రాత్రి పూట భారత్ – పాకిస్థాన్ సరిహద్దు పొదల్లో అలికిడి..! ఏంటా అని BSF జవాన్లు వెళ్లి చూడగా..
గురుదాస్‌పూర్ జిల్లాలోని సరిహద్దులో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) జవాన్లు పాకిస్తాన్ పౌరుడిని అక్రమంగా ప్రవేశించినట్లు పట్టుకున్నారు. హుస్నైన్ అనే ఆ వ్యక్తి గుజ్రాన్‌వాలాకు చెందినవాడు. మే 3వ తేదీ రాత్రి సరిహద్దుకు 250 మీటర్ల దూరంలో అతడిని పట్టుకున్నారు. అతని వద్ద పాకిస్తాన్ జాతీయ గుర్తింపు కార్డు లభించింది.

శనివారం రాత్రి సమయంలో పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించినట్లు గుర్తించిన ఒక పాకిస్తాన్ పౌరుడిని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లు పట్టుకున్నారు. పాకిస్తాన్‌లోని గుజ్రాన్‌వాలా జిల్లా నివాసి, ముహమ్మద్ అజ్మల్ కుమారుడు హుస్నైన్‌గా అతని వద్ద లభించిన గుర్తింపు కార్డు ఆధారంగా వివరాలు గుర్తించారు. చొరబాటుదారుడిని భారత భూభాగంలోకి దాదాపు 250 మీటర్ల దూరంలో ఫాల్కు నాలా సమీపంలో బోర్డర్ పిల్లర్ నంబర్ 63/M అలైన్‌మెంట్‌లోని బోర్డర్ సెక్యూరిటీ కంచెకు ముందు పట్టుకున్నారు. ఈ ప్రదేశం BOP దరియా మన్సూర్ పక్కన ఉన్న BSF సహపూర్ ఫార్వర్డ్ బోర్డర్ అవుట్‌పోస్ట్ (BOP) నిఘా జోన్ కిందకు వస్తుంది.
మే 3వ తేదీ రాత్రి 11:10 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. PTZ కంట్రోల్ రూమ్‌లోని HIT పాయింట్ నంబర్ 01 వద్ద ఉన్న CT సందీప్ ఘోష్ ఆ ప్రాంతంలో అనుమానాస్పద కదలికలను గమనించాడు. అతను వెంటనే కంపెనీ కమాండర్‌కు సమాచారం అందించాడు. తర్వాత ఇన్‌స్పెక్టర్ తో పాటు క్విక్ రియాక్షన్ టీం సంఘటనా స్థలానికి చేరుకుంది. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి రాత్రి 11:45 గంటలకు అనుమానితుడిని పట్టుకున్నారు. దట్టమైన పొదలు, అడవి మొక్కల మధ్య దాక్కున్న హుస్నైన్‌ను అంతర్జాతీయ సరిహద్దు, బిఎస్ కంచె మధ్య అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి సమయంలో ప్రాథమిక విచారణ కోసం అతన్ని బీఓపీ దరియా మన్సూర్‌కు తీసుకువచ్చారు. ఆగస్టు 12, 2000న జన్మించిన 24 ఏళ్ల హుస్సేన్ గుజ్రన్‌వాలాలోని మాండియాలా వాడైచ్‌లోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి వరకు చదువుకున్నాడు.
అతన్ని పట్టుకున్న సమయంలో గోధుమ రంగు సల్వార్-కుర్తా, తెల్లటి రబ్బరు చెప్పులు ధరించాడు. అతని నుండి స్వాధీనం చేసుకున్న వస్తువులలో నాలుగు పది రూపాయల నోట్లు(పాకిస్థాన్ కరెన్సీ), పాకిస్తాన్ జాతీయ గుర్తింపు కార్డు ఉన్నాయి. హుస్నైన్‌ను పంజాబ్ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం రామ్‌దాస్ పోలీస్ స్టేషన్‌లో రెండు రోజుల పోలీసు కస్టడీలో ఉన్నాడు. అతని అధికారిక అరెస్టును మే 3, 2025న నమోదు చేశారు. సంబంధిత నిఘా సంస్థలకు సమాచారం అందించారు. గురుదాస్‌పూర్‌లోని ఫార్వర్డ్ గ్రౌండ్ టీం (FGT) వివరణాత్మక విచారణ ప్రారంభించింది. అధికారులు గూఢచర్యం, అక్రమ రవాణా లేదా ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలతో సంబంధాలను పరిశీలిస్తున్నారు. ఈ చొరబాటు కారణంగా సరిహద్దు వెంబడి అప్రమత్తత పెరిగింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




