులు. దీపావళి పండుగ సందర్భంగా మథుర ఆసుపత్రిల్లో ఈ ఆరోగ్య ఏటీఏం సేవలు ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతి జిల్లా ఆసుపత్రిలో ఇటువంటి యంత్రాలను త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..