Onion Price Today: కేవలం రెండు రోజుల్లోనే సెంచరీ మార్క్ దాటిన ఉల్లిధర.. అక్కడ రూ.25లకే కిలో ఉల్లి

దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు హడలెత్తిస్తున్నాయి. దీపావళి పండగ నాటికి ఉల్లి ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో ఈసారి దీపావళి పండగకు ఉల్లి మరింత భారం కానుంది. కొన్ని వారాల క్రితం హడలెత్తించిన టమాట ధరలతో సామాన్యులు కుదేలయ్యారు. ఇప్పుడు టమాట బాటలో ఉల్లి కూడా ఆకాశానికి ఎగబాకుతుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్‌ నెలలో కొత్త ఉల్లి పంట మార్కెట్‌కు వచ్చే వరకూ ఉల్లి ధరలకు కళ్లెం వేసే పరిస్థితి..

Onion Price Today: కేవలం రెండు రోజుల్లోనే సెంచరీ మార్క్ దాటిన ఉల్లిధర.. అక్కడ రూ.25లకే కిలో ఉల్లి
Onion Price
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 02, 2023 | 12:09 PM

న్యూఢిల్లీ, నవంబర్‌ 2: దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు హడలెత్తిస్తున్నాయి. దీపావళి పండగ నాటికి ఉల్లి ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో ఈసారి దీపావళి పండగకు ఉల్లి మరింత భారం కానుంది. కొన్ని వారాల క్రితం హడలెత్తించిన టమాట ధరలతో సామాన్యులు కుదేలయ్యారు. ఇప్పుడు టమాట బాటలో ఉల్లి కూడా ఆకాశానికి ఎగబాకుతుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్‌ నెలలో కొత్త ఉల్లి పంట మార్కెట్‌కు వచ్చే వరకూ ఉల్లి ధరలకు కళ్లెం వేసే పరిస్థితి కనబడటం లేదు. ఆ తర్వాత ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు వ్యాపారులు సైతం అంటున్నారు.

అక్కడ సెంచరీ దాటిన ఉల్లి ధర

నవంబర్‌ నెలాఖరు వరకు ఉల్లి ధరలు పైపైకి ఎగబాకనున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో ఉల్లి ధరలు కిలో రూ.వంద మార్కుకు చేరుకుంది. ఇక మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో కూడా కిలో ఉల్లి ధర రూ.100కి చేరుతుంది. పెరిగిన ధరల దృష్ట్యా చాలా మంది పావు కిలో, అరకిలో కొని పొదుపుగా వినియోగిస్తున్నారు. ఉల్లి ధర పెరగడం వల్లనే వినియోగం తగ్గింది.

ఉల్లి ధరలకు కళ్లెంపడేది అప్పుడే..

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. డిసెంబర్‌లో ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. వాస్తవానికి డిసెంబర్‌లో మార్కెట్‌లకు కొత్త ఉల్లి సరఫరా అవుతుంది. దీని కారణంగా డిసెంబర్ నెల మధ్య నాటికి ధరలు తగ్గే అవకాశం ఉంది. అయితే కొత్త ఉల్లి పంట నవంబర్ చివరి నాటికి లేదా డిసెంబర్ నెలాఖరు వరకు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు.

ఇవి కూడా చదవండి

తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఉల్లి ఉత్పత్తిలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉందన్న సంగతి తెలిసిందే. తమిళనాడుకు ఉల్లి కావాలంటే మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలపైనే ఆధారపడి ఉంది. మహారాష్ట్ర రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు సకాలంలో రాకపోవడంతో గత నెల రోజులుగా ఉల్లి సరఫరా తగ్గింది. దీంతో ఉల్లి ధర పెరుగుతోంది. తమిళనాడులో రెండు నెలల క్రితం టమాటా ధర కిలో రూ.110 వరకు విక్రయించారు. మూడు రోజుల క్రితం వరకూ ఉల్లి రూ.25 నుంచి రూ.30 వరకు విక్రయిస్తుండగా, ప్రస్తుతం ఉల్లి కిలో రూ.80 వరకు విక్రయిస్తున్నారు. నోయిడాలో కూడా కిలో ఉల్లి ధర రూ.100. వినియోగదారుల వ్యవహారాల వెబ్‌సైట్ వెల్లడించింది. మధ్యప్రదేశ్‌లో కిలో ఉల్లి ధర రూ.53.16గా ఉంది. గోవాలో కూడా ఉల్లి ధర రూ.70 దాటింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. హైదరాబాద్‌లో నాణ్యతను బట్టి కిలో ఉల్లి ధర రూ.60 నుంచి రూ.70 వరకు ఉంది. రిటైల్ దుకాణాల్లో ఇప్పటికే కిలో రూ.90కి చేరుకోగా, త్వరలోనే కిలో రూ.100కు చేరుకుంటుందని వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు.

రూ.25 లకే కిలో ఉల్లి.. ఎక్కడెక్కడంటే

ఉల్లి ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. బఫర్ స్టాక్ ద్వారా ఉల్లిని విక్రయించడం, దిగుమతులు పెంచడం వంటివి ఉన్నాయి. ఆగస్టు రెండవ వారం నుంచి బఫర్ స్టాక్ ద్వారా కిలోకు రూ.25 ఉల్లిని విక్రయిస్తోంది. ఇందుకోసం దేశ వ్యాప్తంగా ఉన్న 170కి పైగా ప్రధాన నగరాల్లో, 685 ఉల్లి విక్రయ స్టాళ్లను ఏర్పాటు చేసింది. బఫర్ కోసం ఇప్పటికే 5 లక్షల టన్నులకు పైగా ఉన్న ఉల్లికి అదనంగా 2 లక్షల టన్నులు సేకరిస్తామని కేంద్రం ఇటీవల ప్రకటించింది. ఢిల్లీ, జైపూర్, లూథియానా, వారణాసి, రోహ్‌తక్, మరియు శ్రీనగర్‌లోని 71 ప్రదేశాలలో మొబైల్ వ్యాన్‌ల ద్వారా ఉల్లిని విక్రయిస్తోంది. హైదరాబాద్‌తోపాటు భోపాల్, ఇండోర్, భువనేశ్వర్, బెంగుళూరులో కూడా మొబైల్ వ్యాన్‌ల ద్వారా సబ్సిడీ ఉల్లిని విక్రయిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్ 20 వరకు దేశం దాదాపు 15 లక్షల టన్నుల ఉల్లిని ఎగుమతి చేసింది. అధికారిక గణాంకాల ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఉల్లి ఎగుమతులు 25 లక్షల టన్నులుగా ఉన్నాయి. ఉల్లిని ఖరీఫ్, చివరి ఖరీఫ్ మరియు రబీ మూడు సీజన్లలో పండిస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.