Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hanumkonda: దారుణం! కోట్ల ఆస్తికోసం మతిస్థిమితంలేని మహిళను రైలెక్కించి మృతి చెందిందంటూ డ్రామా.. చివరికి..

ఆస్తిపాస్తుల కోసం ఓ మహిళలను ఆమె భర్త, కొడుకు వేధించి మతిస్థిమితం కోల్పోయేలా చేశారు. ఆ తర్వాత గుట్టు చప్పుడు కాకుండా ఆమెను రైలెక్కించి, మరణించినట్లు నమ్మబలికి, తప్పుడు ద్రువపత్రాలను..

Hanumkonda: దారుణం! కోట్ల ఆస్తికోసం మతిస్థిమితంలేని మహిళను రైలెక్కించి మృతి చెందిందంటూ డ్రామా.. చివరికి..
Hanumkonda Crime
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 11, 2022 | 11:09 AM

Hanumkonda Crime news: ఈ జిందగీలో భిన్న రకాల మనుషులున్నట్లే, భిన్న మనస్తత్వాలున్నవారు ఉంటారనేది కాదననలేని సత్యం. పతనమవుతున్న కుటుంబ విలువలు ఓ వైపు.. వాటిని శాసిస్తున్న సంపద మరోవైపు. కేవలం ఆస్తిపాస్తుల కోసం ఓ మహిళలను ఆమె భర్త, కొడుకు వేధించి మతిస్థిమితం కోల్పోయేలా చేశారు. ఆ తర్వాత గుట్టు చప్పుడు కాకుండా ఆమెను రైలెక్కించి, మరణించినట్లు నమ్మబలికి, తప్పుడు ద్రువపత్రాలను సృష్టించారు. తాడుతెగిన గాలిపటంలా తిరుగుతున్న మతిస్థిమితంలేని ఆ తల్లిని ఓ స్వచ్ఛంద సంస్థవారు చేరదీసి, ఆమె ఫొటోలు పోలీసులకు పంపారు. పోలీసులు కుటుంబ సభ్యులకు చూపిస్తే అసలామె ఎవరో తెలియదని బొంకసాగారు. సినిమా కథను తలపించేలా ఉన్న ఈ అమానవీయ ఘటన తెలంగాణ రాష్ట్రానికి చెందిన హనుమకొండలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకెళ్తే..

హనుమకొండ పోలీస్‌స్టేషన్‌ పరిధికి చెందిన మతి స్థిమితంలేని 46 యేళ్ల మహిళకు భర్త, ఒక కుమారుడు ఉన్నారు. వీరి వివాహ సమయంలో ఆమె తండ్రి కట్నకానుకల కింద ఇచ్చిన ఆస్తులు సుమారు రూ.15 కోట్లు ఉంటుంది. మరో వివాహం చేసుకున్న భర్త, మొదటి భార్య ఆస్తికాజేసి, ఆమెను వదిలించుకోవాలని పన్నాగం పన్నాడు. ఈ క్రమంలో ఆస్తి తనపేర రాయాలంటూ కుమారుడూ, భర్త నిరంతరం ఆమెను వేధించసాగారు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో కట్టుకున్నవాడు, కడుపున పుట్టినవారు తీవ్రంగా వేధించారు. ఈ వేధింపులకు తట్టుకోలేక కొన్నాళ్లకు మతిస్థిమితం కోల్పోయింది. ఆమె మరణిస్తేగానీ ఆస్తి చేజిక్కించుకోమని భావించిన తండ్రీ కొడుకులు ప్లాన్‌ వేసి 2017లో ఓ రైలు ఎక్కించి చేతులు దులుపుకున్నారు. పిచ్చిదైన తన భార్య తప్పిపోయిందని భర్త బంధువులందరినీ నమ్మించాడు. ఆ తర్వాత కొంత కాలానికి రెండో వివాహం చేసుకున్న మహిళతో విదేశాలకు చెక్కేశాడు. కొంత కాలానికి ఈ విషయాన్ని అందరూ మర్చిపోయారు.

ఇవి కూడా చదవండి

ఇక రైలెక్కిన ఆమె చెన్నైకి చేరుకోగా అక్కడి రైల్వే పోలీసుల సాయంతో ఓ స్వచ్ఛంద సంస్థ చేరదీసింది. మానసికంగా కుంగిపోయిన ఆమె పాత జ్ఞాపకాలు పూర్తిగా మరచిపోయింది. ఐతే ఆ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు ఆమెకు ఆధార్‌ కార్డు తీయాలని వేలిముద్రలు వేయించగా అప్పటికే ఆమెకు కార్డు ఉండటంతో దానిలోని అడ్రస్‌ మూలంగా హనుమకొండ జిల్లాకు చెందిన మహిళగా గుర్తించి, కుటుంబ సభ్యులను సంప్రదించేందుకు ప్రయత్నించారు. ఎవరూ స్పంధించకపోవడంతో చేసేదిలేక హనుమకొండ పోలీసులను ఆశ్రయించారు. స్వచ్ఛంద సంస్థ వారు పంపించిన ఫొటోతో మహిళ కుమారుడిని సంప్రదించగా, ఆమె తన తల్లి కాదని, మరణించి చాలా యేళ్లయిందని బుకాయించాడు. అనుమానం వచ్చిన పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది. ఆమె మరణించిందని భర్త, కొడుకు వరంగల్‌ నగర పాలక సంస్థ నుంచి మరణ ధ్రువీకరణ పత్రం తీసుకుని రూ.15 కోట్ల ఆస్తులను తమ పేర్లపై బదిలీ చేయించుకున్నారు. కేవలం ఆస్తి కోసం చనిపోయినట్లు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించారని పోలీసు నిర్ధారించుకుని, అసలు వారికి మరణ ధ్రువపత్రం ఎలా జారీ అయ్యిందనే కోణంలో విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుల వద్ద ఉన్న సదరు మహిళకు న్యాయం చేకూర్చడానికి, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుల అధికారులను సంప్రదించారు.