AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాక్‌ యువతితో హైదరాబాద్‌ యువకుడి ఆన్‌లైన్‌ ప్రేమ! దొడ్డిదారిలో భారత్‌కు.. కట్‌చేస్తే..

ప్రేమకు హద్దులు ఉండవని అంటుంటారు. కానీ ఇలలో సాధ్యం కాలేదు ఈ ప్రేమ జంటకు. దేశాంతరాలు దాటిన వీరి ప్రేమ దేశ సరిహద్దులు దాటలేక కటకటాల పాలయ్యారు..

పాక్‌ యువతితో హైదరాబాద్‌ యువకుడి ఆన్‌లైన్‌ ప్రేమ! దొడ్డిదారిలో భారత్‌కు.. కట్‌చేస్తే..
Pak Woman
Srilakshmi C
|

Updated on: Aug 11, 2022 | 1:26 PM

Share

Pakistani Woman tries to cross border for Hyderabadi lover: ప్రేమకు హద్దులు ఉండవని అంటుంటారు. కానీ ఇలలో సాధ్యం కాలేదు ఈ ప్రేమ జంటకు. దేశాంతరాలు దాటిన వీరి ప్రేమ దేశ సరిహద్దులు దాటలేక కటకటాల పాలయ్యారు. మన దేశ యువకుడు ఆన్‌లైన్‌లో దాయాదిదేశమైన పాకిస్థాన్‌కు చెందిన అమ్మాయిని ప్రేమించిత తప్పుడు మార్గంలో దేశ సరిహద్దులు దాటించడానికి విఫలయత్నం చేసి అడ్డంగా బుక్కయ్యారు. పాక్‌ యువతి, హైదరాబాద్‌ యువకుడి ప్రేమ వ్యవహారంలో మొత్తం ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై లోతుగా విచారణ చేపట్టిన పాతబస్తీ పోలీసులు వివరాలను సేకరించే పనిలో పడ్డారు. వివరాల్లోకెళ్తే..

పాతబస్తీలోని బహదూర్‌పురాకు చెందిన అహ్మద్‌ కొన్నేళ్లుగా సౌదీ అరేబియాలోని ఓ హోటల్‌లో పని చేస్తున్నాడు. ఇతడికి పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్‌కు చెందిన ఖాదిజా నూర్‌తో సోషల్‌ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్తా అనతికాలంలోనే ప్రేమగా చిగురించింది. ఖాదియా తల్లిదండ్రులు భారతీయుడికిచ్చి పెళ్లి చేయడానికి ససేమిరా అన్నారు. నూర్‌ ద్వారా విషయం తెలుసుకున్న అహ్మద్, ఆమెను పెళ్లి చేసుకోవడానికి అనువైన మార్గాల కోసం వెతికాడు. అందుకు పథకం కూడా పన్నాడు. సౌదీలో అహ్మద్‌ పని చేస్తున్న హోటల్లోనే కొందరు నేపాలీలు పని చేస్తున్నారు. గత కొన్ని ఏళ్లుగా కలిసుండటంతో వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. తొలుత ఖాదియాను నేపాల్‌ మీదుగా హైదరాబాద్‌ తీసురావడమేనది ప్లాన్‌. అందుకు జీవన్‌ అనే నేపాలీ సహాయం తీసకున్నారు. దీనికోసం అహ్మద్‌ తన సోదరుడు మహ్మద్‌ను రంగంలోకి దింపాడు. నకిలీ ఆధార్‌ కార్డు తీసుకుని మహ్మద్‌ గత వారం నేపాల్‌ చేరుకున్నాడు మహ్మద్‌. ఖాదియా దుబాయ్‌ మీదుగా నేపాల్‌ వచ్చి, అక్కడ జీవన్‌తో సహా ముగ్గురూ ఇండో–నేపాల్‌ సరిహద్ద అయిన బిహార్‌లోని బోర్డర్‌ ఔట్‌పోస్టుకు మంగళవారం చేరుకున్నారు.

ఇవి కూడా చదవండి

తెల్లవారుజామున అక్కడ నుంచి భారత్‌లోకి ప్రవేశిస్తూ ఎస్‌ఎస్‌బీ బలగాలకు పట్టుబడ్డారు. తనిఖీలు చేయడా హైదరాబాద్‌ మహిళగా చూపేందుకు ఖాదియా వద్ద ఆధార్‌ కార్డు, పాకిస్తాన్‌ పాస్‌పోర్టు, ఫైసలాబాద్‌లోని జీసీ ఉమెన్‌ యూనివర్సిటీలో సైకాలజీ చదువుతున్నట్లు గుర్తింపుకార్డు, పాక్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్లు లభించాయి. అనుమానం కలిగిన పోలీసులు ముగ్గురినీ అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. వీరి ముగ్గురి అరెస్టు అనంతరం.. ఖాదియా అరెస్టుకు సంబంధించి పాక్‌ ఎంబసీకి అధికారులు సమాచారం అందించారు. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న తెలంగాణ రాష్ట్ర నిఘా వర్గాలు హైదరాబాద్‌ పోలీసులతో కలిసి అహ్మద్, మహ్మద్‌లకు సంబంధించిన వివరాలు ఆరా తీస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో స్వాతంత్య్ర దినోత్సవంరానుండగా ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో లోతుగా విచారిస్తున్నారు.