గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో జగన్నాథ రథయాత్ర సందర్భంగా అపశ్రుతి చోటు చేసుకుంది. రథయాత్ర చూస్తుండగా బాల్కనీ కుప్ప కూలడంతో ఒకరు మృత్యువాత పడ్డారు. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వాళ్లను అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. కాగా సరిగ్గా రథయాత్ర ఇంటి ముందు వెళ్తున్న సమయం లోనే బాల్కనీ కుప్పకూలింది. బాల్కనీ మీద నిలబడ్డ వాళ్లు కిందపడిపోయారు. దీంతో అక్కడున్న జనం షాక్‌కు గురయ్యారు. కాగా భగవాన్ జగన్నాథుని 146వ రథయాత్రకు భారీగా భక్తులు తరలివచ్చారు. సుమారు 18 కిలోమీటర్ల పాటు సాగే ఈ ఆధ్యాత్మిక యాత్ర కోసం గుజరాత్ పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎప్పుడూలేని విధంగా మొదటిసారిగా 3డి మ్యాపింగ్ టెక్నాలజీని ఉపయోగించి మొత్తం యాత్రను పర్యవేక్షిస్తున్నారు. అలాగే యాత్ర అనధికారిక డ్రోన్‌లను ఉపయోగించకుండా చూసేందుకు యాంటీ-డ్రోన్ టెక్నాలజీని కూడా ఉపయోగించారు.
ఇక దాదాపు 26,000 మంది భద్రతా సిబ్బంది యాత్రలో నిమగ్నమయ్యారు. భక్తుల రక్షణకు పెద్దపీట వేసేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..